
ఇంద్రావతి చౌహాన్ ఒక భారతీయ నేపథ్య గాయని. ముఖ్యంగా తెలుగు సినీ పరిశ్రమలో మాస్, ఫోక్ స్టైల్ పాటలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఆమె 2021లో విడుదలైన పుష్ప: ది రైజ్ చిత్రంలో వచ్చిన బ్లాక్‌బస్టర్ ఐటమ్ సాంగ్ ‘ఊ అంటావా మావా.. ఊఊ అంటావా మావా’ ద్వారా దేశవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించింది. ఈ పాటకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించగా, చంద్రబోస్ సాహిత్యం రాశారు. సమంత చేసిన ఐటమ్ సాంగ్ కావడం, అల్లు అర్జున్ సినిమాలో భాగం కావడం వల్ల ఈ పాటకు భారీ క్రేజ్ వచ్చింది.
ఇంద్రావతి చౌహాన్ 1996 మార్చి 5న ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా, గుత్తి మండలం బసినేపల్లె తాండలో జన్మించింది. ఆమె తల్లిదండ్రులు బల్లు నాయక్, లక్ష్మీదేవి. వీరికి మంగ్లీ, ఇంద్రావతి, వెంకటలక్ష్మి, శివ చౌహాన్ అనే నలుగురు సంతానం. ప్రముఖ సింగర్ మంగ్లీకి ఇంద్రావతి ఓన్ సిస్టర్ అనమాట. ఆమె బంజారా (లంబాడీ) కమ్యూనిటీకి చెందినది. ఆమె మాతృభాష గోర్ బోలి (లంబాడీ), దీనికి లిపి లేకపోవడం ప్రత్యేకత. పాఠశాల విద్యను భారతీయ విద్యాభవన్ పబ్లిక్ స్కూల్‌లో పూర్తి చేసి, అనంతరం శ్రీ వెంకటేశ్వర కళాశాలలో డిప్లొమా చదివింది.
ఇంద్రావతి చిన్నప్పటి నుంచే జానపద సంగీతంపై ఆసక్తి పెంచుకుంది. ఆమె ఒక ఫోక్ సింగర్ మాత్రమే కాకుండా మంచి నర్తకి కూడా. ‘బోల్ బేబీ బోల్’ రియాలిటీ షోలో పాల్గొని తన ప్రతిభను నిరూపించుకుంది. అలాగే జార్జిరెడ్డి సినిమాలో ‘జాజిమొగులాలి’ పాట పాడి గుర్తింపు పొందింది. 2022లో ప్రముఖ డిజిటల్ మీడియా గ్రూప్ నిర్వహించిన ఈవెంట్‌లో ‘పుష్ప’ సినిమాలోని పాటకు గాను బెస్ట్ సింగర్ అవార్డు అందుకుంది.
సోషల్ మీడియాలో కూడా ఇంద్రావతి చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో లక్షలాది మంది ఫాలోవర్లు ఉన్నారు. ఇంద్రావతి చౌహాన్‌కు ప్రత్యేకంగా క్లాసికల్ ట్రైనింగ్ కంటే, జానపద సంప్రదాయాల మధ్య పెరిగి సహజంగా వచ్చిన గాత్రమే ఆమె ప్రత్యేకత. అదే ఆమె వాయిస్‌కు మాస్ అప్పీల్ తీసుకొచ్చింది. తక్కువ పాటలే పాడినా, ప్రతి పాటతో ప్రత్యేక ముద్ర వేసిన గాయని ఇంద్రావతి.