July 15, 2026

Stock Market Crash: గల్ఫ్ ‘టెన్షన్’.. మార్కెట్ ‘డిప్రెషన్’.. భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్.. 500 పాయింట్లు పడిపోయిన సెన్సెక్స్!

Stock Market Crash: గల్ఫ్ ‘టెన్షన్’.. మార్కెట్ ‘డిప్రెషన్’.. భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్.. 500 పాయింట్లు పడిపోయిన సెన్సెక్స్!
Reading Time: < 1 minute
Sensex Nifty Plunge Us Iran Tension Crude Oil Price Hike May 2026

Stock Market Crash: అంతర్జాతీయంగా నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతలు భారత స్టాక్ మార్కెట్‌ను కుదిపేస్తున్నాయి. సోమవారం ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల జోష్‌తో రాకెట్ వేగంతో దూసుకెళ్లిన సూచీలు, మంగళవారం ట్రేడింగ్ స్టార్టింగ్‌లోనే కుప్పకూలాయి. అమెరికా-ఇరాన్ మధ్య తలెత్తిన ఘర్షణ వాతావరణం ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీసింది.

మంగళవారం ఉదయం బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ సెన్సెక్స్ 500 పాయింట్లు పడిపోయింది. సోమవారం క్లోజింగ్ 77,269తో పోలిస్తే, ఈ రోజు 77,103 వద్ద స్టార్ట్ అయ్యి, కొద్దిసేపటికే 76,745 స్థాయికి పడిపోయింది. అటు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ నిఫ్టీ కూడా 24,052 వద్ద ప్రారంభమై, అమ్మకాల ఒత్తిడితో 24,000 మార్కు దిగువకు చేరింది.

మార్కెట్ పతనానికి ప్రధాన కారణాలు ఇవే..
అమెరికా యుద్ధనౌకపై క్షిపణి దాడి చేశామని ఇరాన్ ప్రకటించడం, తన చమురు ట్యాంకర్‌పై ఇరాన్ డ్రోన్ దాడి చేసిందని యూఏఈ ఆరోపించడంతో గల్ఫ్ రీజియన్‌లో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. యుద్ధ భయంతో అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు $114కి చేరుకుంది. ఇది ప్రపంచ వ్యాప్తంగా ద్రవ్యోల్బణ భయాలను పెంచింది. అమెరికా – ఇరాన్ ఉద్రిక్తతలపై డోనాల్డ్ ట్రంప్ స్పందన ఎలా ఉంటుందోనన్న ఆందోళన ఇన్వెస్టర్లలో నెలకొంది.

అతిపెద్ద నష్టాలను చవిచూసిన స్టాక్‌లు..
స్టాక్ మార్కెట్ పతనం మధ్య అతిపెద్ద నష్టాలను చవిచూసిన స్టాక్‌ల విషయానికి వస్తే.. బీఎస్ఈ లార్జ్‌క్యాప్ కంపెనీలలో, బజాజ్ ఫైనాన్స్ షేర్ 1.50% క్షీణతతో, బజాజ్ ఫిన్‌సర్వ్ షేర్ 1.30% క్షీణతతో, ఎల్టీ షేర్ 1.25% క్షీణతతో ట్రేడ్ అవుతున్నాయి. ఇవి కాకుండా మిడ్‌క్యాప్ కంపెనీలలో, వోల్టాస్ షేర్ (3%), ముతూట్ ఫైనాన్స్ షేర్ (2.60%), గోద్రేజ్ ప్రాపర్టీస్ షేర్ (2.45%), జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్ షేర్ (2.20%) లాస్‌లో ట్రేడ్ అవుతున్నాయి. స్మాల్‌క్యాప్ కేటగిరీలోని కంపెనీలను పరిశీలిస్తే.. సింగ్నే షేర్ (3%), మణప్పురం షేర్ (2.50%), ఏఐఐఎల్ షేర్ (1.92%) నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. సోమవారం నాటి భారీ లాభాలు ఒక్కపూటలో ఆవిరి కావడంతో ఇన్వెస్టర్లు ఆందోళన చెందుతున్నారు. యుద్ధ ఉద్రిక్తతలు ఇలాగే కొనసాగితే మార్కెట్ మరిన్ని కనిష్ట స్థాయిలను తాకే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. మంగళవారం మధ్యాహ్నం అమెరికా రక్షణ వర్గాల నుంచి రాబోయే ప్రకటన మార్కెట్ దిశను నిర్ణయించనుందని సమాచారం.