
నటుడిగా మంచి గుర్తింపు సంపాదించిన ధనుష్ నటించిన దాదాపు అన్ని తమిళ సినిమాలు తెలుగులో కూడా డబ్బింగ్ అయ్యే రిలీజ్ అవుతూ ఉంటాయి. ఈ క్రమంలోనే ఆయన హీరోగా నటించిన ‘కర’ అనే సినిమా తాజాగా తమిళం సహా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మమిత బైజు హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో కేఎస్ రవికుమార్, జయరాం, కరుణాస్, సూరజ్ వంటి వారు ఇతర కీలక పాత్రలలో నటించారు. గతంలో ‘పోర్ తోజిల్’ లాంటి థ్రిల్లర్ డైరెక్ట్ చేసి హిట్ అందుకున్న విగ్నేష్ రాజా డైరెక్షన్‌లో ఈ సినిమాని ఇషారి గణేష్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. అయితే ఈ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది? అనేది ఇప్పుడు కర రివ్యూలో చూద్దాం.
కర కథ:
కరస్వామి అలియాస్ కర (ధనుష్) ఒక దొంగ. తన తండ్రి కోదండం (కేఎస్ రవికుమార్) దగ్గర కూడా డబ్బు దొంగిలించి ఇంట్లోంచి పారిపోయి, ఎన్నో ఇళ్లలో దొంగతనాలు చేస్తూ ఉంటాడు. అయితే అనుకోకుండా ఒకసారి పోలీసులకి చిక్కి, డిఎస్పి భరతన్ (సూరజ్) చేతిలో నుంచి తప్పించుకు వెళ్లి, ఇక దొంగతనాలు చేయనని భావించి మల్లి (మమిత బైజు)ని పెళ్లి చేసుకుంటాడు. ఒక హోటల్‌లో పనిచేస్తూ ఉండే అతను దుర్భర జీవితం గడపలేక, తానే ఒక హోటల్ తెరవాలని భావించి తండ్రి సహాయం కోసం ఇంటికి వస్తాడు. అయితే తండ్రి అప్పటికే అప్పుల్లో కూరుకుపోయి, మనోవేదనతో మరణిస్తాడు. తన తండ్రి చివరి కోరికగా అడిగిన తమ సొంత పొలంలో దహన సంస్కారాలు చేయాలనే ఉద్దేశంతో ఆ ప్రయత్నాలు చేస్తూ ఉండగా, జప్తు కారణంగా బ్యాంకు అధికారులు ఆ కార్యక్రమాలు జరగకుండా ఆపేస్తారు. తన తండ్రి పార్థివదేహానికి గౌరవం దక్కేలా కర చేయగలిగాడా? తన తండ్రి కోరిక తీర్చగలిగాడా? చివరికి ఏమైంది? ఈ మొత్తం వ్యవహారంలో బ్యాంక్ మేనేజర్ (జయరాం) పాత్ర ఏమిటి? అనే విషయాలు తెలియాలంటే సినిమాని బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే.
విశ్లేషణ:
బ్యాంకులు, వడ్డీలు అనే అంశం మీద ఇప్పటికే రకరకాల ఫార్మాట్లలో సినిమాలు వచ్చాయి. కానీ విగ్నేష్ రాజా ఈ సినిమాని కాస్త డిఫరెంట్‌గా ప్రెజెంట్ చేయాలనుకున్నాడు. దానికి 90ల నేపథ్యం ఎంచుకుంటూ.. దొంగతనాలు మానేయాలని నిర్ణయించుకున్న ఒక దొంగ, బ్యాంకు అధికారుల కారణంగా మళ్లీ దొంగతనం ఎలా చేశాడు? ఎందుకు చేశాడు? బ్యాంకు అధికారులందరికీ ఎలా షాక్ ఇచ్చాడు? అనే ఒక ఆసక్తికరమైన కథనాన్ని రాసుకున్నాడు. ఆ కథనాన్ని రాసుకోవడమే కాదు, అంతే ఆసక్తికరంగా తెరకెక్కించాడు కూడా.
నిజానికి ఒక థ్రిల్లర్‌తో ప్రేక్షకులకు పరిచయమైన ఈ దర్శకుడు, మరోసారి కూడా అలాంటి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్న సినిమాతోనే ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. విగ్నేష్ రాసుకున్న కథ ఆసక్తికరంగా ఉంది. అయితే దాన్ని ఎగ్జిక్యూట్ చేసే విషయంలో కొన్నిసార్లు తడబడ్డాడు అనిపించినా, కొన్నిచోట్ల మాత్రం సీన్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. ఒక్కొక్క షాట్ పడుతుంటే ప్రేక్షకులు సాటిస్ఫై అయ్యేలా సీన్స్ రాసుకున్నాడు. కాకపోతే సినిమా కథ కొంచెం ప్రెడిక్టబుల్‌గా ఉండడంతో పాటు, మన నేటివిటీకి అంత దగ్గరగా లేదు. సినిమాలో కొన్ని చోట్ల లాజిక్స్ కూడా మిస్ అవుతాయి. తమిళ నేటివిటీ ఎక్కువ ఉండడం వల్ల మనకు కొంత రిలేటబుల్ అనిపించకపోయినా, బ్యాంకుల వడ్డీ వ్యవహారం మాత్రం అందరికీ కనెక్ట్ అవుతుంది.
గతంలో ఇదే లైన్‌తో వచ్చిన ‘సర్కారు వారి పాట’ వంటి సినిమాలు కూడా కొంత ఈ విధంగానే సాగుతాయి. కానీ ఈ దర్శకుడు రాసుకున్న విధానం బాగుంది కానీ, దాన్ని పూర్తి స్థాయిలో ఎగ్జిక్యూట్ చేసే విషయంలో మాత్రం అక్కడక్కడా తడబడ్డాడు. అలాగే అతని గత సినిమాతో పోలిస్తే, ఈ సినిమాలో కొన్ని సీన్లలో హ్యూమర్ ఎక్కువగా కనిపించింది. కొన్నిచోట్ల ఊపిరి బిగబట్టేలా సీన్స్ రాసుకోవడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. విలన్లను ఏదో కరుడుగట్టిన రౌడీల్లా చూపించకుండా కథలో ఇమిడిపోయేలా తీర్చిదిద్దాడు. మరో విశేషం ఏమిటంటే.. ధనుష్ లేని సీన్స్ కూడా ఆసక్తికరంగా రాసుకోవడంలో డైరెక్టర్ తన ప్రతిభ కనబరిచాడు. అలానే సినిమా చూసిన ప్రేక్షకులు క్లైమాక్స్ చూసి సాటిస్ఫై అవుతారు.
నటీనటుల పనితీరు:
కరస్వామి పాత్రలో ధనుష్ పరకాయ ప్రవేశం చేశాడు. ఆయన నటన సినిమాకు ప్రధాన బలం. తండ్రి పాత్రలో కేఎస్ రవికుమార్ నటన బాగుంది, ముఖ్యంగా ఆ మేకప్ కరెక్ట్‌గా సెట్ అయింది. విలేజ్ లుక్‌లో మమిత బైజు అంతగా సెట్ అయినట్లు అనిపించలేదు, అలాగే ఆమె స్క్రీన్ స్పేస్ కూడా చాలా తక్కువ. జయరాం, సూరజ్ వంటి వారు తమ పాత్రలలో మెరిశారు. ముఖ్యంగా కరుణాస్ సీరియస్‌గా నటిస్తూనే కామెడీ పండించడంలో సక్సెస్ అయ్యాడు.
సాంకేతిక విభాగం విషయానికి వస్తే ఈ సినిమా ప్రధాన బలం కథా రచన. సినిమాలో చిన్న చిన్న లాజిక్స్ మిస్ అయినా, సినిమా ఎంగేజింగ్‌గా సాగింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. జీవీ ప్రకాష్ కుమార్ అందించిన పాటలు వినసొంపుగా ఉన్నాయి, నేపథ్య సంగీతం కూడా కరెక్ట్‌గా సెట్ అయింది. అలాగే 90ల నాటి ప్రపంచాన్ని మళ్లీ రీ-క్రియేట్ చేసిన ఆర్ట్ వర్క్ కూడా కచ్చితంగా అభినందించాల్సిన అంశమే.
ఫైనల్ వర్డిక్ట్: ధనుష్ ‘కర’ ఒక ఎంగేజింగ్ డ్రామా!