
ఐపీఎల్ 2026 సీజన్‌లో భారీ స్కోర్లు వరుసగా నమోదవుతున్న నేపథ్యంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆధునిక టీ20 క్రికెట్‌లో బ్యాటర్ల ఆధిపత్యం పెరిగిందని, కానీ బౌలర్లు ఇంకా మ్యాచ్ ఫలితాన్ని మార్చగలరని విశ్వాసం వ్యక్తం చేశాడు. ముఖ్యంగా ఈ సీజన్‌లో ఛేజింగ్‌లు సులభమవుతున్నాయన్న విషయాన్ని ప్రస్తావించాడు. ముంబై ఇండియన్స్ నిర్ధేశించిన 244 పరుగుల లక్ష్యం అంత సులువు కాదని, కానీ తమ బ్యాటింగ్ లైనప్ గురుంచి తెలుసు కాబట్టి ఖచ్చితంగా చేధిస్తామని అనుకున్నానని చెప్పాడు. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మలు అరివీర భయంకరులని.. వారిద్దరికీ బౌలింగ్ వేయాల్సిన అవసరం లేనందుకు సంతోషిస్తున్నానని కమిన్స్ చెప్పాడు.
‘మొదట చూస్తే ఈ లక్ష్యం చాలా కష్టంగా అనిపించింది. కానీ మా బ్యాటింగ్ లైనప్ బలం, అలాగే పిచ్ పరిస్థితులు బాగుండటంతో ఈ టార్గెట్ సాధ్యమే అనిపించింది. ఈ స్కోర్‌ను ఛేజ్ చేయగలమనే నమ్మకం ఉంది. మా ఓపెనింగ్ జోడీకి భయం అన్నది లేదు. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మలు దూకుడుగా ఉండాలని ఆశిస్తున్నాను. పిచ్ బాగుంటే వాళ్లు ఆడే విధానంతో బౌలర్లు బెంబేలెత్తాల్సిందే. ఎన్నో రకాల షాట్లు వాళ్ల దగ్గర ఉన్నాయి. నిజం చెప్పాలంటే వారికి బౌలింగ్ వేయాల్సిన అవసరం నాకు లేదు. ఈ విషయంలో నాకు సంతోషమే (నవ్వుతూ). వాళ్లు చాలా ప్రమాదకరం’ అని ప్యాట్ కమిన్స్ చెప్పాడు.
‘యువ ప్లేయర్స్ బాగా ఆడుతున్నారు. నాకు చాలా అద్భుతంగా ఉంది. సలీల్ అరోరాకు ఈ సీజన్‌లో పెద్దగా అవకాశాలు రాలేదు. కానీ ప్రీ సీజన్‌లో అతను బాగా ఆకట్టుకున్నాడు. యువ ఆటగాళ్లందరు భయం లేకుండా ధైర్యంగా ఆడుతున్నారు. అందుకు కోచింగ్ స్టాఫ్‌కు క్రెడిట్ ఇవ్వాలి. కోచ్‌లు ఆటగాళ్లలో నమ్మకాన్ని నింపారు. నిజానికి యువ ప్లేయర్స్ ఎంత గొప్పగా ఆడుతున్నారో వాళ్లకే ఇంకా పూర్తిగా తెలియదు. బౌలర్లు ఎక్కువ పరుగులు ఇస్తున్నారనే ఆందోళన ఉంది. ఇది అంగీకరించాలి. ఐపీఎల్ ఇప్పుడు ఐదు సంవత్సరాల క్రితం లాగా లేదు. ఒకప్పుడు 200 పరుగులు ఛేజ్ చేయడం కష్టంగా ఉండేది. కానీ ఇప్పుడు ఓవరుకు 12 పరుగులు అవసరమైనా కూడా ఛేజ్ చేయగలమనే నమ్మకం ఉంది. అందుకే బౌలర్లుగా మన అంచనాలను మార్చుకోవాలి. హై స్కోరింగ్ మ్యాచ్‌ల్లో బౌలర్లకు పెద్దగా అవకాశం ఉండదు. కానీ మ్యాచ్ చివర్లో ఒక మంచి యార్కర్ వేస్తే కూడా మ్యాచ్ ఫలితాన్ని మార్చేయగలదు. మా జట్టులో ఎషాన్ మలింగ లాంటి బౌలర్లు కీలక పాత్ర పోషిస్తున్నారు. అతడే పర్పుల్ క్యాప్ కూడా సాధించాడు. అంటే బౌలర్లు ఇంకా మ్యాచ్‌పై ప్రభావం చూపగలరు. ప్రస్తుతం మా జట్టు బాగా ఆడుతోంది. ఇదే ఫామ్ కొనసాగాలని ఆశిస్తున్నాం’ అని కమిన్స్ చెప్పుకొచ్చాడు.