Reading Time: 2 minutes
Cjp Delhi Protest September 5 Before Brics Summit

CJP Protest: కాక్రోచ్ జనతా పార్టీ(CJP) మరో నిరసనకు సిద్ధమవుతోంది. సెప్టెంబర్ 5న ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద ప్రారంభమయ్యే నిరసన ఢిల్లీ పోలీస్ ప్రధాన కార్యాలయం వరకు కొనసాగుతోందని ఆ సంస్థ తెలిపింది. నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో కేంద్రం తమకు ఇచ్చిన హామీలను నేరవేర్చలేదని చెబుతూ అభిజిత్ దీప్కే అండ్ కో ఈ నిరసనలకు సిద్ధమవుతోంది. భారత్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న బ్రిక్స్ సదస్సు (BRICS)కు వారం రోజుల ముందే సీజేపీ ఈ నిరసనలకు పిలుపునివ్వడం కాస్త ఆందోళనగా, అనుమానాస్పదంగా కనిపిస్తోంది.

శాంతియుత ర్యాలీ నిర్వహించనున్నట్లు సీజేపీ చెబుతోంది. గతంలో జంతర్ మంతర్ వద్ద కూడా శాంతియుత నిరసన చేస్తామని చెప్పినప్పటికీ, చివరకు హింసాత్మక సంఘటనలు జరిగాయి. అయితే, ఈసారి ఢిల్లీ పోలీసులు మరింత కట్టుదిట్టంగా వ్యవహరించే అవకాశం ఉంది. సెప్టెంబర్ 12-13 తేదీల్లో బ్రిక్స్ సదస్సు జరగబోతోంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్ ఈ సమావేశానికి హాజరవుతున్నట్లు సమాచారం. వేల సంఖ్యలో విదేశీ ప్రతినిధులు సమావేశాలకు హాజరుకాబోతున్నారు. ఇదిలా ఉంటే, జంతర్ మంతర్ వంటి నిర్దేశిత నిరసన ప్రదేశాలలో తప్ప, న్యూఢిల్లీ జిల్లా అంతటా ఊరేగింపులు, ప్రదర్శనలు, నిరసనలు మరియు ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు గుమిగూడడాన్ని నిషేధిస్తూ BNSSలోని సెక్షన్ 163 ప్రస్తుతం అమలులో ఉంది.

బ్రిక్స్ సదస్సు ముందే ఎందుకు..?

సరిగా బ్రిక్స్ సదస్సు ముందే సీజేపీ ఈ నిరసనలకు పిలుపునివ్వడం అనుమానాలకు తావిస్తోంది. నీట్ నిరసనల్లో నిరసనకారులపై నమోదైన ఎఫ్ఐఆర్‌లు విత్ డ్రా చేసుకోవడంతో పాటు, ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు నష్టపరిహారం వంటి డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చలేదని సీజేపీ సెప్టెంబర్ 5 నిరసనలకు పిలుపునిచ్చింది.

ఢిల్లీలో అంతర్జాతీయంగా ఎంతో కీలకమైన బ్రిక్స్ సమావేశాలు జరిగే సమయంలో, పుతిన్, జిన్‌పింగ్ వంటి ప్రపంచ అగ్రనేతలు వచ్చే సమయంలో ఈ నిరసనలకు చేపడుతోంది. అదే సమయంలో ఇంటర్నేషనల్ మీడియా అంతా ఢిల్లీలోనే ఉంటుంది. మీడియా అటెన్షన్ కోసం సీజేపీ ఈ చర్యకు పాల్పడుతోందని తెలుస్తోంది.

మోడీ సర్కార్‌ను అబాసుపాలు చేయడానికా..?

సీజేపీ చాలా సెలెక్టివ్‌గా బీజేపీని టార్గెట్ చేస్తుందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నీట్ పరీక్ష నిరసనల తర్వాత ఆ సంస్థ ‘‘స్కూల్ ఠీక్ కరో’’ అనే కార్యక్రమాన్ని చేపట్టింది. ప్రభుత్వం పాఠశాలల బాగోగుల్ని హైలెట్ చేస్తోంది. సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే మహారాష్ట్రలో, కో కన్వీనర్లు అశుతోష్ రాంకా రాజస్థాన్, సౌరవ్ దాస్‌ ఢిల్లీలో స్కూల్ విజిట్ చేపడుతున్నారు. ఈ మూడు రాష్ట్రాల్లో కూడా బీజేపీ సర్కార్ ఉంది. కానీ జార్ఖండ్ విద్యార్థి ఉద్యమంలో నేరుగా పాల్గొనడం, కాంగ్రెస్ లేదా ఇతర ప్రతిపక్ష ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాల్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ఇప్పుడు బ్రిక్స్ సదస్సుకు ముందు ఢిల్లీలో హంగామా చేయాలని ప్లాన్ చేసినట్లు కొంత మంది విశ్లేషకులు భావిస్తున్నారు. దీని ద్వారా మోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వాన్ని అంతర్జాతీయంగా అబాసుపాలు చేయాలని చూస్తుందని రైట్ వింగ్ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు.