Reading Time: < 1 minute
Shane Warne Rr Deal How 3 Percent Equity Turned Into Rs 460 Crore For His Family

Shane Warne To Get RS 460 Crore From Rajasthan Royals: ఆస్ట్రేలియా లెజెండరీ స్పిన్నర్, దివంగత షేన్‌ వార్న్‌ నిజంగా మాస్టర్ మైండ్ అనే చెప్పాలి. మైదానంలోనే కాదు.. ఆర్థిక నిర్ణయాల్లో కూడా ఎంత తెలివిగా వ్యవహరించారనే ఓ ఆసక్తికర విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్) జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన సమయంలో వార్న్ తీసుకున్న ఓ నిర్ణయం ఇప్పుడు ఆయన కుటుంబానికి భారీ లాభాలను తెచ్చిపెట్టింది. రాజస్థాన్ నుంచి ఏకంగా రూ.460 కోట్లు వార్న్ కుటుంబానికి దక్కనున్నాయి.

రాజస్థాన్ రాయల్స్ తరఫున షేన్‌ వార్న్‌ నాలుగు సీజన్లు ఆడారు. ఆ కాలంలో (2008) మొత్తంగా రూ.9.35 కోట్లే జీతంగా తీసుకున్నారు. అయితే ఇందులోనే అసలు ట్విస్ట్ ఉంది. కేవలం జీతంతో సరిపెట్టుకోకుండా.. ప్రతి సీజన్‌కు 0.75 శాతం ఈక్విటీ (షేర్లు) ఇవ్వాలని డిమాండ్ పెట్టారు. రాజస్థాన్ యాజమాన్యం కూడా అందుకు అంగీకరించింది. దాంతో వార్న్‌కు నాలుగు సీజన్లలో మొత్తం 3 శాతం వాటా దక్కింది. ఇప్పుడు రాజస్థాన్ ఫ్రాంచైజీ మరో చేతికి మారగా.. ప్రాంచైజీ విలువ ఆకాశాన్ని తాకింది. తాజాగా జట్టును ప్రముఖ వ్యాపారవేత్త కల్ సోమాని నేతృత్వంలోని కన్సార్టియం 1.63 బిలియన్ డాలర్ల (రూ.15,301 కోట్లు) భారీ మొత్తానికి సొంతం చేసుకుంది.

Also Read: RR Captain 2026: రాజస్థాన్ రాయల్స్‌కు కొత్త యాజమాన్యం.. కెప్టెన్‌గా యశస్వి జైస్వాల్‌, నిజమేనా?

దీంతో షేన్‌ వార్న్ సంపాదించిన 3 శాతం వాటా విలువ ఇప్పుడు సుమారు రూ.460 కోట్లకు చేరింది. ఈ భారీ మొత్తం ఇప్పుడు అతని కుటుంబానికి, పిల్లలకు అందనుంది. అయితే ఈ ఒప్పందానికి బీసీసీఐ ఆమోదం తెలపాల్సి ఉంది. వార్న్‌ 2022లో మృతి చెందిన విషయం తెలిసిందే. మైదానంలో తన మాంత్రిక బౌలింగ్‌తో అభిమానులను అలరించిన వార్న్.. మైదానం బయట కూడా ఎంత దూరదృష్టితో నిర్ణయాలు తీసుకున్నాడో ఈ ఉదాహరణ స్పష్టంగా చూపిస్తోంది. చిన్న జీతంతో మొదలైన ప్రయాణం.. ఇప్పుడు వందల కోట్ల సంపదగా మారడం నిజంగా అద్భుతమే.