Reading Time: 2 minutes

మెదక్ జిల్లాలో ఆయిల్పామ్ సాగు పెంచేందుకు.. స్పెషల్ ప్లాన్

Caption of Image.
  •     విదేశీ విత్తనాలతో మేలైన మొక్కల పెంపకం
  •     మెదక్ జిల్లాలో 42 ఎకరాల్లో ఆయిల్​పామ్ నర్సరీ ఏర్పాటు
  •     పంపిణీకి సిద్ధంగా 4 లక్షల మొక్కలు

మెదక్/నిజాంపేట, వెలుగు: మెదక్  జిల్లాలో ఆయిల్​పామ్​ సాగును గణనీయంగా పెంచేందుకు ఉద్యానవన శాఖ అధికారులు ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్తున్నారు. జిల్లాలోని నిజాంపేట మండలం చల్మెడ గ్రామంలో ‘లీవ్  ఫామ్  రిసోర్సెస్  ప్రైవేట్  లిమిటెడ్’ కంపెనీ ఆధ్వర్యంలో 42 ఎకరాల్లో భారీ ఆయిల్  పామ్  నర్సరీని ఏర్పాటు చేశారు. ఈ నర్సరీ జిల్లా రైతులకు వరంగా మారుతోంది.

నాణ్యమైన మొక్కల కోసం.. 

ఆయిల్​ పామ్  పెంపకంలో మొక్కల ఎంపిక కీలకం. నాణ్యమైన విత్తనాలు నాటితే మంచి దిగుబడి వస్తుంది. అందుకోసం లీవ్  ఫామ్​ రీసోర్సెస్​ ప్రైవేట్​ లిమిటెడ్  కంపెనీ థాయిలాండ్, ఇండోనేషియా, మలేషియా వంటి దేశాల నుంచి ‘సిరాడ్’ అనే మేలు రకం సీడ్​ను దిగుమతి చేసుకుంటోంది. చల్మెడలోని నర్సరీలో ఈ విత్తనాలు నాటిన తరువాత మొదటి 3 నెలలు పాలిహౌస్‌‌‌‌‌‌‌‌లో  పెంచుతున్నారు. మరో 9 నెలల పాటు సెకండరీ నర్సరీలో పెంచి ఆ తరువాత నాణ్యమైన మొక్కలను రైతులకు అందిస్తున్నారు.

‘సిరాడ్’ రకం ప్రత్యేకతలివే..

సిరాడ్  రకం ఆయిల్​పామ్​ విత్తనాలు పొట్టి రకానికి చెందినవి కావడం వల్ల ఇవి తక్కువ ఎత్తు పెరుగుతాయి. తక్కువ ఎత్తు పెరగడం వల్ల గెలలు కోసే సమయంలో రైతులకు శ్రమ తగ్గి పని సులువవుతుంది. అలాగే ఈ రకం చెట్లకు వ్యాధి నిరోధక శక్తి ఎక్కువ ఉండడం వల్ల తెగుళ్లను తట్టుకునే శక్తి ఎక్కువగా ఉంటుంది. సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే ఎకరాకు ఏడాదికి 12 నుంచి-15 టన్నుల దిగుబడి సాధించవచ్చు. సాధారణంగా ఒక్కో ఆయిల్  పామ్  మొక్క మార్కెట్  ధర రూ.193 కాగా, ప్రభుత్వం రూ.173 సబ్సిడీ అందిస్తోంది. దీంతో రైతులకు రూ.20కే ఒక మొక్క లభిస్తోంది. ఒక ఎకరా సాగుకు 50 నుంచి 54 మొక్కలు అవసరం అవుతాయి.

2,266 ఎకరాలకు మొక్కల పంపిణీ..

చల్మెడ నర్సరీ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా 2,266 ఎకరాలకు సరిపడా ఆయిల్  పామ్  మొక్కలు పంపిణీ చేశారు. ప్రస్తుతం నర్సరీలో మరో 8 వేల ఎకరాలకు సరిపడేలా 4 లక్షల మొక్కలు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయని నర్సరీ నిర్వహకులు  తెలిపారు. ఇక చల్మెడ నర్సరీ ఏర్పాటుతో గ్రామీణులకు ఉపాధి అవకాశాలు మెరుగయ్యాయి. నర్సరీలో మొక్కలు నాటడం, నీటి యాజమాన్యం, పాలిహౌస్  నిర్వహణ, మొక్కల లోడింగ్  పనులతో చుట్టు పక్కల గ్రామాల నుంచి రోజూ 80 నుంచి 100 మందికి ఉపాధి లభిస్తోంది. ని గ్రామస్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

టార్గెట్ కంటే ఎక్కువ సాగు 

ఈ ఏడాది జిల్లాలో 2,500 ఎకరాల్లో ఆయిల్​ పామ్​ సాగు చేయించాలని టార్గెట్  పెట్టుకున్నాం. చల్మెడ నర్సరీలో ప్రస్తుతం1,500 ఎకరాలకు సరిపడా మొక్కలు సిద్ధంగా ఉన్నాయి. ఈ ఏడాది టార్గెట్  కంటే ఎక్కువ విస్తీర్ణంలో సాగయ్యేలా కార్యాచరణ రూపొందించాం. పక్కనే ఉన్న సిద్దిపేట జిల్లాలో క్రాప్  చేతికి రావడంతో, జిల్లా రైతులు ఆయిల్​ పామ్​ సాగుకు ఆసక్తి చూపుతున్నారు.
-ప్రతాప్ సింగ్, జిల్లా హార్టికల్చర్  ఆఫీసర్

©️ VIL Media Pvt Ltd.