Reading Time: 2 minutes
Tamil Nadu Bans Construction Material Supplies To Neighbouring States For Three Months

తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పెరుగుతున్న నిర్మాణ అవసరాల దృష్ట్యా కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్‌లకు రఫ్ స్టోన్స్ (కంకర రాళ్లు), ఎం-సాండ్, మెటల్ జెల్లీతో పాటు ఇతర నిర్మాణ సామగ్రి రవాణాపై మూడు నెలల పాటు నిషేధం విధించింది. అయితే కేంద్ర పాలిత ప్రాంతాలైన పుదుచ్చేరి, కారైకాల్‌కు ఈ ఆంక్షల నుంచి మినహాయింపు ఇచ్చింది. మంగళవారం ముఖ్యమంత్రి విజయ్ అధ్యక్షతన జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో వేగంగా పట్టణీకరణ, గృహ నిర్మాణం, పారిశ్రామికాభివృద్ధి, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు పెరుగుతున్న నేపథ్యంలో నిర్మాణ సామగ్రికి భారీ డిమాండ్ ఏర్పడిందని ప్రభుత్వం వెల్లడించింది.

ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ప్రస్తుతం రాష్ట్రంలోని క్వారీల నుంచి ఉత్పత్తి అవుతున్న రఫ్ స్టోన్స్, నిర్మాణ సామగ్రి తమిళనాడులో పెరుగుతున్న అవసరాలను పూర్తిగా తీర్చలేకపోతోంది. అదే సమయంలో పెద్దఎత్తున నిర్మాణ సామగ్రిని పొరుగు రాష్ట్రాలకు తరలించడం వల్ల రాష్ట్రంలో కృత్రిమ కొరత ఏర్పడి ధరలు పెరుగుతున్నాయని ప్రభుత్వం పేర్కొంది. అందువల్ల ప్రభుత్వ, ప్రైవేట్ నిర్మాణ ప్రాజెక్టులకు అవసరమైన సామగ్రి అందుబాటులో ఉండేలా ఈ తాత్కాలిక నిషేధం విధించినట్లు స్పష్టం చేసింది. అలాగే కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్‌లలో రఫ్ స్టోన్స్ కొరత లేదని, అందువల్ల ఈ నిర్ణయం వాటిపై పెద్దగా ప్రభావం చూపదని ప్రభుత్వం అభిప్రాయపడింది.

కఠిన చర్యలకు హెచ్చరిక

నిషేధాన్ని కచ్చితంగా అమలు చేసేందుకు సరిహద్దు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది. ఖనిజాల రవాణాను పర్యవేక్షించే శాఖలతో సమన్వయం చేసుకుని అక్రమ రవాణాను అడ్డుకోవాలని సూచించింది. నిబంధనలు ఉల్లంఘించే వారిపై తమిళనాడు ప్రివెన్షన్ ఆఫ్ ఇల్లీగల్ మైనింగ్, ట్రాన్స్‌పోర్టేషన్ అండ్ స్టోరేజ్ ఆఫ్ మినరల్స్ అండ్ మినరల్ డీలర్స్ రూల్స్-2011తో పాటు ఇతర చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది.

ఈ నిర్ణయం వెలువడిన వెంటనే కేరళ ముఖ్యమంత్రి సతీశన్ తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌కు లేఖ రాశారు. జాతీయ రహదారి ప్రాజెక్టుల కోసం అవసరమైన నిర్మాణ సామగ్రి రవాణాకు ప్రత్యేక మినహాయింపు ఇవ్వాలని కోరారు. తిరునెల్వేలి, టెంకాసి, కన్యాకుమారి జిల్లాల నుంచి కేరళలోని అనేక జాతీయ రహదారి ప్రాజెక్టులకు రఫ్ స్టోన్స్ సరఫరా జరుగుతోందని, తాజా ఆంక్షలతో ఆ సరఫరా పూర్తిగా దెబ్బతిందని పేర్కొన్నారు. కేరళలో నాణ్యమైన నిర్మాణ రాళ్లు పరిమితంగా లభిస్తాయని, ఈ పరిస్థితి కొనసాగితే జాతీయ రహదారి నిర్మాణ పనులు ఆలస్యమయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఆంక్షల వల్ల ప్రాంతీయ రవాణా, వాణిజ్యం, పర్యాటక రంగాలతో పాటు విజింజం అంతర్జాతీయ నౌకాశ్రయం, వల్లార్‌పాడం ఇంటర్నేషనల్ కంటైనర్ ట్రాన్స్‌షిప్‌మెంట్ టెర్మినల్ అనుసంధానానికి సంబంధించిన ప్రాజెక్టులపై కూడా ప్రభావం పడే అవకాశం ఉందని కేరళ ప్రభుత్వం పేర్కొంది. తమిళనాడు సహజ వనరుల పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలను గౌరవిస్తున్నామని, అయితే జాతీయ ప్రాధాన్యమున్న మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల కోసం మాత్రమే నిర్మాణ సామగ్రి రవాణాకు ప్రత్యేక మినహాయింపు కల్పించే విధానాన్ని రూపొందించాలని సతీశన్ విజ్ఞప్తి చేశారు. రెండు రాష్ట్రాలు పరస్పర సహకారంతో తమిళనాడు అంతర్గత అవసరాలు, కేరళలో కొనసాగుతున్న కీలక జాతీయ ప్రాజెక్టుల అవసరాల మధ్య సమతుల్యత సాధించగలవని ఆశాభావం వ్యక్తం చేశారు.