Reading Time: 2 minutes
Ms Dhoni Return Csk Vs Srh Ipl Ashwin Updates

ఐపీఎల్ 2026 సీజన్‌కు ఎంఎస్ ధోనీ పూర్తిగా దూరం కావడంపై నెలకొన్న సస్పెన్స్‌కు త్వరలోనే తెరపడనుందని వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ హింట్ ఇచ్చాడు. సోమవారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ఆడబోయే చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో ధోనీ మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టే అవకాశం ఉందని అశ్విన్ తెలిపాడు.

సీజన్ ఆరంభానికి ముందే తగిలిన మోకాలి గాయం (Calf Injury) కారణంగా చెన్నై ఆడిన 12 మ్యాచ్‌ల్లోనూ ధోనీ ఆడలేదు. లక్నోతో జరిగిన గత మ్యాచ్‌కు ధోనీ వస్తాడని అభిమానులు ఆశించినా, అతను చెన్నైలోనే ఉండిపోయాడు. ఆ మ్యాచ్‌లో సీఎస్‌కే ఘోర పరాజయం పాలైంది.

ఈ నేపథ్యంలో అశ్విన్ తన యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడుతూ.. ధోనీ పునరాగమనంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. “నాణ్యమైన పేస్ హిట్టర్ల గురించి మాట్లాడితే ఇప్పటికీ ధోనీనే ముందుంటాడు. మిడిలార్డర్‌లో అతని అవసరం జట్టుకు ఎంతో ఉంది. సోమవారం హైదరాబాద్‌తో జరిగే మ్యాచ్‌లో ధోనీ ఆడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని నా నమ్మకం. గత 2-3 మ్యాచ్‌ల నుంచే అతను బరిలోకి దిగడానికి సిద్ధంగా ఉన్నాడని విన్నాను” అని అశ్విన్ పేర్కొన్నాడు.

అలాగే ధోనీని ఆడించకపోవడంపై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్‌లపై వస్తున్న విమర్శలను అశ్విన్ తిప్పికొట్టాడు. ఇది పూర్తిగా ఫిజియోథెరపీ, స్పోర్ట్స్ సైన్స్‌కు సంబంధించిన విషయమని, ఇందులో కెప్టెన్ లేదా కోచ్‌ను తప్పుపట్టలేమని స్పష్టం చేశాడు.

ప్రస్తుతం పాయింట్ల పట్టికలో చెన్నై జట్టు 12 పాయింట్లతో 6వ స్థానంలో నిలిచింది. ధోనీ లేకపోవడంతో వికెట్ కీపర్‌గా సంజు శాంసన్‌పై భారం పడగా, ఫినిషర్‌గా డెవాల్డ్ బ్రెవిస్ విఫలమయ్యాడు. ఇలాంటి కష్టసమయంలోనూ టోర్నీలో నిలబడటానికి సీఎస్‌కే అద్భుతంగా పోరాడిందని అశ్విన్ ప్రశంసించాడు. ఒకవేళ ధోనీ తిరిగి వస్తే, అది జట్టుకు కొండంత బలాన్ని ఇస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు.