Reading Time: 1 minute
Tamil Nadu Cm Vijay Launches One Gram Gold Ring Scheme For Newborns

Gold Ring Scheme: తమిళనాడులో మరో కొత్త స్కీమ్‌కు శ్రీకారం చుట్టేందుకు సిద్ధం అవుతున్నారు ముఖ్యమంత్రి విజయ్.. నవజాత శిశువుల కోసం ‘థాయ్ మామన్ తంగా మోతిరం తిట్టం’ పేరుతో కొత్త పథకాన్ని ప్రారంభించనుంది. ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ సెప్టెంబర్ 28న అనగా ఈ రోజు మదురైలోని ప్రభుత్వ ఆస్పత్రిలో ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో పుట్టిన అర్హులైన శిశువులకు ఒక గ్రాము బంగారు ఉంగరం అందించడం ఈ పథకం ఉద్దేశం.

ఈ పథకం కింద 2026 జూన్ 22 నుంచి ప్రభుత్వ ఆస్పత్రుల్లో జన్మించిన అర్హులైన శిశువులను కూడా పరిగణనలోకి తీసుకుంటారు. తొలి దశలో పంపిణీ కోసం ప్రభుత్వం 1.28 లక్షల బంగారు ఉంగరాలను సిద్ధం చేసింది. ప్రతి ఉంగరానికి ప్రత్యేక సీరియల్ నంబర్ ఉండటంతో పాటు, ట్యాంపర్ ప్రూఫ్ ప్యాకేజింగ్‌లో అందించనున్నారు. ఈ పథకానికి అర్హత పొందాలంటే తల్లి తమిళనాడు శాశ్వత నివాసి అయి ఉండాలి. అలాగే Pregnancy and Infant Cohort Monitoring and Evaluation (PICME)లో నమోదు చేసుకుని, Reproductive and Child Health (RCH) ID పొందినవారై ఉండాలి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో పుట్టిన శిశువులకే ఈ పథకం వర్తిస్తుంది.

ఇక, ఈ స్కీమ్‌ కింద జూన్ 22 నుంచి సెప్టెంబర్ 27వ తేదీ వరకు జన్మించిన శిశువులకు ఉంగరాలు అందించేందుకు రాష్ట్రవ్యాప్తంగా 107 హబ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. సెప్టెంబర్ 28 నుంచి ప్రతి హబ్‌లో రోజుకు 100 మంది శిశువులకు చొప్పున పంపిణీ చేయనున్నారు. పథకం ప్రారంభమైన తర్వాత ప్రభుత్వ ఆస్పత్రుల్లో పుట్టే అర్హులైన శిశువులకు ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేసే సమయంలోనే ఉంగరం అందించనున్నారు

తమిళ సంస్కృతిలోని ‘థాయ్ మామన్ సీర్’ సంప్రదాయాన్ని ప్రతిబింబించేలా ఈ పథకాన్ని రూపొందించినట్లు ప్రభుత్వం పేర్కొంది.. ప్రభుత్వ వైద్య సేవలపై ప్రజల నమ్మకాన్ని పెంచడం, ఆస్పత్రుల్లో సురక్షిత ప్రసవాలను ప్రోత్సహించడం, తల్లి-బిడ్డ ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వడం వంటి లక్ష్యాలతో పథకాన్ని అమలు చేస్తున్నట్లు ప్రభుత్వం చెబుతుంది.. ఇక, ఈ రోజు మదురైలో మేనమామ బంగారు ఉంగరం పథకాన్ని ప్రారంభించనున్నారు సీఎం విజయ్.. మదురై రాజాజీ ప్రభుత్వ ఆస్పత్రిలో మధ్యాహ్నం 12 గంటలకు పథకం ప్రారంభించనున్నారు.. ఆ తర్వాత రూ.10.25 కోట్లతో పునర్నిర్మించిన మహాత్మాగాంధీ మ్యూజియం ప్రారంభించబోతున్నారు సీఎం విజయ్‌..