Reading Time: 2 minutes

గుడ్ న్యూస్.. ఇక నేరుగా రైతు నుంచే సేంద్రీయ ఉత్పత్తులు కొనొచ్చు..మే 4 న TG ఆర్గానిక్స్ యాప్ ప్రారంభం

Caption of Image.

తెలంగాణ వ్యవసాయ రంగంలో మరో చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. సేంద్రీయ సాగు చేస్తున్న రైతులకు అండగా నిలిచేందుకు, వినియోగదారులకు నాణ్యమైన ఉత్పత్తులను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. మే 4వ తేదీన సేంద్రీయ ఉత్పత్తుల క్రయ విక్రయాల కోసం రూపొందించిన ప్రత్యేక మొబైల్ యాప్ TG ఆర్గానిక్స్ ను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు  ప్రారంభించనున్నారు. 

అసలు సేంద్రీయ వ్యవసాయం అంటే ?

రసాయన ఎరువులు, పురుగు మందులు, జన్యుమార్పిడి పంటలకు స్వస్తి పలికి.. సహజ వనరులు, సేంద్రీయ ఎరువులతో పంటలు పండించడమే సేంద్రీయ వ్యవసాయం. నేటి ఆధునిక కాలంలో అధిక దిగుబడుల కోసం రసాయనాలను విచ్చలవిడిగా వాడుతున్నారు. దీనివల్ల రైతులకు పెట్టుబడి ఖర్చులు పెరగడమే కాకుండా, మనం తినే ఆహారం విషతుల్యమవుతోంది. వాతావరణం కూడా దెబ్బతింటోంది. ఈ పరిస్థితుల్లో ప్రపంచవ్యాప్తంగా సేంద్రీయ ఉత్పత్తులకు గిరాకీ పెరిగింది.

రైతులకు నమ్మకం – వినియోగదారులకు భరోసా

చాలామంది రైతులు ఆసక్తితో సేంద్రీయ సాగు వైపు మొగ్గుచూపుతున్నప్పటికీ.. మార్కెట్‌లో సరైన గుర్తింపు, నాణ్యతా ప్రమాణాలు లేకపోవడం వల్ల వినియోగదారుల్లో నమ్మకం కలగడం లేదు. ఈ సమస్యను అధిగమించేందుకే ప్రభుత్వం TG ఆర్గానిక్స్ యాప్‌ను తీసుకువస్తోంది. దీని ద్వారా రైతులు పండించిన పంటకు సరైన ధర, వినియోగదారులకు కల్తీలేని ఆహారం లభించనున్నాయి. తెలంగాణ సేంద్రీయ సాగులో ఈ యాప్ ఒక నూతన విప్లవానికి నాంది కానుంది.

యాప్ ద్వారా ఎలా కొనాలి.? 

  • కస్టమర్లు ఎవరైనా ప్లే స్టోర్ నుంచి TG ఆర్గానిక్స్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
  • ఆ తరువాత, OTP ద్వారా లాగ్ ఇన్ అవ్వాలి.
  • మొదటగా తమకు కావలసిన పంటల గ్రూపును, పంట ఉత్పత్తులను సెలెక్ట్ చేసుకోవాలి.
  • ఆ తరువాత వచ్చే రైతుల వివరాల ద్వారా నేరుగా వారిని సంప్రదించి ఉత్పత్తులు కొనుగోలు చేసుకోవచ్చు.
  • ఇందులో తమకు 50 కిలోమీటర్ల పరిదిలో ఉండే రైతుల వివరాలు మొదటగా వస్తాయి, ఒకవేళ పరిధిని తగ్గించుకోవటం, పెంచుకోవటం చేసుకోవచ్చు 

 యాప్ ప్రత్యేకతలు:

ప్రస్తుతం దాదాపు 500 మంది రైతులు యాప్ లో ఉన్నారు (ఈ సంఖ్య మున్ముందు పెరుగును).  తెలంగాణలో సేంద్రీయ దృవీకరణ సేవలు ఇస్తున్న ఇతర రీజినల్ కౌన్సిల్స్ (RCs) అయిన ఏకలవ్య ఫౌండేషన్, సెంటర్ ఫర్ సస్టెయినబుల్ అగ్రికల్చర్ (CSA) తో ఇతర RC లకు చెందిన ఆర్గానిక్ రైతుల వివారాలు కూడా ఈ యాప్ లో పొందుపరచడం జరుగుతుంది. 

సుమారు 100 కు పైగా ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ఈ యాప్ లో కస్టమర్లకు అందుబాటులో ఉంచడం జరిగింది .రైతు మొబైల్ నంబర్, చిరునామా, లొకేషన్ వివరాలు పొందవచ్చు  .రైతు వద్ద అందుబాటులో ఉన్న దృవీకృంచిన వివిధ ఆర్గానిక్ ఉత్పత్తులు అందుబాటులో ఉంటాయి.తెలంగాణ రాష్ట్ర విత్తన & సేంద్రీయ దృవీకరణ అథారిటీ ద్వారా సేంద్రీయ దృవీకరణ సర్టికెట్లు పొందిన రైతుల వివరాలు మాత్రమే యాప్ లో ఉంటాయి . 

చివరగా ఈ యాప్ ద్వారా కేవలం ఆర్గానిక్ రైతు వివరాలు,  మరియు అతన వద్ద అందుబాటులో ఉండే ప్రొడక్ట్స్ వివరాలు మాత్రం ఈ యాప్ లో ఉంచడం జరిగింది. ఆర్గానిక్ ప్రొడక్ట్స్ యొక్క రేటు ను నిర్ణయించే అధికారం రైతుకు మాత్రమే ఉంటుంది. కావునా రైతును నేరుగా సంప్రదించి ధర విషయాలు చర్చించుకోవచ్చు. 
 

©️ VIL Media Pvt Ltd.