
Story Board : బెంగాల్లో మమత అప్రతిహత రాజకీయ విజయాలకు బ్రేక్ పడింది. ఐదు దశాబ్దాలుగా రాజకీయ పోరాటాల్నే నమ్ముకుని ఎదిగిన దీదీకి ఇప్పుడు బీజేపీ షాకిచ్చింది. యూత్ కాంగ్రెస్ నుంచి మొదలైన ప్రస్థానం.. బెంగాల్‌కు హ్యాట్రిక్ సీఎం అయ్యేదాకా ఎదురులేకుండా కొనసాగింది. బెంగాల్ కూతురిగా తనను తాను ప్రొజెక్ట్ చేసుకునే మమత.. మా మాటీ మనుష్ నినాదంతో ఆ రాష్ట్ర ప్రజల్ని ఆకట్టుకున్నారు. సీఎంగా ఉన్నా, కేంద్రమంత్రిగా ఉన్నా.. సామాన్యురాలిగా సఫేద్ సాడీ.. ఛప్పల్ జోడీ నినాదానికి పూర్తిగా న్యాయం చేశారు. ఇప్పుడు మమతా బెనర్జీ భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతోంది..? దీదీ మళ్లీ ఫీనిక్స్‌లా లేచే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి..?
దేశంలో ఏ రాష్ట్రంలో అయినా విజయం సాధించవచ్చు. కానీ బెంగాల్ కూతుర్ని ఓడించటం మీ తరం కాదంటూ హుంకరించిన మమతకు.. ఓటమి తప్పలేదు. పదిహేనేళ్ల పాటు సీఎంగా ఉన్న దీదీకి.. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు.. కొన్ని స్వీయ తప్పిదాలూ చేటు చేశాయనడంలో సందేహం లేదు. ఏదేమైనా బెంగాల్ రాజకీయాల్లో దీదీ మార్క్ మాత్రం శాశ్వతం అని చెప్పటానికి సందేహించాల్సి పని లేదు.
మమతా బెనర్జీ సామాన్య కాంగ్రెస్ కార్యకర్తగా ప్రస్థానం మొదలుపెట్టి, పశ్చిమ బెంగాల్‌లో 34 ఏళ్ల వామపక్ష పాలనకు తెరదించి, వరుసగా మూడుసార్లు ముఖ్యమంత్రిగా ఎన్నికైన అప్రతిహత శక్తి. 1998లో తృణమూల్ కాంగ్రెస్‌ను స్థాపించి, మా-మాటి-మానుష్ నినాదంతో బెంగాల్ రాజకీయాల్లో బెంగాల్ పులిగా ఎదిగారు. 1970లలో కాంగ్రెస్ పార్టీలో మమతా బెనర్జీ తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. 1984లో జాదవ్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం నుండి సోమనాథ్ ఛటర్జీపై గెలుపొంది సంచలనం సృష్టించారు.ఆ తర్వాత కాంగ్రెస్‌తో విభేదాలతో 1998లో తృణమూల్ కాంగ్రెస్‌ను స్థాపించారు. వాజ్‌పేయి నేతృత్వంలోని NDA ప్రభుత్వంలో, అలాగే తర్వాత UPA ప్రభుత్వంలో కేంద్ర రైల్వే మంత్రిగా పనిచేశారు. ఇక 2011లో బెంగాల్ మొదటి మహిళా ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. నందిగ్రామ్, సింగూర్ భూసేకరణ వ్యతిరేక ఉద్యమాలతో బెంగాల్‌లో బలమైన ప్రజా నాయకురాలిగా గుర్తింపు పొందారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వీధిపోరాటాల్నే నమ్ముకుని సీఎం అయిన మమత.. ఆ పోరాట స్ఫూర్తి లోపించిందనే తన మాతృపార్టీ కాంగ్రెస్‌ను నిర్మొహమాటంగా విడిచిపెట్టారు. దీన్ని బట్టి రాజకీయ పోరాట పంథా విషయంలో రాజీ ఉండదని మమత తొలి రోజుల్లోనే స్పష్టమైన సంకేతాలు పంపారు. చివరకు ముఖ్యమంత్రి అయ్యాక మమతా బెనర్జీ తన పోరాట దృక్పథాన్ని వదులుకోలేదు. మిగతా సీఎంలకు భిన్నంగా వీధుల్లో ర్యాలీలు తీయటం, ప్రజలతో కలిసి నిరసనలు, ధర్నాలకు దిగటం.. దీదీకి అలవాటు. అసలు సీఎంగా ఉండి ఇలా రోడ్డెక్కడం ఏమిటని ప్రత్యర్థులు విమర్శించినా.. మమత మాత్రం తన ధోరణి మార్చుకోవటానికి ఇష్టపడలేదు.
పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ నాయకత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ వరుసగా మూడుసార్లు ఎన్నికల్లో గెలిచింది. 2011 ఎన్నికల్లో మార్పు నినాదంతో 34 ఏళ్ల కమ్యూనిస్టు పాలనను అంతం చేసిన దీదీ తొలిసారి బెంగాల్ సీఎం అయ్యారు. 2016 ఎన్నికల నాటికి శారద, నారద లాంటి కుంభకోణాల ఆరోపణలు వచ్చినప్పటికీ.. సంక్షేమ పథకాల సాయంతో రెండోసారి సునాయాసంగా గెలిచారు. 2021 ఎన్నికల నాటికి బీజేపీ బలంగా పోటీ ఇచ్చింది. హిందువులను తమవైపు తిప్పుకోవడానికి ప్రయత్నించింది. అయినా సరే ‘బెంగాల్’ సెంటిమెంట్, ముస్లిం ఓటు బ్యాంక్, మహిళా ఓట్ల సాయంతో ఆమె హ్యాట్రిక్ సాధించగలిగారు. లక్ష్మీర్ భాండార్, రూపశ్రీ, కన్యాశ్రీ, మహాత్మా శ్రీ, కర్మశ్రీ, యోగ్యశ్రీ వంటి పథకాలను అమలు చేసిన మమతా బెనర్జీ .. ఆ పథకాలు, బెంగాలీ సెంటిమెంట్ సాయంతో బలమైన ఓటుబ్యాంకును నిర్మించుకోగలిగారు. సంక్షేమ పథకాల అమలుపై శ్రద్ధ వహించిన మమతా బెనర్జీ.. మన దగ్గర గతంలో ఉన్న ప్రజల వద్దకే పాలన తరహాలో దువారే సర్కార్ కార్యక్రమాన్ని చేపట్టారు. రేషన్ కార్డులు, పెన్షన్లు, స్వాస్థ్య సాథి లాంటి వాటిని రాజకీయాలతో సంబంధం లేకుండా అందరికీ అందేలా చూశారు. ఇక రాజకీయ ప్రత్యర్థుల వ్యూహాలకు దీటైన ప్రతి వ్యూహాలను అమలు చేయడంలో దీదీ దిట్ట అని చెప్పొచ్చు. బీజేపీ బలమైన ప్రత్యర్థిగా ఎదిగినప్పటికీ.. కేంద్రంపై పోరాడుతున్న యోధురాలిగా బెంగాల్ ప్రజల్లో ఆమె తనను తను ప్రొజెక్ట్ చేసుకున్నారు. దీంతో గత ఎన్నికల్లో బీజేపీ అంచనాలు తప్పి.. మమత హ్యాట్రిక్ సీఎం అయ్యారు.
అలాగని మమత పాలనలో బెంగాలీలంతో సంతృప్తిగా ఉన్నారని చెప్పలేం. రాష్ట్రవ్యాప్తంగా తృణమూల్ కార్యకర్తలు చేసిన కట్‌మనీ దందా మమత ప్రతిష్ఠకు మాయని మచ్చగా మిగిలింది. కానీ బీజేపీ దీన్ని రాజకీయ అంశంగా చేయడంతో మేలుకున్న దీదీ.. వసూలు చేసిన కట్‌మనీని రిటర్న్ చేయాలని తన క్యాడర్‌కు ఆదేశాలిచ్చి.. బెంగాలీల్లో తన ఇమేజ్‌ను కాపాడుకోగలిగారు. ఇక శారదా, నారదా స్కాములు వెలుగుచూసినా.. ఆ మకిలి మమతకు అంటలేదని బెంగాలీలు నమ్మారు. దీదీకి తెలియకుండా కొందరు తృణమూల్ నేతలు కక్కుర్తి పడి ఉంటారనుకున్నారు. చివరకు కొందరు తృణమూల్ నేతలు బీజేపీ పంచన చేరి.. మమతపై విమర్శల వర్షం కురిపించినా.. బెంగాలీలు వారిని ఛీకొట్టి.. మమతకే అండగా ఉన్నారు. కానీ ఇన్ని ప్రతికూలతల్ని కాచుకున్న దీదీ.. ఇటీవల జరిగిన రెండు సంఘటనలకు మాత్రం జవాబు చెప్పలేక డీలా పడ్డారు. ఆ అవకాశాన్ని ప్రత్యర్థులు వ్యూహాత్మకంగా ఉపయోగించుకున్నారు.
ఓ ఒంటరి మహిళగా, సామాన్యురాలిగా, రాజీలేని పోరాట యోధురాలిగా మమతను మహిళా ఓటర్లు విపరీతంగా ఆదరించారు. ఎన్ని పార్టీలు రంగంలో ఉన్నా.. మహిళలు మాత్రం మరో మాట లేకుండా టీఎంసీ గడ్డి పూల గుర్తుకే ఓటేస్తూ వచ్చారు. కానీ ఆర్జీకర్, సందేశ్‌ఖాళీ ఘటనలు మాత్రం మమత ఇమేజ్‌పై సందేహాలు వచ్చేలా చేశాయి. ఆర్జీకర్ ఆస్పత్రిలో అత్యాచార ఘటన కంటే. ఆ ఘటనపై మమత స్పందించిన తీరు బెంగాల్ మహిళల్ని తీవ్రంగా నిరాశపరిచారు. దీనికి తోడు బాధితురాలి తల్లిదండ్రులతో అధికారులు ప్రవర్తించిన తీరు మరింత మైనస్ అయింది. ఇక సందేశ్ ఖాళీ సరేసరి. స్వయంగా తృణమూల్ నేతలపైనే ఆరోపణలు వచ్చిన ఈ ఘటనలోనూ మమత సరిగా రియాక్ట్ కాలేదని బెంగాలీలు భావించారు. ఈ రెండు కారణాలతోనే.. ఈసారి ఎన్నికల్లో బెంగాల్ మహిళలు మమతకు ఓటేయటానికి అంతగా ఆసక్తి చూపలేదు.
ఇప్పటికీ బెంగాల్‌లో మమత పూర్తిగా బలహీనపడలేదనే అభిప్రాయాలు లేకపోలేదు. సుదీర్ఘకాలం అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి.. దాదాపు వంద సీట్లు సాధించడం చిన్న విషయం కాదనే వాదన ఉండనే ఉంది. ఇక్కడ మరో వాదన కూడా ఉంది. తృణమూల్ మమత నియంత్రణలో ఉన్నంతకాలం బాగానే ఉందని, కానీ ఆమె మేనల్లుడు అభిషేక్ చేతికి అధికారం వచ్చాకే తేడా వచ్చిందని సొంత పార్టీ నేతలే చెప్పే పరిస్థితి. అభిషేక్‌ను రాజకీయ వారసుడిగా మమత చూస్తున్నా.. తృణమూల్ లో చాలా మంది నేతలకు అభిషేక్ తీరుపై అసంతృప్తి ఉంది. దీనికి తోడు అభిషేక్ బెనర్జీపై వచ్చిన అవినీతి ఆరోపణలు, వాటిపై మమత నిస్సహాయత కూడా పార్టీకి భారీగా దెబ్బకొట్టాయి. అప్పటిదాకా సింప్లిసిటీకి, పారదర్శకతకు పెట్టింది పేరుగా నిలిచిన మమత.. స్వయంగా కాకపోయినా.. మేనల్లుడి ద్వారా దోపిడీకి అలవాటుపడ్డారనే ప్రత్యర్థుల ప్రచారాన్ని దీదీ గట్టిగా తిప్పికొట్టలేకపోయారు. ఇక మొన్నటికి మొన్న ఏకంగా ఈడీ అధికారులు సోదాలు చేస్తున్న సమయంలో మమత వెళ్లి కొన్ని ఫైళ్లు తెచ్చేయటం.. తటస్థుల్నీ ఆమెకు దూరం చేసిందనే వాదన లేకపోలేదు. ఏతావాతా బెంగాల్ పులిగా గర్జించిన మమత.. ఇప్పుడు ప్రత్యర్థుల వ్యూహాలు, స్వీయ తప్పిదాలతో అపజయం పాలయ్యారు.
మొత్తం మీద మమతా బెనర్జీ రాజకీయ ప్రస్థానంలో ఎన్నో మెరుపులతో పాటు కొన్ని మరకలూ ఉన్నాయి. వామపక్ష ప్రభుత్వంపై ఎలాంటి విమర్శలు చేసి.. తొలిసారిగా మమత సీఎం అయ్యారో.. అవే ఆరోపణలు తనపై రాకుండా చూసుకోవటంలో దీదీ విఫలమయ్యారనేది విశ్లేషకుల మాట. మమత పదిహేనేళ్ల ముఖ్యమంత్రిత్వం కూడా ఒకేలా సాగలేదని వారు గుర్తుచేస్తున్నారు. మొదటి ఐదేళ్లు.. తర్వాతి ఐదేళ్లు మరోలా.. చివరి ఐదేళ్లూ ఇంకోలా మమత వ్యవహారశైలి ఉంది. ఈ విషయం సామాన్య పౌరులకూ అనుభవంలోకి వచ్చింది. బెంగాల్ రాజకీయాల్లో ఫైటర్‌గా గుర్తింపు తెచ్చుకున్న మమత.. మొదట్లో ప్రజల కోసం పోరాడినా.. ఇప్పుడు మాత్రం మేనల్లుడి కోసం పోరాడుతున్నారనే అప్రతిష్ఠ మూటగట్టుకోవటమే ఓటమికి కారణం అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
ఐదు దశాబ్దాల రాజకీయ జీవితంలో మమత ఎప్పుడూ పోరాటాన్నే ఆయుధంగా చేసుకున్నారు. ఏ స్థాయిలో ఉన్నా.. ప్రజల పక్షాన పోరాటం ఎప్పుడూ ఆపలేదు. కార్యకర్త దగ్గర్నుంచి సీఎం అయినా.. ఆమె ఎప్పుడూ ప్రజలతో మమేకం కావటానికి సందేహించలేదు. ఏనాడూ ప్రోటోకాల్ జంఝాటంలో పడిపోలేదు. కాబట్టే మూడున్నర దశాబ్దాల లెఫ్ట్ ఏకఛత్రాధిపత్యానికి విజయవంతంగా గండి కొట్టగలిగారు.
వర్తమాన భారత రాజకీయాల్లో మమతా బెనర్జీకి ఒక ప్రత్యేకత ఉంది. రాజకీయాల్లో దూకుడుకు మమతా బెనర్జీ పెట్టింది పేరు. దీంతో ఫైర్ బ్రాండ్‌గా మమతా బెనర్జీ దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యారు. మమత పార్టీ తృణమూల్ కాంగ్రెస్ మౌలికంగా బెంగాల్‌కు మాత్రమే పరిమితం. అయినప్పటికీ మమతా బెనర్జీ మాత్రం దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యారు. పట్టుదలకు, మొండితనానికి ఆమె పెట్టింది పేరు.
మమతా బెనర్జీ రాజకీయ జీవితం 1970 దశకంలో ప్రారంభమైంది. యువజన కాంగ్రెస్‌తో ఆమె రాజకీయ జర్నీ ప్రారంభమైంది. 1984 నాటికి పశ్చిమ బెంగాల్లో వామపక్ష కూటమి మహా యోధులు ప్రముఖులుగా ఉన్న కాలంలో మమతా బెనర్జీ ఒక విద్యార్థి నాయకురాలిగా ఉన్నారు. కాంగ్రెస్ నాయకుడు సుబ్రతో ముఖర్జీ నాయకత్వంలో విద్యార్థి నాయకురాలిగా మమతా బెనర్జీ ఎదిగారు. 1984 లోక్‌సభ ఎన్నికల్లో జాదవ్‌పూర్ నియోజకవర్గం నుంచి సీపీఎం అగ్రనేత సోమ్‌నాథ్ ఛటర్జీని మమతా బెనర్జీ ఓడించారు. మమతా బెనర్జీ రాజకీయ జీవితంలో ఇదొక కీలక ఘట్టం. ఆ పరిణామంతో మమతా బెనర్జీ పేరు దేశమంతా మారుమోగింది. ఆ తరువాత మమత బెంగాల్ కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఎదిగారు.
దాదాపు 26 సంవత్సరాల పాటు హస్తం పార్టీలో మమత కొనసాగారు. అయితే కాంగ్రెస్ అధినాయకత్వంతో వచ్చిన విభేదాల కారణంగా కాంగ్రెస్ పార్టీకి 1998లో మమతా బెనర్జీ గుడ్‌బై కొట్టారు. ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ పేరుతో ప్రాంతీయ పార్టీ ఏర్పాటు చేసుకున్నారు. తృణమూల్ కాంగ్రెస్ ఏర్పాటుతో బెంగాల్లో కాంగ్రెస్ పార్టీ ఉనికే ప్రశ్నార్థకంగా మారింది. అటు వామపక్షాలతోనూ ఇటు కాంగ్రెస్ పార్టీతోనూ అలుపెరుగని పోరాటం చేస్తూ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్‌ను బలీయమైన శక్తిగా రూపొందించారు మమత.
తృణమూల్ కాంగ్రెస్ బలపడటంతో బెంగాల్లో కీలక నేతగా ఎదిగారు మమతా బెనర్జీ. ఈ నేపథ్యంలో 2011లో జరిగిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ విజయం సాధించింది. ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ సంపాదించింది. దీంతో 2011 మే 20న తొలిసారి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా మమతా బెనర్జీ ప్రమాణస్వీకారం చేశారు. పశ్చిమ బెంగాల్ తొలి మహిళా ముఖ్యమంత్రిగా కూడా మమత రికార్డు సృష్టించారు.
ఆ తరువాత 2016 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా టీఎంసీ విజయం సాధించింది. దీంతో మమతా బెనర్జీ రెండో సారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఇక 2021లో జరిగిన బెంగాల్ శాసనసభ ఎన్నికలు కీలకంగా మారాయి. ఎటువంటి పరిస్థితుల్లోనూ తృణమూల్ కాంగ్రెస్‌ను అధికారంలోకి రానివ్వకుండా చేయడానికి భారతీయ జనతా పార్టీ తీవ్ర ప్రయత్నాలు చేసింది. అయితే మమతా బెనర్జీ వ్యూహాత్మకంగా బెంగాల్ ఐడెంటిటీని తట్టిలేపారు. దీంతో 2021 అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ మూడోసారి అధికారంలోకి వచ్చింది.
మమత రాజకీయ ప్రస్థానంలో మరో ప్రత్యేకత ఉంది. ఆమె ఒక్కసారి పోరాట పంథా ఎంచుకున్నాక.. జయాపజయాల గురించి ఎప్పుడూ ఆలోచించలేదు. ఓడిపోతే ఎలాగనే భయం మమతకు ఎప్పుడూ లేదు. ఆ భయం లేని తీరు కారణంగానే.. లెఫ్ట్‌ను గద్దె దించటం సాధ్యం కాదని జాతీయ పార్టీ కాంగ్రెస్ కాడి కింద పారేసినా.. తాను ఒంటరి పోరాటంతో బెంగాల్లో కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టగలిగారు. లెఫ్ట్ సర్కారుపై పోరాటం పేరుతో పారిశ్రామికవేత్తల్ని బెదరగొట్టారని, బెంగాల్‌కు పరిశ్రమలు రాకుండా చేశారనే విమర్శలు వచ్చినా.. దీదీ ఎక్కడా వెనక్కితగ్గలేదు. చివరకు సీఎం అయ్యాక కూడా.. ప్రతిపక్షాలు నిరసనలు తెలపటానికి ప్రయత్నిస్తే.. తనకు కొత్తగా పదవి వచ్చిందేమో కానీ.. పోరాటం విషయంలో తగ్గేదిలేదని తేల్చిచెప్పారు.
కేవలం రాజకీయ ప్రత్యర్థులతో మాత్రమే కాదు.. అవసరమైతే మిత్రులతోనూ పోరాటం చేయటమే మమత ప్రత్యేకత. చివరకు కేంద్రమంత్రిగా ఉన్నా.. ప్రధానులతో కొట్లాడటానికి దీదీ ఎప్పుడూ సందేహించలేదు. పార్లమెంట్ సమావేశాల సందర్భంగా కూడా ఏ పార్టీ సామాన్యులకు సంబంధించిన అంశాలు లేవనెత్తినా.. ఆ వాదనకు మద్దతు పలకటానికి ఆమె ఎప్పుడూ సందేహించలేదు. మమత బెంగాల్ రాజకీయాలపైనే ఫోకస్ పెట్టి.. మిగతా దేశానికి సింప్లిసిటీగా ఉన్న నేతగా పరిచయమైనంత కాలం ఆమె ఉద్దేశాలను, ఆలోచనలు శంకించటానికి ప్రత్యర్థులకూ ధైర్యం సరిపోలేదు. కానీ ఎప్పుడైతే మమతకు జాతీయ రాజకీయాలపై గాలి మళ్లిందో.. అప్పట్నుంచే ఆమెపై ప్రజాభిప్రాయంలోనూ కొద్దికొద్దిగా మార్పు వచ్చింది. రాజకీయ వర్గాల్లోనూ ఫైటర్ మమత వెనక్కివెళ్లి.. జాదూ దీదీ తెరముందుకొచ్చారు.
అంతకుముందు బెంగాల్‌లో తిరుగులేని నేతగా ఉండి.. అవసరమైనప్పుడు ఢిల్లీ వెళ్తూ.. వస్తూ ఉన్న మమత.. కొంతకాలంగా బీజేపీని నేరుగా ఢీకొడుతూ.. కాంగ్రెస్ స్థానాన్ని కైవసం చేసుకునే ప్రయత్నం కూడా చేశారు. చివరకు ఇండి కూటమికి నేతృత్వం విషయంలోనూ హస్తం పార్టీకి మొదటి ధిక్కారం దీదీ నుంచే ఎదురైంది. ఇలా తన రాజకీయ ఆకాంక్షల్ని విస్తరిస్తూ పోయిన మమత.. ఆ క్రమంల తన బెంగాల్ కూతురు ఇమేజ్ సంగతేంటా అనే సంగతి ఆలోచించలేదు. అలాగే 2021 ఎన్నికల్లో బెంగాల్ కూతురినని ప్రొజెక్ట్ చేసుకున్న మమత.. ఈసారి ఎన్నికల్లో గెలిస్తే.. ఢిల్లీ సంగతి చూస్తామనడం కూడా.. ఆమెపై కొత్త సందేహాలకు తావిచ్చింది. అప్పటిదాకా మమత మా సొంతం అనుకున్న బెంగాలీలు.. ఈమెను గెలిపించినా ఇక్కడ ఉండరు.. ఢిల్లీ వెళ్తారని ఫిక్సైనట్టు కనిపిస్తోంది. అలాంటప్పుడు ఇక బెంగాల్ కూతురు, బయటి వ్యక్తుల మధ్య పోరు అనే వాదనకు కాలం చెల్లింది.
ఇక పార్టీని నడిపే విధానంలో కూడా మమత నియంతలా వ్యవహరించారనే విమర్శలున్నాయి. సీనియర్ల మాటకూ విలువ ఇవ్వకుండా.. అన్నీ తానై వ్యవహరించే విధానం మొదట్లో సత్ఫలితాలిచ్చినా.. తర్వాత తర్వాత తేడా వచ్చింది. చివరకు తన వైఖరిపై అసంతృప్తితో సీనియర్లు బీజేపీ పంచన చేరాక కూడా.. దీదీ తీరు మారకపోవటం కూడా తృణమూల్ పుట్టి ముంచిందనే విశ్లేషణలున్నాయి. క్రమంగా మమత కూడా లెఫ్ట్ ఫ్రంట్ సర్కారు అవలక్షణాల్నే అందిపుచ్చుకుంటున్నారనే ప్రచారం మొదలైంది. మరో ఛాన్స్ ఇస్తే కచ్చితంగా అంతకుమించిన నియంతగా చక్రం తిప్పుతారనే భయాలను సృష్టించడంలో ప్రత్యర్థులు పైచేయి సాధించారు. వారికి అలాంటి అవకాశం ఇచ్చిన మమత.. చేజేతులా ఓటమి కొనితెచ్చుకున్నారు.
గత ఎన్నికల్లో ఓటమి పాలైన బీజేపీ మరింత కసితో ఈసారి పనిచేస్తుందని మమతకు ముందే తెలుసు. కానీ ఆమె అందుకు తగ్గ అప్రమత్తతో వ్యవహరించారా.. అంటే లేదనే చెప్పాలి. దానికి బెంగాల్లో తాను సాధించిన అసాధారణ రాజకీయ విజయాలే కారణం అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. గండర గండళ్లుగా పేరున్న లెఫ్ట్ ఫ్రంట్ నేతలకే ఒంటరిగా షాకిచ్చిన దీదీని సవాల్ చేసేదెవరనే అతిశయం.. మమతలో అతిశయించిందనే చర్చ కూడా జరుగుతోంది. సుదీర్ఘకాలం అధికారం, వరుస విజయాలు ఏ నేతలో అయినా అతివిశ్వాసం పెంచడం సహజం. కానీ పోరాటయోధురాలిగా, సామాన్యుల నేతగా పేరున్న దీదీ కూడా అదే ఉచ్చులో పడతారని ఊహించని ఆమె మద్దతుదారుల్ని మమత తీవ్రంగా నిరాశపరిచారు.
కేవలం ఒక్క ఓటమితో మమతను తక్కువగా అంచనా వేయలేం. ఆమె ఎన్నికల అంచనాలు తప్పై ఉండొచ్చు. కానీ బెంగాలీల మనోభావాలు, బెంగాల్ రాజకీయాలపై దీదీకి ఉన్న పట్టును ఎవరూ చిన్నచూపు చూసే అవకాశం లేదు. మమత ఎప్పుడూ ఫైటరే. పరాజయాన్ని అంత తేలికగా ఒప్పుకునే రకం కాదు. కచ్చితంగా ఐదేళ్ల తర్వాత జరిగే ఎన్నికల్లో పడి లేచిన కెరటంలా రావాలనే ప్రయత్నం చేస్తారు. కాకపోతే టీఎంసీని పట్టి పీడిస్తున్న అంతర్గత జాడ్యాలను మమత ఏమాత్రం వెళ్లగొట్టగలరనేదే.. ఆమె రాజకీయ భవిష్యత్తుతో పాటు తృణమూల్ అస్తిత్వానికి కీలకం కానుంది.
బెంగాల్లో మమతా బెనర్జీ ఓడిపోయి ఉండొచ్చు. కానీ పదిహేనేళ్ల సుదీర్ఘ పాలన తర్వాత వచ్చిన ఓటమిని పూర్తిగా వైఫల్యంగా చూసే పరిస్థితి లేదు. ఇప్పడు కూడా దీదీని ఓడించడం ప్రత్యర్థులకు ఎంత కష్టమైందో దేశమంతా కళ్లారా చూసింది. ఏ ఎన్నికల్లో చేయని విధంగా అమిత్ షా బెంగాల్లో పోలింగ్ రోజు వార్‌రూమ్ పెట్టారు. మోడీ బెంగాల్లో విస్తృతంగా పర్యటనలు చేశారు. ఇంకా సూటిగా చెప్పాలంటే బెంగాల్ గెలుపు బీజేపీకి ఆషామాషీగా రాలేదు. దశాబ్దకాలంగా కాషాయ పార్టీ మమతను టార్గెట్ చేసి.. వ్యూహరచన చేయాల్సి వచ్చింది. ఇదంతా మమత రాజకీయ బలాన్ని చాటిచెప్పేదే అనడంలో సందేహం లేదు.
ఇప్పుడు మమత ఓడిపోయినా.. మిగతా నేతల్లా సైలంట్‌గా ఉంటారని, డిప్రెషన్‌లోకి వెళ్లిపోతారని ఎవరూ అనుకోవటం లేదు. ఎందుకంటే దీదీ నైజమేంటో అందరికీ తెలుసు. ఇప్పటికే బెంగాల్లో గెలుపు కంటే.. ఆ గెలుపు సుస్థిరం చేసుకోవటం, మమతను రాజకీయంగా లేవలేని దెబ్బకొట్టడమే.. బీజేపీ ముందున్న అసలైన సవాల్ అనే విశ్లేషణలు వస్తున్నాయి. ఎందుకంటే ఎంతకాదన్నా.. ఇప్పటికీ తృణమూల్ కు రాష్ట్రవ్యాప్తంగా క్యాడర్ బలం ఉంది. అలాగే బెంగాల్లో ప్రతి ఇంటితో కార్యకర్తలకు ముఖ పరిచయాలున్నాయి. ఇక తృణమూల్ నేతలు, మమత ఇమేజ్ సరేసరి. బెంగాల్ ఓటర్లు మమతను ఎన్నికల్లో మాత్రమే ఓడించారు. కానీ రాజకీయంగా ఆమె ప్రభావాన్ని ఎక్కడా పరిమితం చేయలేదు. ఇప్పటికీ బలమైన ప్రతిపక్షంగా సర్కారును నిలదీసే స్థాయి దీదీకి ఉంది. ఇకపై ప్రతిపక్ష నేతగా మమత వ్యవహరించే తీరు ఎలా ఉండబోతోందో అనే ఆసక్తి అందరిలో ఉంది.
మమత మరోసారి పాత ఫైటర్‌ను గుర్తుకు తెస్తూ.. వీధిపోరాటాలకు దిగుతారా.. లేదా అనేది చూడాల్సి ఉంది. బెంగాల్ రాజకీయం తృణమూల్ వర్సెస్ బీజేపీగా మారిన తరుణంలో.. ప్రభుత్వ వ్యతిరేకత పెరిగేదాకా మమత వేచిచూడకపోవచ్చనే అంచనాలున్నాయి. అవకాశాల్ని సృష్టించుకుని మరీ సర్కారును బద్నాం చేసే ప్రయత్నాలు చేయొచ్చని భావిస్తున్నారు. మొదట ఎన్నికల్లో జరిగిన తప్పులు, చేసిన పొరపాట్లపై సమీక్ష చేసుకుని.. ఆ తర్వాత మమత కార్యరంగంలోకి దిగుతారని తృణమూల్ వర్గాలు చెబుతున్నాయి. ఆ విషయంలో మమత సమర్థతపై ఎవరికీ అనుమానాల్లేవు. ఓ అనామక నేతగా బలమైన లెఫ్ట్‌కు ఎదురునిలిచన మమతకు.. రాటుదేలిన నేతగా ఇప్పుడు ప్రతిపక్ష నేతగా కదం తొక్కటం పెద్ద విషయమేం కాదు. ఇంతవరకు అంతా బాగా జరుగుతుందనుకున్నా.. తృణమూల్‌ను పట్టి పీడిస్తున్న లోపాల్ని ఆమె ఎలా అధిగమిస్తారనేదే ఆసక్తికరం.
మమత చెప్పినట్టుగా ఆమెను ఓడించడం మామూలుగా అయితే.. ప్రత్యర్థులకు కష్టమే. కానీ స్వీయ తప్పిదాలు, సొంత పార్టీ వైఫల్యాలూ కలిసొచ్చినప్పుడు.. ఆ కష్టమే తేలికవుతుందని ఇప్పటికే రుజువైంది. ఇప్పుడు మమత ఫీనిక్స్‌లా పైకి లేవాలంటే.. మొదట పార్టీని సంస్కరించాలి. నిర్మొహమాటంగా ప్రక్షాళన చేయాలి. మేనల్లుడు అభిషేక్ బెనర్జీ దూకుడుకు అడ్డుకట్ట వేయాలి. అవసరమైతే అధికారాల్లో కోత పెట్టాలి. సీనియర్లకు సముచిత గౌరవం ఇచ్చి.. అసంతృప్తి లేకుండా చూసుకోవాలి. కార్యకర్తల్లోనూ విచ్చలవిడితనానికి అడ్డుకట్ట వేసి.. గాడిలో పెట్టాలి. పదిహేనేళ్లు తిరుగులేని అధికారం ఉండటంతో.. ముందూ వెనుకా చూడకుండా రెచ్చిపోవటం, దాడులు చేయడమే పనిగా పెట్టుకున్న తృణమూల్ పార్టీ యంత్రాంగాన్ని అదుపు చేయటమే మమతకు కఠిన సవాల్ అని చెప్పక తప్పదు. మమత మొదట వీరిని సరిదిద్దకపోతే.. ఆమె తీసుకునే కార్యాచరణ విజయవంతమౌతుందని గట్టిగా చెప్పలేం. తన ఓటమికి అసలు కారణం ఏమిటో మమతకు తెలియదనుకోలేం. మరి అందుకు తగ్గట్టుగా పార్టీకి కాయకల్ప చికిత్స చేస్తారా.. లేదా అనేది చూడాల్సి ఉంది.
మమత ఇప్పటికీ బెంగాల్లో తిరుగులేని నాయకురాలే. ప్రజాదరణ విషయంలోనూ ఆమే నంబర్ వన్. ఎన్నికల్లో ఓటమికి సవాలక్ష కారణాలుంటాయి. అంతమాత్రాన దీదీ రాజకీయంగా బలహీనురాలు కానే కాదు. అంతకుముందు కొన్ని రాష్ట్రాల్లో ఓటమి రుచిచూపించి ఓ పట్టాన లొంగని నేతల్ని కూడా సైలంట్ చేసినట్టుగా.. దీదీతో పనికాదని బీజేపీకీ తెలుసు. ఏతావాతా మమతకు పూర్వవైభవం రావాలంటే.. ఆమె మూడు సూత్రాల్ని ఫాలో కావాల్సి ఉంది. మొదటిగా ప్రజల్లో తన పాలనపై ఎందుకు విముఖత వచ్చిందో నిష్పక్షపాతంగా అధ్యయనం చేసి.. తగ్గ చర్యలు తీసుకోవాలి. రెండోది.. పార్టీని పూర్తిగా ప్రక్షాళన చేసి.. మొత్తం యంత్రాంగాన్ని పునర్వ్యవస్థీకరించాలి. ఇక చివరిగా కొత్తగా వచ్చిపడ్డ కుటుంబ అవినీతి ముద్రను వీలైనంత త్వరగా చెరిపేసుకోవాలి. అప్పుడే మమత మళ్లీ ఫైటర్‌గా, సింప్లసిటీ ఉన్న నేతగా, అన్నింటికీ మించి బెంగాల్ కూతురిగా రాష్ట్ర ప్రజలకు దగ్గరయ్యే అవకాశం ఉంటుంది.
దేశ రాజకీయ చరిత్రలో ఓటమి పాలైనా.. మళ్లీ అంతకుమించిన బలంతో పుంజకున్న నేతలు లేకపోలేదు. వారి బాటలో తానూ నడవాలని మమత అనుకోవడంలో వింతేమీ లేదు. కాకపోతే తన ముందరి కాళ్లకు బంధాలు పడకుండా చూసుకోవడం.. భవిష్యత్ కార్యాచరణ దారిలో ఉన్న ఆటంకాల్ని ఒడుపుగా తొలగించటమే దీదీ చేయాల్సిన పని. అలా చేస్తే కచ్చితంగా వచ్చే ఎన్నికల నాటికి మళ్లీ బలమైన నేతగా బరిలో ఉండే మమతను చూస్తామని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మరి దీదీ తప్పులు దిద్దుకుని.. ఫీనిక్స్‌లా తిరిగొస్తారా.. లేదంటే మరింతగా పతనమై అభిమానుల్ని నిరాశపరుస్తారా అనేది చూడాల్సి ఉంది.