Reading Time: 2 minutes

పన్ను అధికారుల సోదాల్లో ఇంట్లో ఉన్న గోల్డ్ సీజ్.. బిల్స్ చూపకపోతే టాక్స్ కట్టాలా..? కోర్టు ఏమందంటే..

Caption of Image.

భారతీయులకు బంగారానికి మధ్య సంబంధం విడతీయలేనిది. పెళ్లిళ్లు, శుభకార్యాలు, వారసత్వంగా వచ్చే నగలు ప్రతి ఇంట్లోనూ ఉంటాయి. అయితే ఐటీ అధికారులు సోదాలు జరిగినప్పుడు ఈ బంగారం సీజ్ చేస్తే పరిస్థితి ఏంటి? ఆ గోల్డ్ వెనక్కి ఇవ్వరా ఈ వ్యవహారంలో కోర్టులు, చట్టాలు ఏమంటున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.. 

 తాజాగా ‘రామనాథ్ గుప్తా బైసాని వర్సెస్ JCIT’ కేసులో ఐటీ అప్పీలేట్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు బంగారాన్ని దాచుకునే ప్రతి ఒక్కరికీ పెద్ద ఊరటనిస్తోంది. బెంగళూరుకు చెందిన ఒక వ్యక్తి నివాసంలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించి 2 కేజీల 532 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు రూ.కోటి. వీటికి సంబంధించిన కొనుగోలు బిల్లులు చూపలేదన్న కారణంతో.. ఆ మొత్తాన్ని తెలియచేయని ఆదాయం కింద పరిగణించి అధికారులు దానిపై టాక్స్ కట్టాలంటూ ఆదాయానికి కలిపేశారు. అవన్నీ తన కుటుంబ సభ్యుల నగలు, పెళ్లి కానుకలు, వారసత్వంగా వచ్చినవని అతడు వాదించారు.

టాక్స్ రూల్స్ ఏం చెబుతున్నాయి?
ఈ కేసులో ట్రిబ్యునల్ 1994 నాటి CBDT ఇన్‌స్ట్రక్షన్ నంబర్ 1916ను పరిగణనలోకి తీసుకుంది. ఈ రూల్ ప్రకారం.. ఐటీ సోదాల సమయంలో ఒక పరిమితి వరకు ఉన్న బంగారాన్ని అధికారులు సీజ్ చేయకూడదు. ఆ పరిమితులు ఏంటంటే..

* వివాహిత మహిళ: 500 గ్రాములు.
* అవివాహిత మహిళ: 250 గ్రాములు.
* పురుషుడు: 100 గ్రాములు.

ట్రిబ్యునల్ సంచలన తీర్పు..
కేవలం బిల్లులు లేవన్న కారణంతో ఇంట్లో ఉన్న బంగారాన్ని ట్యాక్సబుల్ ఇన్‌కమ్‌గా మార్చలేం అని ట్రిబ్యునల్ స్పష్టం చేసింది. భారతీయ సంస్కృతిలో పెళ్లిళ్లు, వారసత్వం ద్వారా బంగారం చేతులు మారుతుందని.. వీటన్నింటికీ దశాబ్దాల నాటి బిల్లులు ఉండటం అసాధ్యమని పేర్కొంది. పైన పేర్కొన్న పరిమితుల లోపు ఉన్న బంగారానికి పన్ను మినహాయింపు ఇవ్వాలని, దాన్ని ఆదాయంగా పరిగణించకూడదని తన తీర్పులో పేర్కొంది.

ఈ తీర్పుతో బిల్లులు లేని ప్రతి బంగారానికి క్లీన్ చిట్ దొరికినట్లు కాదు. ఆ బంగారం ఎలా వచ్చిందో అధికారులకు సరైన వివరణ ఇవ్వాలి. నిర్ణీత పరిమితి కంటే ఎక్కువ బంగారం ఉంటే మాత్రం తప్పనిసరిగా ఆధారాలు చూపాల్సి ఉంటుంది. ఇది ఐటీ ట్రిబ్యునల్ తీర్పు మాత్రమే. దీనిని హైకోర్టు లేదా సుప్రీంకోర్టులో సవాలు చేసే అవకాశం ఐటీ శాఖకు ఉంటుంది. మెుత్తానికి ఈ తీర్పు సామాన్య ఇన్వెస్టర్లకు పెద్ద ఊరట. కొనుగోలు బిల్లులు లేకపోయినా, కుటుంబ నేపథ్యం, సామాజిక ఆచారాల ప్రకారం ఉన్న బంగారాన్ని చట్టం గౌరవిస్తుందని ట్రిబ్యునల్ నిరూపించింది. కాబట్టి మీ ఇంట్లో పరిమితి లోపు ఉన్న బంగారం విషయంలో ఆందోళన చెందాల్సిన పని అస్సలు లేదని గుర్తుంచుకోండి. 

©️ VIL Media Pvt Ltd.