Reading Time: < 1 minute
Ragi Sweet Roti Recipe For Hair Growth Anemia

Ragi Sweet Roti: ఉరుకుల పరుగుల జీవితంలో సరైన పోషకాహారం లేక చాలామంది జుట్టు రాలడం, రక్తహీనత, నీరసం వంటి అనేక సమస్యలతో బాధపడుతున్నారు. ఇలాంటి వారికి మన బామ్మల కాలం నాటి ‘రాగి తీపి రొట్టెలు’ ఒక దివ్యౌషధంలా పనిచేస్తాయి. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం అందించే ఈ సంప్రదాయ వంటకాన్ని సింపుల్‌గా ఎలా తయారు చేయాలో, దీని వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

రాగి తీపి రొట్టెలకు కావాల్సిన పదార్థాలు:

రాగి పిండి: 2 కప్పులు

బెల్లం తురుము: 1 కప్పు (తీపికి సరిపడా)

నీళ్లు: తగినంత

కొబ్బరి తురుము: అర కప్పు (రుచి కోసం)

యాలకుల పొడి: కొద్దిగా

నెయ్యి: కాల్చడానికి తగినంత

తయారీ విధానం..
మొదట ఒక పాత్రలో బెల్లం తురుము తీసుకుని, అందులో కొద్దిగా నీళ్లు పోసి స్టవ్ మీద పెట్టి కరిగించాలి. పాకం రానవసరం లేదు, బెల్లం కరిగితే సరిపోతుంది. కరిగిన బెల్లం నీటిని వడకట్టి, అందులో రాగి పిండి, కొబ్బరి తురుము, యాలకుల పొడి వేసి బాగా కలపాలి. పిండి మరీ గట్టిగా కాకుండా, చేత్తో రొట్టెలా ఒత్తుకోవడానికి వీలుగా ఉండాలి. ఒక అరటి ఆకు లేదా ప్లాస్టిక్ పేపర్ మీద కొంచెం నెయ్యి రాసి, చిన్న పిండి ముద్దను తీసుకుని పల్చగా రొట్టెలా వత్తాలి. పెనం వేడి అయ్యాక, నెయ్యి వేసి ఈ రొట్టెను రెండు వైపులా ఎర్రగా కాలే వరకు కాల్చుకోవాలి. అంతే సింపుల్ ఈ రొట్టెలు రెడీ అయిపోయాయి.

రాగి రొట్టె ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..
రాగుల్లో – బెల్లంలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తంలో హీమోగ్లోబిన్ శాతాన్ని పెంచి రక్తహీనతను తగ్గిస్తుంది. ఇందులోని పోషకాలు కుదుళ్లను బలోపేతం చేసి, జుట్టు రాలడాన్ని అరికడతాయి. రాగుల్లో క్యాల్షియం అధికంగా ఉండటం వల్ల ఎముకలు దృఢంగా మారుతాయి. దీనిలో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. ప్రతిరోజూ ఉదయం టిఫిన్ రూపంలో లేదా సాయంత్రం స్నాక్‌లా ఈ రాగి తీపి రొట్టెలను తీసుకుంటే మీ ఆరోగ్యంలో అద్భుతమైన మార్పును గమనించవచ్చు. పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ నచ్చే ఈ హెల్తీ రెసిపీని మీరు కూడా ఇంట్లో సమయం ఉన్నప్పుడు తప్పకుండా ప్రయత్నించండి.