
మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ మరియు ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సన కలయికలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ‘పెద్ది’. ఈ సినిమా విడుదల తేదీపై గత కొద్దిరోజులుగా ఫిల్మ్ నగర్ వర్గాల్లో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం, ఈ సినిమా జూన్ 4వ తేదీకి షిఫ్ట్ అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. రామ్ చరణ్ కెరీర్‌లో 16వ చిత్రంగా వస్తున్న ‘పెద్ది’, ఒక రా అండ్ రస్టిక్ స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతోంది. నిజానికి ఏప్రిల్ 30నే విడుదల చేయాలని ముందు అనుకున్నా సినిమా మేకింగ్‌లో ఎక్కడా రాజీ పడకూడదనే ఉద్దేశంతో కొన్ని మార్పులు జరిగాయి. షూట్ ఇంకా పూర్తి కాలేదు, సినిమా అవుట్‌పుట్ అద్భుతంగా రావాలనే ఉద్దేశంతో, విజువల్ ఎఫెక్ట్స్ (VFX) పనులకు మరికొంత సమయం అవసరమని టీమ్ భావించింది. దీనివల్ల ఏప్రిల్ నుంచి సినిమా వాయిదా పడక తప్పలేదు.
తొలుత ఈ సినిమాను జూన్ 25న విడుదల చేయాలని ప్లాన్ చేశారు. కానీ, యష్ నటిస్తున్న ‘టాక్సిక్’ సినిమా జూన్ 4వ తేదీకి రాకపోవడంతో, ఆ గ్యాప్‌ను భర్తీ చేసేందుకు బుచ్చిబాబు అండ్ టీమ్ సిద్ధమవుతోంది. జూన్ 4వ తేదీ అయితే బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధించవచ్చని, అలాగే డిస్ట్రిబ్యూషన్ పరంగా కూడా ప్లస్ అవుతుందని దర్శకుడు బుచ్చిబాబు తన టీమ్‌తో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. రామ్ చరణ్ సరికొత్త లుక్‌లో కనిపించనున్న ఈ సినిమాపై మెగా అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఏప్రిల్‌లో చూడాలనుకున్న తమ హీరోను జూన్ నెలలో చూడాల్సి రావడం కొంత నిరాశ కలిగించినా, సినిమా క్వాలిటీ విషయంలో బుచ్చిబాబు తీసుకుంటున్న జాగ్రత్తలు చూస్తుంటే థియేటర్లలో ‘పెద్ది’ రచ్చ ఖాయమనిపిస్తోంది. ప్రస్తుతానికి జూన్ 4వ తేదీ పరిశీలనలో ఉంది. త్వరలోనే యూనిట్ నుంచి ఈ విషయంపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.