
- మహిళా అక్షరాస్యతతోనే కుటుంబాల్లో వెలుగులు మంత్రి సీతక్క
హైదరాబాద్, వెలుగు: వయోజనులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు విద్యాశాఖ చేపట్టిన ‘అమ్మకు అక్షరమాల’ కార్యక్రమం విజయవంతమైంది. ఇందులో భాగంగా ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా అడల్ట్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ (ఉల్లాస్) పరీక్ష నిర్వహించారు. గుర్తించిన 7.25 లక్షల మందిలో 6.32 లక్షల మంది వయోజనులు ఈ పరీక్షకు హాజరయ్యారు. వీరిలో గ్రామీణ ప్రాంతాలకు చెందిన మహిళలే 5.32 లక్షల మంది ఉండగా, పట్టణ ప్రాంతాల నుంచి లక్ష మంది పరీక్ష రాశారు. పరీక్ష రాసిన అభ్యాసకులను పంచాయతీరాజ్, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అభినందించారు.
అక్షరం నేర్చుకోవడం అంటే కేవలం చదవడం, రాయడం కాదని, అది ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవడమని పేర్కొన్నారు. ఉల్లాస్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారంతా తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (టాస్) ద్వారా పదో తరగతి పరీక్షలు రాసేందుకు ప్రభుత్వం అవకాశం కల్పిస్తోందని మంత్రి తెలిపారు. 2026–27 విద్యా సంవత్సరానికి ప్రవేశాలు జరుగుతున్నాయని, అర్హులైన వారు మీసేవ, టాస్ స్టడీ సెంటర్లు లేదా అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వృత్తి విద్యా కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయని చెప్పారు. నిరక్షరాస్యతను తగ్గించాలనే సంకల్పంతో ప్రభుత్వం ప్రత్యేక శిక్షణ ఇస్తోందని, తాజాగా లక్షలాది మంది పరీక్ష రాయడం అక్షరాస్యత ఉద్యమ విజయానికి నిదర్శనమని అధికారులు పేర్కొన్నారు.