Reading Time: 2 minutes

శ్రీలంకతో రెండో టెస్టు డ్రా..సిరీస్ టీమిండియాదే

Caption of Image.
  • రెండో టెస్ట్‌‌ను డ్రాగా ముగించిన ఇండియా
  • 1- 0తో సిరీస్‌‌ టీమిండియా సొంతం
  • నిరాశపర్చిన గిల్​సేన బౌలర్లు..
  • దినుషా అద్భుత సెంచరీ

కొలంబో: ఎనిమిది మంది బౌలర్లు.. మూడు సెషన్ల పాటు 82.4 ఓవర్లు ఏకధాటిగా బౌలింగ్‌‌ చేసిన ఇండియా బౌలర్లు..  శ్రీలంకవి 4 వికెట్లు తీయలేకపోయారు. సోనల్‌‌ దినుషా (264 బాల్స్‌‌లో 8 ఫోర్లు, 2 సిక్స్‌‌లతో 133) అద్భుత పోరాటంతో అసలైన టెస్ట్‌‌ మ్యాచ్‌‌ను చూపించాడు. 420 నిమిషాల పాటు క్రీజులో నిలిచి మన బౌలర్లకు పట్టపగలే చుక్కలు చూపించాడు. కేశార నువాంత (150 బాల్స్‌‌లో 4 ఫోర్లతో 46) కూడా పోరాట స్ఫూర్తి చూపెట్టడంతో.. ఇరుజట్ల మధ్య గురువారం ముగిసిన రెండో టెస్ట్‌‌ డ్రా అయ్యింది. దాంతో రెండు మ్యాచ్‌‌ల సిరీస్‌‌ను టీమిండియా 1–0తో సొంతం చేసుకున్నా.. లంకేయులు చిరస్మరణీయ డ్రాతో టెస్ట్‌‌ మ్యాచ్‌‌లకు మళ్లీ  ప్రాణం పోశారు. 229/6 ఓవర్‌‌నైట్‌‌ స్కోరుతో ఆఖరి రోజు ఆట కొనసాగించిన లంక రెండో ఇన్నింగ్స్‌‌ను 154 ఓవర్లలో 429/9 స్కోరు వద్ద డిక్లేర్‌‌ చేసింది. ఈ టెస్ట్​లో రెండు సెంచరీలు చేసిన దినుషాకు ‘ప్లేయర్‌‌ ఆఫ్‌‌ ద మ్యాచ్‌‌’ అవార్డు లభించగా, దేవదత్‌‌ పడిక్కల్‌‌ (328 రన్స్‌‌) ‘ప్లేయర్‌‌ ఆఫ్‌‌ ద సిరీస్‌‌’ అవార్డును సొంతం చేసుకున్నాడు. గాలెలో జరిగిన తొలి మ్యాచ్‌‌లో ఇండియా 165 రన్స్ తేడాతో గెలిచిన సంగతి తెలిసిందే. 

ఫాలో ఆన్‌‌ను పక్కనబెట్టి..

ఫాలో ఆన్‌‌ ఒత్తిడిని ఏమాత్రం పట్టించుకోని లంక టెయిలెండర్లు ఈ మ్యాచ్‌‌లో అద్భుతంగా పోరాడారు. రెండో ఇన్నింగ్స్‌‌లో 16 రన్స్‌‌ ఆధిక్యంతో ఐదో రోజు ఆట కొనసాగించిన లంక తొలి సెషన్‌‌లోనే ఆలౌట్‌‌ అవుతుందని భావించారు. కానీ ఓవర్‌‌నైట్‌‌ బ్యాటర్లు దినుషా, నువాంత పోరాట స్ఫూర్తి ముందు ఇండియా బౌలర్లు తేలిపోయారు. రెగ్యులర్‌‌ బౌలర్లతో పాటు పార్ట్‌‌ టైమర్లుగా కెప్టెన్‌‌ శుభ్‌‌మన్‌‌ గిల్‌‌, యశస్వి జైస్వాల్‌‌, ధ్రువ్‌‌ జురెల్‌‌ కూడా వికెట్ల కోసం ప్రయత్నించి విఫలమయ్యారు. కనీసం ఒక్క ఔటయ్యే చాన్స్‌‌ కూడా ఇవ్వకుండా ఆడిన దినుషా, నువాంత.. ఏడో వికెట్‌‌కు 246 బాల్స్‌‌లో 112 రన్స్‌‌ జోడించారు. ఫలితంగా ఒక్క వికెట్‌‌ కూడా కోల్పోకుండా లంక 329/6 స్కోరుతో లంచ్‌‌కు వెళ్లింది. అయితే లంచ్‌‌ తర్వాత తొలి ఓవర్‌‌లోనే ఇండియాకు వికెట్‌‌ లభించింది. మానవ్‌‌ సుతార్‌‌ (3/121) మిడిల్‌‌ లెగ్‌‌ మీద వేసిన టాప్‌‌ స్పిన్‌‌ బాల్‌‌ టర్న్‌‌ అయ్యి నువాంత బ్యాట్‌‌ ఎడ్జ్‌‌ను తాకింది. స్లిప్‌‌లో ఉన్న జురెల్‌‌ దాన్ని సురక్షితంగా అందుకున్నాడు.

స్కోరు 330/7గా మారింది. తర్వాత వచ్చిన ప్రభాత్‌‌ జయసూర్య (28 బాల్స్‌‌లో 2) డిఫెన్స్‌‌కే ప్రాధాన్యమిచ్చాడు. దినుషా కూడా అలాగే ఆడుతూ సమయాన్ని వృథా చేశాడు. ఫలితంగా ఎనిమిదో వికెట్‌‌కు 25 రన్స్‌‌ జత చేయడం కోసం 74 బాల్స్‌‌ ఆడారు. చివరకు 117వ ఓవర్‌‌లో జడేజా (3/94) వేసిన టర్నింగ్‌‌ బాల్‌‌ జయసూర్య బ్యాట్‌‌ ఎడ్జ్‌‌ను తాకి మళ్లీ జురెల్‌‌ చేతుల్లోకి వెళ్లింది. లంక స్కోరు 355/8 అయ్యింది. అప్పటికే దినుషా ఓ ఎండ్‌‌లో డెడ్‌‌ డిఫెన్స్‌‌తో పాతుకుపోగా.. తర్వాత వచ్చిన లాహిరు కుమార (90 బాల్స్‌‌లో12 రన్స్‌‌, 122 నిమిషాలు) కూడా బ్యాట్‌‌ ఝుళిపించకుండా, వికెట్‌‌ ఇవ్వకుండా ఇండియా బౌలర్లకు చెమటలు పట్టించాడు. టీ బ్రేక్‌‌కు లంక 383/8 స్కోరు చేసింది. బ్రేక్‌‌ నుంచి వచ్చిన తర్వాత కూడా వీళ్ల బ్యాటింగ్‌‌లో ఎలాంటి మార్పు రాలేదు. ఈ ఇద్దరు కలిసి తొమ్మిదో వికెట్‌‌కు 47 రన్స్‌‌ జోడించడానికి 170 బాల్స్‌‌ ఆడి ఇండియా విజయం ఆశలపై నీళ్లు చల్లారు. అయినప్పటికీ వికెట్‌‌ కోసం తీవ్రంగా శ్రమించిన జడేజా.. ఓ ఫుల్‌‌ లెంగ్త్‌‌ బాల్‌‌తో కుమారను ఔట్‌‌ చేశాడు. బ్యాక్‌‌ ఫుట్‌‌ ఆడిన కుమార షార్ట్‌‌ లెగ్‌‌లో జైస్వాల్‌‌కు క్యాచ్‌‌ ఇచ్చాడు. స్కోరు 402/9గా మారింది. ఈ క్రమంలో దినుషా 196 బాల్స్‌‌లో సెంచరీ పూర్తి చేయగా, చివర్లో అసితా ఫెర్నాండో (0 నాటౌట్‌‌) వికెట్‌‌ పడకుండా జాగ్రత్తగా ఆడి మ్యాచ్‌‌ డ్రా అయ్యేలా చూశాడు. 

సంక్షిప్త స్కోర్లు

ఇండియా తొలి ఇన్నింగ్స్‌‌: 503/9 డిక్లేర్డ్‌‌. శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌‌: 290 ఆలౌట్‌‌. శ్రీలంక రెండో ఇన్నింగ్స్‌‌ (ఫాలో ఆన్‌‌): 154 ఓవర్లలో 429/9 డిక్లేర్డ్‌‌ (సోనల్‌‌ దినుషా 133*, నువాంత 46, మానవ్‌‌ సుతార్‌‌ 3/121, జడేజా 3/94). 

ఫాలో ఆన్‌‌ స్థితిలో ఒకే టెస్ట్‌‌  మ్యాచ్‌‌లో రెండు సెంచరీలు చేసిన మూడో బ్యాటర్‌‌ సోనల్‌‌ దినుషా, విజయ్‌‌ హజారే (ఇండియా), ఆండీ ఫ్లవర్‌‌ (జింబాబ్వే) ముందున్నారు.

©️ VIL Media Pvt Ltd.