Reading Time: 2 minutes

300 మంది భారతీయుల కోసం వెతుకుతున్నాం.. బతికి ఉన్నారో లేదో తెలియదు

Caption of Image.

ఖాట్మండు: నేపాల్‎లో ఆకస్మిక వరదలు బీభత్సం సృష్టించాయి. ఈ వరదల్లో చిక్కుకుని ఇప్పటి వరకు 160 మందికి పైగా చనిపోగా.. వందల సంఖ్యలో ప్రజలు గల్లంతయ్యారు. ఈ క్రమంలో ఫ్లాష్ ఫ్లడ్స్ వల్ల సంభవించిన ప్రాణ, ఆస్తి నష్టం గురించి నేపాల్ విదేశాంగ శాఖ మంత్రి శిశిర్ ఖనాల్ ప్రాథమిక వివరాలు వెల్లడించారు. బుధవారం (ఆగస్ట్ 26) నేపాల్‌లో సంభవించిన ఆకస్మిక వరదల కారణంగా 800 మంది గల్లంతు అయ్యినట్లు తెలిపారు. ఇందులో 300 మంది భారతీయులు ఉన్నట్లు వెల్లడించారు. 

ఈ వరదల వల్ల ఇప్పటి వరకు కనీసం 160 మంది మరణించారని ఆయన చెప్పారు. ఆకస్మిక వరదలతో దేశమంతటా తీవ్ర నష్టం వాటిల్లిందని.. విపత్తు పూర్తి స్థాయిని నిర్ధారించడానికి ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ఒక్కసారిగా విరుచుకుపడ్డ ఆకస్మిక వరదలతో వేలాది కుటుంబాలు ఇళ్లను కోల్పోయాయని.. వేల సంఖ్యలో ప్రజలు నిరాశ్రయులు అయ్యారని పేర్కొన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదికన సహయక చర్యలు కొనసాగిస్తున్నట్లు తెలిపారు. 

నేపాల్లో ఆకస్మిక వరదల పెను విధ్వంసం:

హిమాలయ దేశం నేపాల్లో బుధవారం (ఆగస్ట్ 26) ఆకస్మిక వరదలు పెను విధ్వంసం సృష్టించాయి. టిబెట్ సరిహద్దు ప్రాంతం నుంచి ఉగ్రరూపం దాల్చి ప్రవహిస్తున్న భోటే కోశీ నది ఉధృతికి నువాకోట్, ధాదింగ్ జిల్లాలు అతలాకుతలమయ్యాయి. క్షణాల వ్యవధిలోనే వరద నీరు ముంచెత్తడంతో పలు గ్రామాలు పూర్తిగా కొట్టుకుపోయాయి. ఈ విపత్తులో ఇప్పటివరకు 157 మంది మృతి చెందగా, వందలాది మంది గల్లంతయ్యారు.

భూకంపంతో సుమారు 17 వేల అడుగుల ఎత్తున ఉన్న గ్లేసియర్ నుంచి 2 వేల అడుగుల వెడల్పు గల భారీ మంచు దిమ్మె అకస్మాత్తుగా విరిగిపడింది. ఆ మంచు దిమ్మె దాదాపు 4 వేల అడుగుల లోతులోని లోయలోకి పడటంతో తీవ్ర ఒత్తిడి వల్ల మంచు, నీరు, రాళ్ల మిశ్రమంగా మారి ‘లెండె ఖోలా’, ‘భోటేకోశీ’ నదుల్లోకి ఉప్పొంగింది. ఈ ప్రవాహం దిగువనున్న గ్రామాలను ముంచెత్తింది.

టిబెట్లో పుట్టి నేపాల్లోని త్రిశూలి నదిలో కలిసే భోటే కోశీ నది ఉగ్రరూపం దాల్చడంతో టిమురే బజార్, రసువా సరిహద్దు ప్రాంతాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. సుమారు 12 గ్రామాలు వరద ముంపునకు గురయ్యాయి. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. ఈ వరద ప్రవాహం క్రమంగా భారత్లోని గండక్ నది వైపు వెళ్తుండటంతో నదీ పరీవాహక ప్రాంతాల్లో అప్రమత్తత ప్రకటించారు.

800 మందికి పైగా గల్లంతు

వరద ఉధృతికి ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న 403 మంది టూరిస్టులు సహా 800 మందికి పైగా గల్లంతైనట్టు నేపాల్ వెల్లడించింది. టూరిస్టుల్లో 142 మంది ఇండియన్లు సహా 341 మంది విదేశీయులు, 93 మంది స్థానికులు ఉన్నారు. మరోవైపు, రసువా జిల్లాలో సహాయక చర్యల్లో పాల్గొంటున్న 26 మంది నేపాల్ పోలీసులు, ఏడుగురు సాయుధ బలగాల సిబ్బంది కూడా వరదలో కొట్టుకుపోయారని సమాచారం.

భారతీయుల కోసం ఎమర్జెన్సీ హెల్ప్ లైన్

నేపాల్లో చిక్కుకున్న యాత్రికులకు సాయం, సమాచారం అందించేందుకు అక్కడి భారతీయ రాయబార కార్యాలయం ఎమర్జెన్సీ హెల్ప్ లైన్ నంబర్లను ఏర్పాటు చేసింది. +977 985 1316807, +977 970 910 7500 సంప్రదించాలని ఇండియన్ ఎంబసీ తెలిపింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో చిక్కుకున్న భారతీయులు ఈ హెల్ప్ లైన్ నంబర్లను సంప్రదించాలని సూచించింది.

©️ VIL Media Pvt Ltd.