
Viral Wedding: ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకి జిల్లాలో జరిగిన ఒక వివాహం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. దేశవ్యాప్తంగా వంటగ్యాస్ కొరత వేధిస్తున్న నేపథ్యంలో, ఒక వరుడు తన కాబోయే భార్య ముందు పెట్టిన వింత షరతు విని అందరూ నోరెళ్లబెట్టారు. ఇంతకీ ఆ షరతు ఏంటి, దానికి వధువు ఇచ్చిన సమాధానం ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది. బారాబంకి జిల్లా కత్రా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖైరా బీరు గ్రామానికి చెందిన అశోక్, లక్ష్మిల వివాహం ఘనంగా జరిగింది. అయితే ఈ పెళ్లి వేడుకలో ‘జైమాల’ (దండలు మార్చుకునే కార్యక్రమం) కంటే ముందే ఒక ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది.
వరుడి ఆందోళన.. వింత ప్రశ్న
పెళ్లికి కొన్ని రోజుల ముందు వరుడు అశోక్ గ్యాస్ సిలిండర్ కోసం తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. గ్యాస్ ఏజెన్సీల చుట్టూ తిరిగినా, గంటల తరబడి క్యూలో నిలబడినా సమయానికి సిలిండర్ దొరకలేదు. ఈ చేదు అనుభవంతో సతమతమైన అశోక్.. పెళ్లి పీటల మీద ఉన్నప్పుడే వధువు లక్ష్మికి ఒక కండిషన్ పెట్టాడు. “భవిష్యత్తులో ఒకవేళ గ్యాస్ సిలిండర్ దొరకకపోతే.. కట్టెల పొయ్యి మీద వంట చేయడానికి నువ్వు సిద్ధమేనా?” అని అశోక్ అడిగాడు. ఈ ప్రశ్న విన్న పెళ్లి బృందం, బంధువులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. శుభకార్యం జరుగుతున్న సమయంలో ఇలాంటి ప్రశ్న ఏంటని అందరూ ఆశ్చర్యపోయారు.
వధువు అదిరిపోయే సమాధానం..
వరుడి ప్రశ్నకు వధువు లక్ష్మి ఏమాత్రం తడబడకుండా సమాధానమిచ్చింది. “కచ్చితంగా చేస్తాను.. గ్యాస్ లేకపోతే పొయ్యి మీద వంట చేయడానికి నాకేం అభ్యంతరం లేదు. అంతేకాదు, అవసరమైతే మీతో పాటు పొలం పనులకు రావడానికి కూడా నేను సిద్ధమే” అని ధైర్యంగా చెప్పింది. వధువు ఇచ్చిన సమాధానంతో వరుడు సంతృప్తి చెందడమే కాకుండా, అక్కడున్న వారందరూ చప్పట్లతో ఆమెను అభినందించారు. దీంతో పెళ్లి వాతావరణం మళ్లీ సందడిగా మారింది. ప్రస్తుత కాలంలో చిన్న చిన్న కారణాలకే గొడవ పడి పెళ్లిళ్లు పెటాకులు చేసుకుంటున్న జంటలు ఉన్నారని, కానీ ఈ జంట వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకోవడం గొప్ప విషయమని గ్రామస్థులు కొనియాడుతున్నారు.