Reading Time: 3 minutes

తెలంగాణ రాష్ట్రంలో విలువైన ఖనిజ సంపదకు, సహజ వనరులు కలిగిన ప్రాంతాలకు పేరుగాంచిన జిల్లాలో ప్రధానమైనది జయశంకర్ భూపాలపల్లి. రాష్ట్రవ్యాప్తంగా జిల్లాల విభజనలో భాగంగా వరంగల్ జిల్లాలో ఉన్న భూపాలపల్లిని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయడం జరిగింది. భూపాలపల్లి జిల్లా కేంద్రానికి కొద్ది దూరంలో (సుమారు 20 కిలోమీటర్ల) ఉన్న రేగొండ మండల కేంద్రానికి కూతవేటు దూరంలో రంగయ్యపల్లె గ్రామం ఉంది. పూర్వీకుల కథనం ప్రకారం ఏడునుతుల రంగారావు పాలనలో గ్రామం ఉండేది. కావున ఈ గ్రామానికి రంగయ్యపల్లె పేరు రావడం జరిగిందని కథనం. రంగయ్య పల్లె గ్రామం 3555.01 ఎకరాల విస్తీర్ణం కలిగి ఉంది. గ్రామంలో పురుషుల ఓట్లు 1048 స్త్రీల ఓట్లు 1061 మొత్తంగా 2108 ఓటర్లు ఉన్నారు. రంగయ్యపల్లి గ్రామం ఆది నుండి ఎన్నో విలక్షణమైన ఆలోచనలకు నిలయం. సుమారు 20 సంవత్సరాల క్రితమే గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నిర్మాణం చేపట్టి చుట్టుపక్కన గ్రామాల విద్యార్థి లోకానికి విద్యాప్రదాయినిగా మారింది. పదవ తరగతి విద్యార్థులకు విద్యాబోధనకు కావలసిన వసతుల ఏర్పాటు జరిగింది. ఈ పాఠశాల స్థలం కూడా గ్రామానికి చెందిన పెద్దలు నూనె పుల్లయ్య సేవాభావంతో దానం చేయడం జరిగింది.

రంగయ్యపల్లి గ్రామం ఎన్నో విశిష్టమైన కార్యక్రమాలకు పునాది లాంటిది. ఎన్నో రకాల కులాలు ఉండి కులవృత్తులను చేసుకుంటూ ఇప్పటికీ ఐక్యతతో విరాజిల్లుతుంది. యాదవులు, గీతకార్మికులు, రజకులు, రెడ్డిలు, వెలమలు, కుమ్మరి, కమ్మరి, వడ్రంగి, నాయీబ్రాహ్మణులు ఇలా పలు రకాల చేతివృత్తులకు సంబంధించిన కుటుంబాలు ఉండటం విశేషం. ఎన్ని కులాలు ఉన్నా గ్రామానికి సంబంధించిన ప్రగతిని సాధించే దిశగా అందరూ సంఘటితమై శ్రమించడమే ఈ గ్రామ ప్రజల గొప్ప లక్షణం. రంగయ్యపల్లి గ్రామంలో ప్రజలు వ్యవసాయ రంగంలో కూడా తమదైన నూతన శైలిని అవలంబిస్తున్నారు. పెరుగుతున్న ఆధునికతను గమనిస్తూనే బిందుసేద్యపు విధానాలను ఉపయోగిస్తూ సేంద్రియ ఎరువుల వాడకం గురించి తెలుసుకుంటూ వినియోగిస్తున్నారు. గ్రామంలో ప్రైవేటు, ప్రభుత్వ ఉపాధ్యాయ వృత్తిని చేపట్టి ఎంతో మంది విద్యార్థుల భవితకై శ్రమిస్తున్న విద్యావంతులు కూడా ఉన్నారు. సకల కళలకు రంగయ్యపల్లి గ్రామం ఒక భాండాగారం అని చెప్పవచ్చు. కవులు, కళాకారులు కూడా ఈ గ్రామంలో తమ ప్రత్యేక ఉనికిని చాటుకుంటున్నారు. దేశ రక్షణలో, పోలీసు వ్యవస్థలో కొంత మంది యువకులు గ్రామ సత్తానుచాటారు.

అంతేకాకుండా బహుళజాతి సంస్థలో, ఫార్మా కంపెనీలలో నేటికి ఉద్యోగాలు చేస్తూ తమతోటి వారికి ఉపాధి అవకాశాలను కల్పించే దిశగా యువకులు అడుగులు వేస్తున్నారు. గతంలో గ్రామ సర్పంచ్‌గా ఉన్న దగ్గు వెంకన్న బతుకమ్మ సంబరాలు నిర్వహించడానికి స్థలం లేకపోవడంతో తన సొంత డబ్బులతో స్థలం విక్రయించి గ్రామానికి అంకితం చేశారు. అదే విధంగా చుట్టుపక్కన గ్రామాలు తాగునీటి సమస్యతో సతమతమవుతున్న రోజుల్లో సైతం అలుపెరుగని పోరాటపటిమతో నాటి ఎంపిటిసి బింగి రాజయ్య నిధులను సమకూర్చి వాటర్ ట్యాంకు, బావి నిర్మాణం చేయడం జరిగింది. అది నేటికీ తాగునీటి సరఫరా విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రజా అవసరాలకు ఆసరా నిలుస్తుంది. స్వరాష్ట్ర సాధనలో సైతం రంగాపల్లి గ్రామంలో జంగ సైరన్ మోగింది. 2002 సంవత్సరంలోనే గ్రామానికి చెందిన పున్నం రవి తెలంగాణ ఉద్యమ పోరులో ప్రధాన భూమిక పోషించాడు. ఆ తర్వాత ఎంపిటిసి, సర్పంచ్, ఎంపిపి ఇలా పలు బాధ్యతల్లో ప్రజలకు సేవలు అందించి తనదైన ముద్రవేశాడు.

ఆధ్యాత్మిక, అద్వైత ఆలోచనలకు సైతం గ్రామంలో బీజంపడింది. బండి చక్రపాణి గౌడ్ సారథ్యంలో అచల పరిపూర్ణ బోధన నిర్వహిస్తూ గురువు గొప్పతనం జీవితం ఒక పరమార్థం మోక్షం, కుటుంబాలు, బంధాల గురించి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రంగయ్యపల్లి గ్రామంలో కులమతాలకు అతీతంగా పీర్ల పండుగను (మొహరం) భక్తిశ్రద్ధలతో జరుపుకోవడం గొప్ప ఆనవాయితీ. గ్రామంలో 15 గుంటలతో పల్లె ప్రకృతి వనం ఏర్పాటు చేసుకుని అందులో కృష్ణ, తులసి, కానుగా గులాబీ, గన్నేరు, మల్లెదురుషన్, కారునో కార్పస్ మొక్కలను పెంచుతున్నారు. తడి, పొడి చెత్త సేకరించి గ్రామపంచాయతీ ట్రాక్టర్ ద్వారా సేకరించి షెడ్‌కి తరలించి తడి చెత్తను కంపోస్ట్‌పెట్లో లోవేసి అందులో వానపాములను వేసి ప్రతిరోజు వాటరింగ్ చేస్తున్నారు. 45 రోజుల నుండి 60 రోజుల్లో కంపోస్టు ఎరువు తయారవుతుంది. దానిని జల్లెడ పట్టి ప్యాక్ చేసి రైతులకు తక్కువ ధరకు అందజేస్తున్నారు.

ఈ మధ్యకాలంలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలలో గెలుపొందిన నూతన పాలకవర్గం వినూత్నమైన ఆలోచనకు శ్రీకారం చుట్టింది. కేవలం గెలుపును సొంతం చేసుకోవడమే నాయకుల లక్షణం కాదని గ్రామ సమగ్ర అభివృద్ధికి చర్యలు చేపట్టే దిశగా కార్యాచరణను రూపొందించింది. గ్రామ సర్పంచ్ అధ్యక్షతగా గ్రామంలో ఉన్న పది వార్డులకు సంబంధించిన వార్డు సభ్యులకు ఒక్కో శాఖను కేటాయించారు. కేటాయించిన శాఖ బాధ్యతలను, విధి విధానాలకు సంబంధించి అవగాహన కల్పించారు. గత నాలుగు సంవత్సరాల క్రితం గ్రామ పంచాయతీ కార్యదర్శిగా జీవిత బాధ్యత తీసుకున్నప్పటి నుండి నేటికీ గ్రామంలో అందరికీ తలలో నాలుకలా ఉంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన పథకాలపట్ల ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.

గ్రామం సమస్యల పట్ల ఎప్పటికప్పుడు గ్రామసభలు నిర్వహిస్తూ గ్రామపంచాయతీ పాలకవర్గాన్ని సమన్వయపరుస్తూ పలు రకాల సూచనలు చేస్తున్నారు. గ్రామ పురోగతి, ప్రజాసంక్షేమం పట్ల అవిరాళంగా శ్రమిస్తున్నారు. ఈ వినూత్న ఆలోచనపట్ల తనదైన శైలిలో భూమికను పోషిస్తున్నారు. పార్టీలకు అతీతంగా పంచాయతీ పాలకవర్గం గ్రామానికి సంబంధించిన ప్రజాసంక్షేమం, విద్య, ఆరోగ్యం, పారిశుద్ధ్య కార్యక్రమాలలో నిస్వార్థంగా సేవ చేసి రంగయ్యపల్లి ఒక ఆదర్శ గ్రామంగా గుర్తింపు పొందాలని గ్రామస్థులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అదే విధంగా రాష్ట్రవ్యాప్తంగా, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న సింగరేణి, జెన్ కో లాంటి ప్రభుత్వ ప్రభుత్వయేతర సంస్థలు సిఎస్‌ఆర్ నిధుల్లో భాగంగా రంగయ్యపల్లి గ్రామానికి సహాయ, సహకారాలు అందించి గ్రామపంచాయతీ పాలకవర్గం తీసుకున్న నిర్ణయానికి చేయూతనివ్వాల్సిందని కోరుకుంటున్నారు.

– వంశీకృష్ణ గౌడ్

95508 37962