Reading Time: 2 minutes
Power Bank: విమానంలో పవర్‌ బ్యాంక్ తీసుకువెళ్లవచ్చా? డీజీసీఏ రూల్స్ ఏంటి?

విమాన ప్రయాణం చేసేటప్పుడు చాలామందికి లగేజీ నిబంధనలపై రకరకాల సందేహాలు ఉంటాయి. ముఖ్యంగా ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి దగ్గరా ఉండే పవర్‌ బ్యాంక్ (Power Bank) ను ఫ్లైట్‌లో తీసుకువెళ్లవచ్చా? ఒకవేళ తీసుకువెళితే దానిని హ్యాండ్ లగేజీలో ఉంచాలా లేక చెక్-ఇన్ లగేజీలో పెట్టాలా? అనే గందరగోళం ఉంటుంది. దీనిపై ‘డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్’ (DGCA) స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేసింది. ఆ వివరాలు ఇవే.

హ్యాండ్ లగేజీలోనే అనుమతి: డీజీసీఏ నిబంధనల ప్రకారం, పవర్‌ బ్యాంక్‌లను కేవలం మీ హ్యాండ్ లగేజీ లేదా మీతో పాటు ఉంచుకునే బ్యాగుల్లో మాత్రమే తీసుకువెళ్లాలి. పవర్‌ బ్యాంక్‌లను పొరపాటున కూడా చెక్-ఇన్ లగేజీ (విమానం కింది భాగంలో వెళ్లే పెద్ద సూట్‌కేసులు) లో పెట్టకూడదు. ఒకవేళ మీరు చెక్-ఇన్ లగేజీలో పవర్‌ బ్యాంక్ పెట్టినట్లు స్క్రీనింగ్‌లో తెలిస్తే, ఎయిర్‌లైన్స్ సిబ్బంది ఆ బ్యాగును తెరిపించి దానిని బయటకు తీసేస్తారు. దీనివల్ల మీ ప్రయాణం ఆలస్యమయ్యే అవకాశం ఉంది.

పవర్‌ బ్యాంక్‌ను కేవలం హ్యాండ్ లగేజీలోనే ఎందుకు ఉంచాలి?

పవర్‌ బ్యాంక్‌లలో లిథియం-అయాన్ (Lithium-ion) బ్యాటరీలు ఉంటాయి. విమాన ప్రయాణంలో ఒత్తిడి లేదా ఉష్ణోగ్రత హెచ్చుతగ్గుల వల్ల కొన్నిసార్లు ఈ బ్యాటరీలలో షార్ట్ సర్క్యూట్ జరిగి నిప్పు అంటుకునే ప్రమాదం ఉంది. ఒకవేళ ఇది చెక్-ఇన్ కార్గో (లగేజ్ కేబిన్)లో జరిగితే, అక్కడ సిబ్బంది ఎవరూ ఉండరు కాబట్టి మంటలను వెంటనే ఆర్పడం కష్టమవుతుంది.

అదే ప్యాసింజర్ కేబిన్ (హ్యాండ్ లగేజీ)లో అయితే మంటలు లేదా పొగ రావడాన్ని విమాన సిబ్బంది వెంటనే గుర్తించి, అందుబాటులో ఉండే అగ్నిమాపక పరికరాలతో ప్రమాదాన్ని తక్షణమే అదుపు చేయగలరు. అందుకే భద్రతా కారణాల దృష్ట్యా ఈ నియమం పెట్టారు.

పవర్‌ బ్యాంక్ సామర్థ్యం ఎంత ఉండాలి?

విమానంలో మీరు పవర్‌ బ్యాంక్ తీసుకువెళ్లడానికి నిర్దిష్ట పరిమితులు ఉన్నాయి. సాధారణంగా 100 వాట్-అవర్స్ (Wh) లేదా అంతకంటే తక్కువ సామర్థ్యం ఉన్న పవర్‌ బ్యాంక్‌లను ఎటువంటి ప్రత్యేక అనుమతి లేకుండానే హ్యాండ్ లగేజీలో తీసుకువెళ్లవచ్చు. (మనం వాడే 10,000mAh నుండి 20,000mAh పవర్‌ బ్యాంక్‌లు ఈ పరిమితి లోపే ఉంటాయి). 100Wh నుండి 160Wh వరకు ఈ పరిమితిలో ఉన్న పవర్‌ బ్యాంక్‌లను తీసుకువెళ్లడానికి సంబంధిత ఎయిర్‌లైన్స్ సంస్థ నుండి ముందస్తు అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే 160Wh కంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న పవర్‌ బ్యాంక్‌లను విమానాల్లో తీసుకువెళ్లడానికి ఎంతమాత్రం అనుమతించరు.

ప్రయాణికులు తీసుకోవలసిన జాగ్రత్తలు:

పవర్‌ బ్యాంక్‌పై దాని సామర్థ్యం (mAh లేదా Wh) స్పష్టంగా ముద్రించి ఉండాలి. రేటింగ్స్ చెరిగిపోయిన లేదా విరిగిపోయిన పవర్‌ బ్యాంక్‌లను సెక్యూరిటీ చెకింగ్ సమయంలో సిబ్బంది జప్తు చేసే అవకాశం ఉంది. విమాన ప్రయాణంలో ఉన్నప్పుడు పవర్‌ బ్యాంక్ ద్వారా మొబైల్ ఫోన్లను ఛార్జ్ చేయడాన్ని కొన్ని ఎయిర్‌లైన్స్ అనుమతించవు. అందుకే విమానం లోపల వీటిని వాడకపోవడమే మంచిది.

New LPG Cylinder Rules: షాకింగ్.. వీళ్లు ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ సరెండర్ చేయాల్సిందే.. లేదంటే కనెక్షన్ కట్!

ఇది కూడా చదవండి: Personal Finance: నెలకు రూ. 1,000 పెట్టుబడితో రూ. 54 లక్షల ఫండ్..!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి