Reading Time: 2 minutes

వెలుగు ఓపెన్ పేజీ:ఎస్ఎచ్ఓలకు.. లా అర్హత తప్పనిసరి చేయాలి!

Caption of Image.

భారతదేశంలో న్యాయ వ్యవస్థ బలంగా ఉండాలంటే, మొదటి మెట్టైన పోలీసింగ్ కూడా అదే స్థాయిలో నిష్పక్షపాతంగా, న్యాయపరంగా ఉండాలి. కానీ వాస్తవ పరిస్థితుల్లో చూస్తే, స్టేషన్ హౌస్ ఆఫీసర్ (SHO) స్థాయిలో ఉన్న అధికారుల చేతుల్లోనే ఎఫ్ఐఆర్ నమోదు, కేసుల ప్రారంభ దశ విచారణలు ఉండగా, వారికి న్యాయశాస్త్రంపై సరైన అవగాహన లేకపోవడం వల్ల వ్యవస్థలో స్పష్టమైన లోపాలు కనిపిస్తున్నాయి. 

ఈ నేపథ్యంలో ఎస్​హెచ్​ఓ  స్థాయికి చేరుకునే పోలీసు అధికారులకు తప్పనిసరిగా ఎల్ఎల్‌‌బీ  డిగ్రీ ఉండాలనే ఆలోచన ప్రాధాన్యం సంతరించుకుంటోంది. ప్రస్తుతం భారతదేశంలో పోలీస్ నియామకాలలో లా డిగ్రీ తప్పనిసరి అర్హతగా లేదు. ఎక్కువగా సాధారణ డిగ్రీ సరిపోతుంది. శిక్షణ సమయంలో భారతీయ శిక్షాస్మృతి (IPC), క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (CrPC), సాక్ష్యాధారాల చట్టం వంటి ప్రాథమిక చట్టాలు నేర్పిస్తారు. అయితే ఈ శిక్షణ ఎక్కువగా ఫీల్డ్ స్థాయి పనుల మీదే కేంద్రీకృతమై ఉంటుంది. 

కేసు నమోదు సమయంలో ఏ చట్టం వర్తించాలి, ఎలాంటి సెక్షన్లు పెట్టాలి, కోర్టులో కేసు నిలబడేలా ఎలా రూపొందించాలి వంటి అంశాలపై లోతైన అవగాహన రావడం లేదు. దీని ప్రభావం ఎఫ్ఐఆర్‌‌ల నాణ్యతపై స్పష్టంగా కనిపిస్తోంది. కొన్ని సందర్భాల్లో కేసు తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ బలహీనమైన సెక్షన్లు మాత్రమే నమోదు అవుతాయి. మరికొన్ని సందర్భాల్లో చిన్న గొడవలు, వ్యక్తిగత విభేదాలుగా ఉండే కేసుల్లో కూడా అవసరానికి మించి కఠినమైన సెక్షన్లు నమోదు అవుతున్నాయి. 

ఉదాహరణకు, ఇద్దరి మధ్య జరిగిన సాధారణ కొట్లాటలోనే హత్యాయత్నం వంటి తీవ్రమైన సెక్షన్లు నమోదు చేసిన సందర్భాలు పలు రాష్ట్రాల్లో బయటపడ్డాయి. ఈ రెండు విధానాలూ తప్పే. ఒకవైపు నిజమైన నేరానికి తగిన న్యాయం జరగకపోవడం, మరోవైపు చిన్న కేసులు కూడా అనవసరంగా పెద్దవిగా మారడం జరుగుతోంది. కోర్టులలో ఇలాంటి లోపాలు మరింత స్పష్టంగా బయటపడుతున్నాయి. 

లా డిగ్రీ తప్పని సరి చేయాలి

ఎఫ్ఐఆర్‌‌లో సరైన సెక్షన్లు లేకపోవడం లేదా అసంబంధిత సెక్షన్లు ఉండడం వల్ల న్యాయమూర్తులు తరచూ కేసు సవరణలు సూచిస్తున్నారు. కొన్నిసార్లు అదనపు దర్యాప్తు ఆదేశాలు కూడా ఇస్తున్నారు. దీనివల్ల కేసుల పరిష్కారం ఆలస్యం అవ్వడమే కాకుండా, బాధితులు, నిందితులు ఇద్దరూ అనవసర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాబట్టి, ఎస్​హెచ్​ఓ  స్థాయిలో లా డిగ్రీ తప్పనిసరి చేయడం ఒక అవసరమైన సంస్కరణగా కనిపిస్తోంది. 

లా చదివిన అధికారి ఎఫ్ఐఆర్ నమోదు సమయంలోనే సరైన సెక్షన్లు ఎంపిక చేయగలడు. ఈ మార్పును వెంటనే అమలు చేయడం సవాలుగా ఉంటుంది. ఇప్పటికే పనిచేస్తున్న అధికారులకు లా డిగ్రీ తప్పనిసరి చేయడం కష్టం. అందుకే దశలవారీగా అమలు చేయడం, సేవలో ఉన్న అధికారులకు న్యాయ శిక్షణను విస్తరించడం, కొత్త నియామకాలలో లా అర్హతను తప్పనిసరి చేయడం వంటి మార్గాలు ఆలోచించాల్సి ఉంటుంది. మొత్తానికి, పోలీసింగ్‌‌లో న్యాయ అవగాహన లోపం వల్ల జరుగుతున్న తప్పిదాలు వ్యక్తుల జీవితాలపై ప్రత్యక్ష ప్రభావం చూపుతున్నాయి. 

సరైన సెక్షన్లు నమోదు కాకపోవడం వల్ల న్యాయం జరగకపోవడం కూడా తప్పే, అవసరానికి మించి కఠినమైన సెక్షన్లు పెట్టడం కూడా అంతే ప్రమాదకరం. ఈ పరిస్థితిని మార్చాలంటే ఎస్​హెచ్​ఓ  స్థాయిలో లా అర్హతను తప్పనిసరి చేయడం, లేదా కనీసం సమగ్ర న్యాయ శిక్షణను అందించడం అనివార్యం. ఇది న్యాయ వ్యవస్థను మరింత సమర్థవంతంగా, విశ్వసనీయంగా మార్చే దిశగా ఒక కీలక నిర్ణయంగా నిలుస్తుంది.

– శ్రీనివాస్ గౌడ్ ముద్దం, సామాజిక విశ్లేషకుడు
ఓపెన్​ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్​ ఐడీ
openpage@v6velugu.com
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని 
హామీ తప్పనిసరి రాయాలి. 
స్వీయ రచన అయి ఉండాలి.
రచన 700 పదాలకు మించరాదు.

©️ VIL Media Pvt Ltd.