Reading Time: 2 minutes
Mojtaba Khamenei Iran New Supreme Leader Ali Khamenei Successor

Mojtaba Khamenei: ఇరాన్ రాజకీయాల్లో పెను సంచలనం చోటుచేసుకుంది. వైమానిక దాడిలో సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ మరణించినట్లు ధృవీకరించిన కొద్ది గంటల్లోనే, ఆయన కుమారుడు మోజ్తబా ఖమేనీ (55) దేశ తదుపరి అత్యున్నత నాయకుడిగా ఎన్నికయ్యారు. ఫిబ్రవరి 28న తేహ్రాన్‌లోని తన కార్యాలయంపై జరిగిన దాడిలో 86 ఏళ్ల అలీ ఖమేనీ ప్రాణాలు కోల్పోయినట్లు ఇరాన్ స్టేట్ మీడియా వెల్లడించింది. అలీ ఖమేనీ మరణవార్తతో ఇరాన్ ప్రభుత్వం దిగ్భ్రాంతికి గురైంది. దేశంలో 7 రోజుల ప్రభుత్వ సెలవుతో పాటు, 40 రోజుల పాటు జాతీయ సంతాప దినాలను ప్రకటించింది. ప్రధాన నగరాలు, ప్రభుత్వ భవనాలు, సైనిక స్థావరాల వద్ద అదనపు భద్రతా దళాలను మోహరించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిఘా పెంచారు.

READ ALSO: Krrish-4 : ‘క్రిష్ 4’ విషయంలో హృతిక్ రోషన్ షాకింగ్ నిర్ణయం..

ఎవరీ మోజ్తబా ఖమేనీ..
1969లో మషాద్ నగరంలో జన్మించిన మోజ్తబా ఖమేనీ, చిన్నతనం నుంచే మతపరమైన విద్యను అభ్యసించారు. ఇరాన్-ఇరాక్ యుద్ధం చివరి దశలో ఆయన రివల్యూషనరీ గార్డ్స్ (IRGC)లో పనిచేశారు. దీనివల్ల ఆయనకు సైనిక, పారామిలిటరీ దళాలతో బలమైన సంబంధాలు ఉన్నాయి. మోజ్తబా ఎప్పుడూ ప్రత్యక్షంగా ప్రభుత్వ పదవులు నిర్వహించలేదు. కానీ, తన తండ్రికి అత్యంత నమ్మకమైన సలహాదారుగా ఉంటూ, ఇరాన్ కీలక నిర్ణయాల్లో తెరవెనుక చక్రం తిప్పేవారని చెబుతుంటారు. 2009లో ఇరాన్‌లో జరిగిన భారీ నిరసనల సమయంలో మోజ్తబా పేరు మొదటిసారిగా అంతర్జాతీయ స్థాయిలో చర్చకు వచ్చింది. ఆ నిరసనలను కఠినంగా అణచివేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. 1979 ఇస్లామిక్ విప్లవం ప్రధానంగా ‘రాజవంశ పాలన’కు వ్యతిరేకంగా జరిగింది. ఇప్పుడు మళ్లీ తండ్రి తర్వాత కుమారుడే అత్యున్నత పదవిని చేపట్టడం ఇరాన్ రాజకీయ వర్గాల్లో కొత్త చర్చకు దారితీసింది. కొందరు దీనిని విప్లవ ఆదర్శాలకు విరుద్ధమని భావిస్తుండగా, సైనిక మద్దతు మాత్రం మోజ్తబాకు బలంగా ఉందని చర్చించుకుంటున్నారు. కొత్త సుప్రీం లీడర్ నాయకత్వంలో ఇరాన్ ఇప్పుడు ఏ దిశగా సాగుతుంది, అమెరికా-ఇజ్రాయెల్ దాడులకు మోజ్తబా ఎలా స్పందిస్తారు, అనేది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది.

READ ALSO: Next Supreme Leader of Iran: ఖమేనీ తర్వాత ఎవరు? ఇరాన్ తదుపరి ‘సుప్రీం లీడర్’ రేసులో ఆ ఇద్దరు కీలక వ్యక్తులు!