
మే నెల.. ఇంగ్లీషు సంవత్సరాల్లో ఇది ఐదవ నెల .. సూర్య భగవానుడు భగ భగ మండిపోతాడు. గాలి దుమ్ములు వచ్చే కాలం మే నెల. ఈ ఏడాది మేనెల ఆధ్యాత్మికంగా చాలా విశిష్టత ఉందని పండితులు చెబుతున్నారు. మే నెల పౌర్ణమి తిథితో ప్రారంభం కాగా మరల అదే తిథితో ముగుస్తుంది. ఇంకా ఈ ఏడాది మే నెల విశిష్టత గురించి తెలుసుకుందాం.
పురాణాల ప్రకారం వైశాఖ పౌర్ణమి చాలా విశిష్టమైనది. తెలుగు పంచాంగం ప్రకారం వైశాఖ మాసం పౌర్ణమితో ప్రారంభమైన మే మంత్ జ్యేష్ట మాసం పౌర్ణమి తిథితో ముగుస్తుంది. అంటే 2026 మే నెల స్టాటింగ్ డే.. మరియు ఎండింగ్ డే..ఈ రెండు రోజుల్లో చంద్రుడు వెన్నెల కురిపించనున్నాడు
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం 2026 మే నెలలోనే సూర్యుడు మేషరాశి నుంచి వృషభరాశిలోకిప్రవేశిస్తాడు. దీనినూ వృషభ సంక్రమణం అంటారు. పురాణాల ప్రకారం వైశాఖ పౌర్ణమి రోజు దాన ధర్మాలు.. , జ్యేష్టమాసంలో జలదానాలు అత్యంత పుణ్యఫలాన్ని ఇస్తాయి. ఇంకా ఇదే నెలలో బుద్ద జయంతి, హనుమాన్ జయంతి, శని భగవానుడి పుట్టిన రోజు వంటి పర్వదినాలు కూడా ఉన్నాయి. ఈ నెలలో అనేక శుభ ముహూర్తాలు ఉన్నాయి.
2026 మే నెల పండుగల వివరాలు
మే 1 (వైశాఖ పూర్ణిమ): దీనినే బుద్ద పూర్ణిమ అని కూడా పిలుస్తారు. వైశాఖ పూర్ణిమ రోజున శ్రీమహావిష్ణువు కూర్మావతారంలో అవతరించినట్టుగా చెబుతారు. అందుకే వైశాఖ పూర్ణిమ రోజును కూర్మజయంతిగా కూడా జరుపుకుంటారు. అంతేకాదు, మే 1 పూర్ణమి తిథి కావడంతో ఆరోజున సత్యనారాయణ స్వామి వ్రతాలను చేసుకుంటారు.
మే 12 (హనుమత్ జయంతి): హనుమంతుడికి కేటాయించిన రోజు. మే 12 వ తేదీ హనుమాన్ జయంతి కూడా రావడంతో తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ఉత్సవాలను నిర్వహిస్తారు. వైశాఖ బహుళ దశమి రోజున హనుమాన్ జయంతిని జరుపుకోబోతున్నాం. అంతేకాదు, హనుమంతుడికి అత్యంత ఇష్టమైన మంగళవారం కూడా అదే రోజు కావడం ఈ పండుగకు మరింత ప్రాశస్త్యం ఏర్పడింది.
మే 16 ( శనిజయంతి): శని భగవానుడు జన్మించిన రోజు కావడంతో ఏలినాటి శని ప్రభావం ఉన్నవారు ఆరోజున స్వామివారికి తైలాభిషేకం చేస్తారు. ఇలా శని జయంతి రోజున తైలాభిషేకం చేయడం వలన ప్రభావం 50 శాతం వరకు తగ్గుతుందని పండితులు చెబుతున్నారు.
మే 16( వట సావిత్రి వ్రతం): మహిళలు అత్యంత భక్తి శ్రద్దలతో నిర్వహిస్తారు. వట వృక్షాన్ని పూజించి ఈ వ్రతం చేయడం వలన సౌభాగ్యం సిద్ధిస్తుందని నమ్మకం.
మే 25( గంగా దసరా పండుగ) : పవిత్రమైన గంగానది భూమికి దిగివచ్చిన రోజు గంగా దసరా. ఆధ్యాత్మిక శుద్ది, దానధర్మాలు, ఆశీర్వాదాలను కొనుకోవడానికి ఈరోజు అత్యంత పవిత్రమైనదిగా చెబుతారు.
మే 26 : యమునా నది పుష్కరాలు ప్రారంభం
మే 28( నిర్జల ఏకాదశి) : ఏడాదిలో వచ్చే 24 ఏకాదశుల్లో ఈ నిర్జల ఏకాదశి అత్యంత కఠినమైనదిగా చెబుతారు. ఈ నిర్జల ఏకాదశి రోజున చుక్కనీరు కూడా ముట్టుకోకుండా ఉపవాసం చేయాలి. ఇలా చేయడం వలన సకల పాపాలు తొలగిపోతాయిని చెబుతారు.
మే 31(ఏరువాక పౌర్ణమి): ఈరోజున రైతులు నాగలిపట్టి పొలాన్ని దున్నే శుభ సమయం. ప్రకృతిని ఆరాధించే గొప్ప పండుగల్లో ఏరువాక పౌర్ణమి ఒకటి. పొలం దున్నిన రోజు నుంచి రైతుల పొలం పనులు ప్రారంభమౌతాయి. అంటే వైశాఖ పౌర్ణమి తిథితో ప్రారంభమైన 2026 మే నెల జ్యేష్ట పౌర్ణమితో ముగుస్తుంది.
మొత్తంగా చెప్పాలంటే మే నెలలో ప్రతి ఒక్కరూ కనీసం ఐదు రోజులు ఉపవాసం, జపం, దానం చేయడం ద్వారా జీవితంలో శాంతిని, సుఖాన్ని పొందవచ్చు. ఈ మే నెలలో భక్తితో చేసిన ప్రతి పని మహాపుణ్య ఫలాన్ని ఇస్తుంది. ఆధ్యాత్మికతను ఆచరిస్తే జీవితం సార్థకమౌతుందని పండితులు చెబుతున్నారు.