Reading Time: 2 minutes

ఈవీలతో 5 కోట్ల జాబ్స్.. 2030 నాటికి  ఈవీల మార్కెట్ సైజు  రూ.20 లక్షల కోట్లకు 

Caption of Image.
  •     ప్రస్తుతం మొత్తం ఆటో ఇండస్ట్రీ మార్కెట్​ విలువ రూ.22 లక్షల కోట్లు
  •     రవాణా ఖర్చులను 8 శాతానికి తగ్గిస్తాం
  •     కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడి

న్యూఢిల్లీ: మనదేశ ఎలక్ట్రిక్  ​వెహికల్స్​(ఈవీ) మార్కెట్ విలువ 2030 నాటికి రూ.20 లక్షల కోట్లకు చేరుకుంటుందని, ఫలితంగా కొత్తగా ఐదు  కోట్ల కొత్త ఉద్యోగాలు వస్తాయని  కేంద్ర రోడ్డు రవాణా, హైవే శాఖల మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. ఢిల్లీలో గురువారం నిర్వహించిన ఒక సదస్సులో ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం దేశంలో 57 లక్షల ఈవీలు రిజిస్టర్ కాగా, వాటి మార్కెట్ వాటా ఏడు శాతం ఉందన్నారు.

రాబోయే ఐదేళ్లలో దేశీయ ఆటోమొబైల్ పరిశ్రమను ప్రపంచంలోనే మొదటి స్థానంలో నిలపడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.‘‘ప్రస్తుతం భారత్ ఆటోమొబైల్ పరిశ్రమ విలువ రూ.22 లక్షల కోట్లకు చేరింది. అమెరికా తొలి స్థానంలో, చైనా రెండో స్థానంలో ఉన్నాయి. పెట్రో ప్రొడక్టులను విదేశాల నుంచి కొనేందుకు మనం ఏటా రూ.22 లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నాం. దీనివల్ల తీవ్రమైన కాలుష్య సమస్య ఏర్పడుతోంది. దేశంలో రవాణా ఖర్చులను ఎనిమిది శాతానికి తగ్గించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఐఐటీ చెన్నై, ఐఐటీ కాన్పూర్, ఐఐఎం బెంగళూరు సంస్థల నివేదిక ప్రకారం, ఎక్స్‌‌ప్రెస్‌‌ వేల నిర్మాణంతో రవాణా ఖర్చు 16 శాతం నుంచి 10 శాతానికి తగ్గింది. బజాజ్, హీరో సంస్థలు తమ వాహనాల్లో సగానికిపైగా విదేశాలకు ఎగుమతి చేస్తున్నాయి. దేశంలో ఏటా లక్ష ఎలక్ట్రిక్ బస్సులకు డిమాండ్ ఉండగా, 60 వేల బస్సులు మాత్రమే తయారవుతున్నాయి” అని మంత్రి వివరించారు.

బ్యాటరీ భాగాల తయారీకి రూ.13 వేల కోట్లు

ఈవీల బ్యాటరీల కోసం చైనా దేశంపై ఆధారపడటాన్ని పూర్తిగా తగ్గించుకోవడానికి కేంద్రం ప్లాన్​రెడీ చేసింది.  బ్యాటరీ విడిభాగాల తయారీని ప్రోత్సహించడానికి దాదాపు రూ.13 వేల కోట్ల సాయం అందించనుంది. చైనా మాదిరి తక్కువ ధరల్లోనే బ్యాటరీలను తయారు చేయించడానికి కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని అధికారవర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఎలక్ట్రిక్ కార్ల బ్యాటరీల తయారీకి సబ్సిడీలను అందిస్తున్నప్పటికీ, కంపెనీలకు సరఫరా సంబంధిత సమస్యలు వస్తున్నాయి. దీనికి పరిష్కారంగా ఈ పథకాన్ని అమలు చేస్తారు.  బ్యాటరీ తయారీకి అవసరమైన అనోడ్, కాథోడ్, ఎలక్ట్రోలైట్లు, సెపరేటర్ ఫిల్మ్  కాపర్ ఫాయిల్​ తయారీకి ప్రోత్సాహకాలు ఇస్తారు. వీటిని దేశీయంగానే తయారు చేసేందుకు ఈ నిధులు ఉపయోగపడతాయి. ఈ కొత్త పథకాన్ని ఇప్పటికే ఉన్న 50 గిగావాట్ అవర్ల బ్యాటరీ తయారీ కార్యక్రమం ఆధారంగా రూపొందించారు. ఓలా, టాటా, ఎక్సైడ్, హైదరాబాద్​కు చెందిన అమర రాజా వంటి కంపెనీలు ప్రభుత్వ సహాయం లేకుండానే సొంతంగా బ్యాటరీలను తయారు చేస్తున్నాయి. 

©️ VIL Media Pvt Ltd.