Reading Time: < 1 minute

ఖమ్మం జిల్లా వెలుగుమట్ల గ్రామంలో భూదాన్ భూముల్లో వెలిసిన ఇళ్ల కూల్చివేత ఘటనను ‘బుల్డోజర్ రాజ్’గా అభివర్ణిస్తూ కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఎక్స్ వేదికగా చేసిన వ్యాఖ్యలను రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఇది కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం చేస్తున్న అసత్య ప్రచారమని ఆయన కొట్టిపారేశారు. వెలుగుమట్ల గ్రామంలోని భూదాన్ భూములను భూ మాఫియా నకిలీ పత్రాలతో అమాయక పేదలకు విక్రయించిందని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వం నిబంధనలకు లోబడే పనిచేస్తోందని, ప్రభుత్వ ఆస్తులను కాపాడటం భవిష్యత్తు తరాల కోసం అవసరమని పేర్కొన్నారు.

దీనిని ‘బుల్డోజర్ రాజ్’ అని పిలవడం ప్రజలను తప్పుదోవ పట్టించడమేనని మండిపడ్డారు. ఇళ్లు కోల్పోయిన అర్హులైన పేదలకు ‘ఇందిరమ్మ ఇండ్లు’ పథకం ద్వారా పక్కా గృహాలను అందిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. భూ మాఫియాపై కఠిన చర్యలు తీసుకోవడమే కాకుండా, వారు పేదల నుండి వసూలు చేసిన సొమ్మును తిరిగి ఇప్పించేలా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని వెల్లడించారు. రాజకీయ లబ్ధి కోసం కేరళ కాంగ్రెస్‌ను ఈ వివాదంలోకి లాగడం సరికాదు అని హితవు పలికారు. తమ ప్రభుత్వం ఎప్పుడూ పేదల పక్షపాతిగానే ఉంటుందని మంత్రి పొంగులేటి ఎక్స్ వేదికగా ఉద్ఘాటించారు.