Reading Time: 3 minutes
Nepal Floods China Tibet Construction Barrier Lake Fresh Flood Threat

నేపాల్ జలప్రళయంపై తాజాగా కొత్త చర్చ మొదలైంది. ఇంత ఘోరం జరగానికి డ్రాగన్ దేశమే కారణంగా వేళ్లన్నీ చూపిస్తున్నాయి. టిబెట్‌లో చైనా చేపట్టిన నిర్మాణాల వల్లే నేపాల్‌లో ప్రాణాంతక వరదలు సంభవించాయన్న ఆరోపణలు వస్తున్నాయి. అయితే ఈ వార్తలను బీజింగ్ ఖండించింది. తాము నేపాల్‌ను ముందుగా హెచ్చరించడంలో విఫలమయ్యామన్న వాదనలను కూడా చైనా తిరస్కరించింది. ఇదిలా ఉండగా.. సరిహద్దు సమీపంలో తాజాగా మరో ప్రమాదం పొంచి ఉంది. నేపాల్‌లో కొత్తగా ఏర్పడిన ఓ సరస్సు ఇప్పటికే పొంగిపొర్లుతుండటంతో.. అది తెగిపోతే మరోసారి భారీ వరదలు సంభవించే అవకాశం ఉందని చైనా అధికారులు హెచ్చరించారు.

ఆగస్టు 26న నేపాల్-టిబెట్ సరిహద్దు ప్రాంతంలో సంభవించిన ఆకస్మిక వరదల తర్వాత సహాయక, గాలింపు చర్యలు కొనసాగుతున్న సమయంలోనే ఈ కొత్త ముప్పు వెలుగులోకి వచ్చింది. చైనా జల వనరుల మంత్రిత్వ శాఖ ప్రకారం.. గురువారం ఉదయం కొత్తగా ఏర్పడిన ఈ బారియర్ లేక్‌లో దాదాపు 20 లక్షల క్యూబిక్ మీటర్ల నీరు ఉంది. రాబోయే మూడు రోజుల్లో మరో 30 లక్షల క్యూబిక్ మీటర్ల నీరు ఇందులోకి చేరే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దీంతో సరస్సు కట్ట తెగిపోయే ప్రమాదం అధికంగా ఉందని అధికారులు హెచ్చరించారు.

నేపాల్‌లోని ఛోచెన్ ఖోలా, పురేపు త్సాంగ్పో నదులు కలిసే ప్రాంతానికి సమీపంలో ఈ సరస్సు ఏర్పడింది. ఈ రెండు నదులు టిబెట్‌లో పుట్టి నేపాల్‌లోకి ప్రవేశించే ముందు కలుస్తాయి. అనంతరం ఈ నదీ వ్యవస్థ భోటే కోసి నదిగా మారుతుంది. ఇది త్రిశూలి నదికి ముఖ్యమైన ఎగువ ఉపనది. ప్రస్తుతం చైనా అధికారులు ఈ సరస్సును నిశితంగా పర్యవేక్షిస్తున్నారు. సరస్సు కట్ట తెగితే వరద ప్రభావం ఏ ప్రాంతాలపై ఉంటుంది? ఎంత స్థాయిలో నీరు దిగువకు ప్రవహించే అవకాశం ఉంది? అనే అంశాలపై వరద నమూనాలు, జలవిజ్ఞాన అంచనాలు నిర్వహిస్తున్నారు. అత్యవసర పరిస్థితులు తలెత్తితే వెంటనే స్పందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

మరో ముప్పు

ఆగస్టు 26న నేపాల్-టిబెట్ సరిహద్దు ప్రాంతంలో భారీ వరద, కొండచరియలు విరిగిపడటంతో తీవ్ర విధ్వంసం చోటుచేసుకుంది. నేపాల్‌లోని రసువా జిల్లాలో భోటే కోసి నదిలో ఒక్కసారిగా వరద ఉధృతి పెరిగింది. అనంతరం వరద నీరు టిమురే, స్యాఫ్రుబేసి ప్రాంతాల మీదుగా దిగువకు ప్రవహించింది. వరదల కారణంగా రహదారులు, వంతెనలు, భవనాలు, ఇతర మౌలిక వసతులు ధ్వంసమయ్యాయి. వరద ఉధృతి త్రిశూలి నది వైపు కూడా కొనసాగింది. చైనా వైపు టిబెట్‌లోని గ్యిరోంగ్ పోర్ట్ ప్రాంతంలోనూ కొండచరియలు విరిగిపడ్డాయి. చైనా అధికారిక మీడియా ప్రకారం.. పోర్టుకు వెళ్లే రహదారులు దెబ్బతిన్నాయి. కొన్ని ప్రాంతాల్లో బురద 1.5 మీటర్లకు పైగా పేరుకుపోయింది. వర్షాలు కొనసాగుతున్న నేపథ్యంలో మరిన్ని కొండచరియలు విరిగిపడటం, ఇతర విపత్తులు సంభవించే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.

చైనా ముందస్తు హెచ్చరిక ఇవ్వలేదా?

ఈ విపత్తు నేపథ్యంలో చైనా ముందుగా నేపాల్‌ను హెచ్చరించిందా? లేదా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. టిబెట్ వైపు నుంచి వచ్చిన విపత్తు కారణంగా.. దిగువ ప్రాంతాల్లోని ప్రజలను ముందుగానే అప్రమత్తం చేయాల్సి ఉందని కొన్ని కథనాలు, సోషల్ మీడియా పోస్టులు పేర్కొన్నాయి. నేపాల్‌కు చెందిన ఉకేరా మీడియా కథనం ప్రకారం.. టిబెట్‌లోని కెరుంగ్ కౌంటీలో స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 10.30 గంటల సమయంలో ఆకస్మిక వరద సంభవించినట్లు సమాచారం. నేపాల్ కాలమానం ప్రకారం ఇది ఉదయం 8.15 గంటలకు సమానం. దాదాపు 45 నిమిషాల తర్వాత వరద నీరు భోటే కోసి నదీ వ్యవస్థలోకి ప్రవేశించినట్లు కథనం పేర్కొంది.

నేపాల్ నేషనల్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ అండ్ మేనేజ్‌మెంట్ అథారిటీ అధికార ప్రతినిధి శాంతి మహత్‌ను ఉటంకిస్తూ.. రసువా చీఫ్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ ఉదయం 9 గంటల సమయంలో తనను సంప్రదించారని తెలిపింది. కెరుంగ్ నుంచి నేపాల్ వైపు వరద వస్తున్నట్లు స్థానికులు గుర్తించారని ఆయనకు సమాచారం అందించినట్లు పేర్కొంది. నేపాల్‌కు చెందిన జర్నలిస్ట్ పరశురామ్ కాఫ్లే కూడా చైనాపై విమర్శలు చేశారు. ఇంత భారీ విపత్తుపై ముందస్తు హెచ్చరిక అందకపోవడం వల్ల నేపాల్‌లో భారీగా ప్రాణనష్టం జరిగిందని ఆయన సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు.

ఆరోపణలను ఖండించిన బీజింగ్

అయితే నేపాల్‌ను ముందుగా హెచ్చరించడంలో చైనా విఫలమైందన్న ఆరోపణలను బీజింగ్ ఖండించింది. అంతేకాకుండా.. ‘జియోలాజికల్ డిజాస్టర్ డ్యామ్’ కూలిపోవడం వల్లే ఈ విపత్తు సంభవించిందన్న వాదనలను కూడా తిరస్కరించింది. నేపాల్‌లోని చైనా రాయబార కార్యాలయం ఈ ఆరోపణలను ‘తప్పుడు సమాచారం’గా అభివర్ణించింది. ఆగస్టు 26 ఉదయం నేపాల్ వైపు భూకంపం లేదా భూకంపం తరహా హిమనదం కూలిపోవడం వల్ల భారీ కొండచరియలు, బురద ప్రవాహం సంభవించాయని.. దాని కారణంగా నేపాల్, చైనాలోని గ్యిరోంగ్-రసువాగఢి సరిహద్దు ప్రాంతాల్లో భారీ ప్రాణనష్టం, గల్లంతైన ఘటనలు చోటుచేసుకున్నాయని తెలిపింది.

రంగంలోకి దిగిన చైనా రెస్క్యూ బృందాలు

మరోవైపు చైనా సహాయక చర్యలను మరింత ముమ్మరం చేసింది. అగ్నిమాపక, రెస్క్యూ సిబ్బందితో పాటు సైనికులు, ఇంజినీరింగ్ బృందాలను రంగంలోకి దించింది. ప్రభావిత ప్రాంతాలకు విమానాల ద్వారా సిబ్బంది, పరికరాలు, అత్యవసర సామగ్రిని తరలిస్తోంది. చైనా వైపు ఇప్పటికే 1,500 మందికి పైగా సిబ్బందిని సహాయక చర్యల్లో మోహరించినట్లు సమాచారం. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ కూడా గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలకు ప్రాధాన్యం ఇవ్వాలని, ప్రమాదంలో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.

మరోసారి వరదలు వచ్చే ప్రమాదం

ఇప్పటికే పొంగిపొర్లుతున్న కొత్త బారియర్ లేక్ ఇప్పుడు నేపాల్, చైనా సరిహద్దు ప్రాంతాల్లో ఆందోళన పెంచుతోంది. రాబోయే మూడు రోజుల్లో మరో 30 లక్షల క్యూబిక్ మీటర్ల నీరు సరస్సులోకి చేరే అవకాశం ఉండటంతో.. కట్ట తెగితే ఒక్కసారిగా భారీగా నీరు దిగువ ప్రాంతాలకు దూసుకొచ్చే ప్రమాదం ఉంది. దీంతో మరోసారి ఆకస్మిక వరదలు సంభవించకుండా ఇరు దేశాల అధికారులు అప్రమత్తమయ్యారు.