Reading Time: < 1 minute
Cm Chandrababu Amaravati Justice City Plan

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దే క్రమంలో భాగంగా, అక్కడ దేశంలోనే అత్యుత్తమ ‘జస్టిస్ సిటీ’ని నిర్మించనున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) అమరావతి పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొని ప్రసంగించారు. ఏపీ చరిత్రలో ఇదొక చారిత్రాత్మక రోజని, న్యాయవ్యవస్థకు అత్యున్నత ప్రాధాన్యం ఇచ్చేలా రాజధానిని తీర్చిదిద్దుతున్నామని ఆయన పేర్కొన్నారు.

న్యాయ విభాగానికి సంబంధించిన అన్ని విభాగాలు ఒకే చోట ఉండేలా ‘జస్టిస్ సిటీ’ని డిజైన్ చేస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు. జుడీషియల్ అకాడమీ, లీగల్ సర్వీస్ అథారిటీ, మీడియేషన్ సెంటర్ , ఇంటర్నేషనల్ లా యూనివర్సిటీలను అనుసంధానిస్తూ ఈ ప్రాజెక్ట్ ఉంటుందని చెప్పారు. జుడీషియల్ అకాడమీ నిర్మాణానికి సంబంధించి ఎంత భూమి కావాలన్నా ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ఈ విషయంలో సీజేఐ తన సూచనలు , సహకారం అందించాలని ఆయన కోరారు.

అమరావతి ప్రత్యేకతను వివరిస్తూ.. ఇది ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా ‘ల్యాండ్ పూలింగ్’ ద్వారా నిర్మితమవుతున్న నగరమని సీఎం గుర్తుచేశారు. సుమారు 29,000 మంది రైతులు తమ 33,000 ఎకరాల భూమిని రాజధాని కోసం స్వచ్ఛందంగా అప్పగించారని, ఇది కేవలం ఒక నగరం మాత్రమే కాదు, “ప్రజా రాజధాని” అని ఆయన అభివర్ణించారు. కాలుష్య రహితంగా, గ్రీన్ ఎనర్జీతో, పర్యావరణ హితంగా ఈ నగరాన్ని నిర్మిస్తున్నామని, ఇక్కడ నివసించే వారి జీవన ప్రమాణాలు మెరుగుపడటంతో పాటు వారి ఆయుష్షు కనీసం 20 ఏళ్లు పెరుగుతుందని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు.

కోర్టు కేసుల భారాన్ని తగ్గించే ‘మీడియేషన్’ ప్రక్రియపై సీజేఐకి ఉన్న ఆసక్తిని ముఖ్యమంత్రి అభినందించారు. తన తండ్రికి పెద్దగా చదువు లేకపోయినా తన చిన్నతనంలో గ్రామాల్లో మధ్యవర్తిగా ఉండి సమస్యలను పరిష్కరించేవారని ఆయన గుర్తు చేసుకున్నారు. కోర్టుల వెలుపల సమస్యలను సామరస్యంగా పరిష్కరించే మీడియేషన్ కేంద్రాలకు అమరావతిలో అత్యుత్తమ సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.