July 8, 2026

Off The Record: కూటమిలో కొలికపూడిలు ఇంకా చాలా మంది ఉన్నారా..?

Off The Record: కూటమిలో కొలికపూడిలు ఇంకా చాలా మంది ఉన్నారా..?
Reading Time: 2 minutes
Kolikapudi Srinivas Controversy Are There More Dissatisfied Mlas In The Ap Alliance

Off The Record: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్‌ కొరకరాని కొయ్యలాగే మారిపోయారు. సొంత పార్టీ ఎంపీతో సఖ్యత లేకపోవడం, ఒక్కోసారి ప్రభుత్వాన్నే ఇరుకున పెట్టేలా మాట్లాడ్డం లాంటివి ఇబ్బందికరంగా మారుతున్నాయన్న అభిప్రాయం ఉంది టీడీపీ వర్గాల్లో. ఎమ్మెల్యే ఏదో ఒక సబ్జెక్ట్‌ మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, వాటి మీద పార్టీ అధిష్టామం సీరియస్‌ అయిపోవడం, తిరిగి ఆయన వివరణ ఇవ్వడం రొటీన్‌ వ్యవహారాలుగా మారిపోయాయి. ఈ తంతుకు అంతం లేదా అని పార్టీలో చర్చ జరుగుతున్న టైంలో తాజాగా మేటర్‌ ఇంకా ముదిరిపోయింది. నన్ను ఏమైనా అంటే సహిస్తా….. కానీ నా జాతిని ఏమైనా అంటే తెగిస్తానంటూ ఎమ్మెల్యే మాట్లాడ్డంతో.. అసలు తిరువూరులో ఏం జరుగుతోందంటూ… ఒక్కసారిగా అటు టర్న్‌ ఇచ్చుకున్నాయి రాజకీయవర్గాలు. ఆ వ్యవహారం అలా జరుగుతుండగానే… ఇప్పుడు కూటమి సర్కిల్స్‌లో మరో రకమైన డిస్కషన్‌ మొదలైంది. ఒకవేళ యాక్షన్‌ తీసుకునో, సర్దిచెప్పో తిరువూరు ఎపిసోడ్‌కు ముగింపు పలికినా….. అసలు కూటమిలో ఇంకెందరు కొలికపూడిలు ఉన్నారన్న ప్రశ్నలు వస్తున్నాయట. ఈ ఇన్‌స్పిరేషన్‌తో ఒకవేళ వాళ్ళంతా గొంతెత్తడం మొదలు పెడితే పరిస్థితి ఏంటన్న కంగారు సైతం ఉందట.

అందుకే ఎమ్మెల్యేల్లో ఎవరెవరు అసంతృప్తిగా ఉన్నారు, వాళ్ళలో బయటపడి మాట్లాడగలిగిన వాళ్ళు ఎందరంటూ ఆరా తీస్తున్నట్టు సమాచారం. చాలామంది ఎమ్మెల్యేల పనితీరుపై ఇటీవల బాహాటంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు సీఎం చంద్రబాబు. మీరు మారాలంటూ వార్నింగ్స్‌ కూడా ఇస్తున్నారు. గతంలో కొలికపూడి శ్రీనివాస్‌కు కూడా ఇదే తరహాలో చెప్పారు. కానీ… ఆయన మాత్రం మాట వినకపోగా డిఫరెంట్‌గా రియాక్ట్ అయ్యారు. దీంతో అసంతృప్తి ఉన్న మిగతా వాళ్ళు కూడా అలాగే ఆలోచించి రియాక్ట్‌ అయితే కష్టమేనన్న చర్చ నడుస్తోందట కూటమి వర్గాల్లో. ఇప్పటికే ఒకరిద్దరు జనసేన ఎమ్మెల్యేలు కూటమిలోని సమన్వయ లోపం గురించి బయటపడుతున్నారు. ముఖ్యంగా టీడీపీ- జనసేన కో ఆర్డినేషన్ పై వాళ్ళు రియాక్ట్‌ అవుతున్నారు. కూటమిలో ఏకాభిప్రాయం ముఖ్యమని పై స్థాయిలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌ పదే పదే చెబుతున్నారు. కానీ… కిందికి వచ్చేసరికి ఆ మాటలు వంద శాతం అప్లయ్‌ అవడం లేదన్న మాటలు గట్టిగానే వినిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో కొలికపూడి వ్యవహార శైలి ప్రభావం….మరి కొంతమంది ఎమ్మెల్యేల పై పడుతుందా అన్నది పెద్దల భయం అట.

అదే సమయంలో తిరువూరు ఎమ్మెల్యే వ్యవహారాన్ని ఇంత దూరం లాగకుండా ఉండాల్సిందన్న మాటలు సైతం వినిపిస్తున్నాయి. ఇంత రచ్చ జరిగాక తాజాగా కొలికపూడితో టీడీపీ ఫీడ్ బ్యాక్ కమిటీ సభ్యులు సమావేశం అయ్యారు. ప్రస్తుతానికి సమస్యకు ఫుల్ స్టాప్ పడిందని ఆ తర్వాత ఎమ్మెల్యే ప్రకటించారు. అయితే… ఇలాగే వదిలేస్తే… ఇది ఒక్క కొలికపూడితోనే పోదని, మిగతా అసంతృప్తులు కూడా గొంతు సవరించుకునే ప్రమాదం ఉందని అంచనా వేస్తున్నారు కూటమి నేతలు. అలాంటి వాటిని మొదట్లోనే అడ్డుకోకుంటే…. మొదటికే మోసం వస్తుందన్న హెచ్చరికలు సైతం ఉన్నాయి.