Reading Time: 2 minutes
Flaxseed Podi Benefits For Weight Loss And Hair Growth

Flaxseed Podi: నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మన ఆహారపు అలవాట్లు పూర్తిగా మారిపోయాయి. దీనివల్ల స్థూలకాయం, జుట్టు రాలడం వంటి సమస్యలు సర్వసాధారణమయ్యాయి. అయితే, పూర్వీకుల కాలం నాటి కొన్ని ఆహార పదార్థాలను మన దైనందిన జీవితంలో భాగం చేసుకుంటే లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అటువంటి వాటిలో ‘అవిస గింజలు’ (Flaxseeds) అగ్రస్థానంలో నిలుస్తాయి. రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం అందించే ఈ ‘అవిస గింజల కారప్పొడి’ విశేషాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం.

READ ALSO: PAK vs SL: చరిత్ర సృష్టించిన పాక్ స్టార్ బ్యాటర్.. విరాట్ కోహ్లీ 12 ఏళ్ల రికార్డ్ బద్ధలు..

పోషకాల గని..
అవిస గింజల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఉండే పీచు పదార్థం (Fiber) జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా, బరువు తగ్గాలనుకునే వారికి ఒక అద్భుతమైన ఔషధంలా పనిచేస్తుంది. ప్రోటీన్ శాతం అధికంగా ఉండటం వల్ల పిల్లల్లో తెలివితేటలు, ఎముకల బలానికి ఇది ఎంతగానో తోడ్పడుతుంది. కేవలం ఆరోగ్యమే కాదు, వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకుని తింటే అమృతంగా ఉండే ఈ కారప్పొడిని సులభంగా తయారు చేసుకోవచ్చు.

తయారీ విధానం..
ముందుగా ఒక కప్పు అవిస గింజలను సన్నటి సెగ మీద చిటపటలాడే వరకు కమ్మటి వాసన వచ్చేలా వేయించుకోవాలి. ఆ తర్వాత అర కప్పు నువ్వులు, పావు కప్పు ధనియాలు, ఒక గుప్పెడు కరివేపాకును వేర్వేరుగా దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. కారానికి తగినట్లుగా 20-25 ఎండుమిర్చిని తుంచి వేయించుకోవాలి. ఆపై రెండు టేబుల్ స్పూన్ల చొప్పున పచ్చి శెనగపప్పు, మినప్పప్పు వేయించి, చివరగా కొంచెం జీలకర్ర, అర టీస్పూన్ మెంతులు, కొద్దిగా చింతపండు వేసి వేడి చేయాలి. వేయించిన పదార్థాలన్నీ పూర్తిగా చల్లారాక మిక్సీ జార్‌లోకి తీసుకుని.. తగినంత ఉప్పు, పావు టీస్పూన్ ఇంగువ వేసి మెత్తగా పొడి చేసుకోవాలి. పొడి పూర్తయ్యాక 15 వరకు వెల్లుల్లి రెబ్బలను పొట్టుతో సహా వేసి పల్స్ మోడ్‌లో ఒక్కసారి తిప్పితే గుమగుమలాడే అవిస పొడి సిద్ధమవుతుంది.

ఈ పొడిని గాలి చొరబడని సీసాలో భద్రపరిస్తే రెండు నెలల వరకు తాజాగా ఉంటుంది. రోజువారీ భోజనంలో మొదటి రెండు మూడు ముద్దలు ఈ పొడితో తింటే చర్మం కాంతివంతంగా మారడమే కాకుండా, వయస్సు పైబడకుండా (Anti-aging) కాపాడుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. మరెందుకు ఆలస్యం? వంటింటినే వైద్యశాలగా మార్చుకుంటూ, ఈ రుచికరమైన ఆరోగ్య పొడిని మీరు కూడా ప్రయత్నించండి.

READ ALSO: Air India: గల్ఫ్ వెళ్లే వారికి బ్యాడ్ న్యూస్.. రన్ వే పైనే ఆగిపోయిన ఎయిర్ ఇండియా విమానాలు! అసలు కారణమిదే..