
“మాజీ ‘మావోయిస్టులు’ మా పార్టీలోకి వస్తామంటే సాదరంగా ఆహ్వానిస్తాం..” అని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బి. మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. పది రోజుల పాటు వికారాబాద్‌లో జరిగిన తెలుగు రాష్ట్రాల డిసిసి అధ్యక్షుల శిక్షణా శిబిరంతో బిజి-బిజీగా గడిపిన మహేష్ కుమార్ గౌడ్ మంగళవారం గాంధీ భవన్‌కు వచ్చారు. ఈ సందర్భంగా తనను కలిసిన మీడియా ప్రతినిధులతో ఆయన ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ శిక్షణా శిబిరం సంతృప్తికరంగా జరిగిందన్నారు. లొంగిపోయిన మావోయిస్టులు కాంగ్రెస్ పార్టీలోకి వస్తానంటే ఆహ్వానం పలుకుతాం అని ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
అయితే ఈ విషయంలో తాము ఎవరినీ అడగలేదని, వారూ తమను సంప్రదించలేదని ఆయన తెలిపారు. నమ్ముకున్న సిద్ధాంతం కోసం మావోయిస్టులు దశాబ్దాలుగా పని చేశారని ఆయన చెప్పారు. ప్రజల కోసం పోరాడిన వారిపై తమకు గౌరవం ఉందన్నారు. తామైనా, మావోయిస్టులైనా పేద ప్రజల అభ్యున్నతి కోసమే పోరాటం చేస్తున్నామని ఆయన వివరించారు.ఆపరేషన్ కగార్‌ను తాము వ్యతిరేకించామని ఆయన తెలిపారు. పాకిస్థాన్‌తో చర్చలకు అంగీకరించిన ప్రధాని నరేంద్ర మోడీ మావోయిస్టులతో చర్చలకు ఎందుకు అంగీకరించడం లేదని ఆయన ప్రశ్నించారు.
బిఆర్‌ఎస్‌పై మండిపాటు
రాజ్యసభ స్థానాల ఎంపిక గురించి ప్రశ్నించగా, బుధవారం పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని ఆయన తెలిపారు. బిఆర్‌ఎస్‌కు రాజ్యసభ స్థానాలు దక్కే అవకాశం ఉన్నప్పుడు ఆ పార్టీ కార్పొరేట్ శక్తులకు అవకాశం కల్పించిందే తప్ప తెలంగాణ కోసం పని చేసిన వారిలో ఒక్కరికైనా రాజ్యసభ అవకాశం ఇచ్చిందా? అని ఆయన మరో ప్రశ్నకు సమాధానంగా ఎదురు ప్రశ్నించారు.
త్వరలో కొన్ని నామినేటెడ్ పదవులు
కార్పొరేషన్ పదవులపై కసరత్తు జరుగుతోందని ఆయన తెలిపారు. పార్టీ కోసం కష్టపడి పని చేసిన వారిని గుర్తించామని ఆయన చెప్పారు. పలు కార్పొరేషన్ల నామినేటెడ్ పదవులు భర్తీ చేస్తామని ఆయన తెలిపారు. ఖమ్మం జిల్లా, వెలుగుమట్ల గ్రామ ప్రజల విషయంలో పినరయి విజయ్ వ్యాఖ్యలపై మంత్రి పొంగులేటి సమాధానం చెబుతారని ఆయన చెప్పారు. రాజకీయాల కోసమే పినరయి విజయ్ మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. కేరళలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని మహేష్ కుమార్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు.