
న్యూఢిల్లీ: సుప్రీం కోర్టులో భావోద్వేగ ఘటన చోటు చేసుకుంది. హరీష్ రాణా కారణ్య మరణం కేసు తీర్పు సమయంలో జస్టిస్ జేబీ పార్దివాలా ఎమోషనల్ అయ్యారు. కేసుకు సంబంధించిన తీర్పు చదువుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ప్రమాదం అతని జీవిత గమనాన్ని మార్చే ముందు రాణా తెలివైన యువకుడని ఉబికి వస్తోన్న కన్నీళ్లతోనే కేసు పరిస్థితులను వివరిస్తూ ఆయన భావోద్వేగానికి గురయ్యారు. ఈ సీన్‌తో కోర్టు హాల్ మొత్తం భావోద్వేగభరితంగా మారింది.
దాదాపు 13 ఏళ్లుగా కోమాలో ఉన్న హరీష్ రాణా కారుణ్య మరణం కేసులో సుప్రీం కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. జీవచ్ఛవంలా మారిన హరీష్ రాణా కారుణ్య మరణానికి దేశ అత్యున్నత న్యాయస్థానం అనుమతి ఇచ్చింది. 13 ఏండ్లుగా హెల్త్ కండిషన్లో ఎలాంటి మెరుగుదల లేకపోవడంతో అతడికి చికిత్స నిలిపివేయొచ్చని స్పష్టం న్యాయస్థానం చేసింది. ఈ మేరకు 2018 కామన్ కాజ్ ఫ్రేమ్‌వర్క్ కింద నిష్క్రియాత్మక కారుణ్య మరణాన్ని అనుమతిస్తూ జస్టిస్ జెబి పార్దివాలా, కెవి విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.
అసలు కేసు ఏంటంటే..?
ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌కు చెందిన హరీష్ రాణా (32) చండీగఢ్ యూనివర్సిటీలో ఇంజినీరింగ్ చదువుతున్న సమయంలో 2013, ఆగస్టు 20 ప్రమాదానికి గురయ్యాడు. ప్రమాదశాత్తూ హాస్టల్ నాలుగో అంతస్తు బాల్కనీ నుంచి కిందపడ్డాడు. ఈ ఘటనలో అతడికి తలకు తీవ్ర గాయం కావడంతో కోమాలోకి వెళ్లిపోయాడు. ఎన్ని ఆసుపత్రుల్లో చికిత్స చేసిన లాభం లేకుండాపోయింది.
దాదాపు 13 ఏండ్లుగా అతడు కోమాలోనే ఉండి జీవచ్ఛవంలా మారిపోయాడు. వైద్యులు కూడా అతడు తిరిగి కోలుకోవడం కష్టమేనని తేల్చి చెప్పారు. దీంతో తన కుమారుడి కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వాలని రాణా పేరేంట్స్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.
కానీ ఇందుకు ఢిల్లీ హైకోర్టు ఒప్పుకోలేదు. దీంతో రాణా తల్లిదండ్రులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన దేశ సర్వోన్నత న్యాయస్థానం మెడికల్ రిపోర్ట్స్, బాధితుడి తల్లిదండ్రుల మనోవేదనను పరిగణలోకి తీసుకుని రాణా కారుణ్య మరణానికి అనుమతి ఇస్తూ 2026, మార్చి 11న చారిత్రాత్మక తీర్పు వెలువరించింది.