
- మూడో విడత కింద రూ. 2 వేల కోట్లు రిలీజ్
- సీఎంకు, డిప్యూటీ సీఎంకు ధన్యవాదాలు తెలిపిన ఉద్యోగ సంఘాలు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విశ్రాంత సిబ్బందికి ఇచ్చిన హామీని రేవంత్ సర్కార్ నెరవేర్చింది. వంద రోజుల వ్యవధిలోనే మొత్తం రూ. 6 వేల కోట్ల బకాయిల చెల్లింపులను పూర్తి చేసింది. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఉద్యోగుల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తున్నామని ప్రభుత్వం తెలిపింది.
సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశాల మేరకు గురువారం మూడో విడత కింద మరో రూ. 2 వేల కోట్లను ఆర్థిక శాఖ విడుదల చేసింది. ఉద్యోగ జేఏసీ నాయకులకు ఇచ్చిన మాట ప్రకారమే ఈ నిధులను చెల్లించినట్లు అధికారులు చెప్పారు. తాజా నిర్ణయంతో సుదీర్ఘకాలంగా బకాయిల కోసం ఎదురుచూస్తున్న లక్షలాది మంది సిబ్బందికి ఊరట లభించింది. ఉద్యోగుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నట్లు నిధుల విడుదల ద్వారా ప్రభుత్వం పేర్కొంది.
మూడు సమాన విడతల్లో..
బకాయిలను ప్రభుత్వం మూడు సమాన విడతల్లో విడుదల చేసింది. మే 29న మొదటి విడతగా రూ. 2 వేల కోట్లు, జూన్ 30న రెండో విడతగా మరో రూ. 2 వేల కోట్లు, గురువారం మూడో విడతగా మిగిలిన రూ. 2 వేల కోట్లను విడుదల చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. పదవీ విరమణ పొందిన విశ్రాంత సిబ్బంది సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చింది. పెండింగ్‌లో ఉన్న కమ్యూటేషన్ బకాయిలన్నింటినీ పూర్తిగా చెల్లించింది. మిగిలిన ఇతర బకాయిలను కూడా రాబోయే రోజుల్లో దశలవారీగా చెల్లిస్తామని ఆర్థిక శాఖ తెలిపింది.
ప్రభుత్వం నిధులు విడుదల చేయడంపై ఉద్యోగులు, ఉపాధ్యాయులు, రిటైర్డ్ సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు. సంక్లిష్టమైన ఆర్థిక పరిస్థితుల్లోనూ బకాయిలు చెల్లించడం అభినందనీయమని ఉద్యోగుల జేఏసీ చైర్మన్ వి.లచ్చిరెడ్డి అన్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నందుకు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కలకు టీజీవో సంఘం ప్రెసిడెంట్ ఏలూరి శ్రీనివాసరావు, శ్యామ్ ఇతర నాయకులు ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వం చూపిన సానుకూల ధోరణి ఉద్యోగుల్లో నమ్మకాన్ని పెంచిందని చెప్పారు.