
ఈపీఎఫ్ఓ కోట్లాది మంది చందాదారులకు శుభవార్త అందించింది. ఏళ్ల తరబడి పాత అకౌంట్లలో మూలుగుతున్న మీ డబ్బును వెలికితీసేందుకు.. వాటిని ప్రస్తుత ఖాతాకు అనుసంధానం చేసేందుకు ‘ఈ-ప్రాప్తి'(E-PRAAPTI) అనే వినూత్న డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ను లాంచ్ చేస్తోంది. కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా బుధవారం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు.
ఏమిటి ఈ ‘ఈ-ప్రాప్తి’?
E-PRAAPTI (EPF Aadhaar-Based Access Portal for Tracking Inoperative Accounts). ఉద్యోగాలు మారినప్పుడు పాత కంపెనీలకు సంబంధించిన పీఎఫ్ అకౌంట్లు క్లోజ్ అవ్వకుండా, అలాగే కొత్త యూఏఎన్ నంబర్‌కు లింక్ అవ్వకుండా ఉండిపోతాయి. ఇలాంటి రన్ని్ంగ్ లో లేని ఖాతాలను గుర్తించి, ట్రాక్ చేసి, మీ ప్రస్తుత ఖాతాకు లింక్ చేయడమే పోర్టల్ ప్రధాన ప్రయోజనం.
ఎవరికి ప్రయోజనం?
చాలామందికి పాత కంపెనీల మెంబర్ ఐడీలు గుర్తుండవు లేదా ఆ ఖాతాలు ఆధార్‌తో అనుసంధానం అయి ఉండవు. దీనివల్ల ఆ డబ్బును విత్‌డ్రా చేయడం, ట్రాన్స్‌ఫర్ చేయడం అసాధ్యంగా మారుతుంది. అలాంటి వారు ఈ-ప్రాప్తి ద్వారా..పాత పీఎఫ్ ఖాతాలను సులభంగా గుర్తించవచ్చు. ఆధార్ ఆధారిత అథెంటికేషన్ ద్వారా పాత ఖాతాలను ప్రస్తుత UANకు లింక్ చేయవచ్చు. మెంబర్ ప్రొఫైల్‌ను సులభంగా అప్‌డేట్ చేసుకోవచ్చు. మ్యాన్యువల్ డాక్యుమెంటేషన్ తలనొప్పి లేకుండా పని పూర్తవుతుంది.
ఎలా ఉపయోగించుకోవాలి?
మొదటి దశలో ఈ పోర్టల్ ‘మెంబర్ ఐడీ’ ఆధారంగా పనిచేస్తుంది. పాత మెంబర్ ఐడీ ఉన్నవారు ఆధార్ ద్వారా లాగిన్ అయి తమ ఖాతాలను యాక్టివేట్ చేసుకోవచ్చు. భవిష్యత్తులో మెంబర్ ఐడీ గుర్తులేని వారు కూడా పేరు, పుట్టిన తేదీ వంటి వివరాలతో తమ ఖాతాలను సెర్చ్ చేసుకునేందుకు అవకాశం కల్పించనున్నారు.
పీఎఫ్ డబ్బు వినియోగం గత ఏడాది కంటే ఈ ఏడాది భారీగా పెరిగింది. FY26లో EPFO రికార్డు స్థాయిలో 8.31 కోట్ల క్లెయిమ్స్ సెటిల్ చేసింది. ఇందులో ఆటో-మోడ్ ద్వారా కేవలం 3 రోజుల్లోనే 71.11% క్లెయిమ్స్ పరిష్కారం అయ్యాయి. ఈ కొత్త పోర్టల్ అందుబాటులోకి వస్తే.. ఇన్-ఆపరేటివ్ ఖాతాల్లో ఉన్న వేల కోట్ల రూపాయలు తిరిగి ఉద్యోగులకు చేరే అవకాశం ఉంది. పాత పీఎఫ్ డబ్బును వదులుకోకండి ఈ-ప్రాప్తితో దాన్ని తిరిగి పొందండి మరి.