Reading Time: 2 minutes
Hardik Pandya Emotional After Mi Loss Vs Srh Hearing Opposition Chants Hurts Ipl 2026

Hardik Pandya Said Hearing Opposition Chants in Wankhede Hurts: ఐపీఎల్ 2026లో భాగంగా బుధవారం వాంఖడే మైదానంలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ ఓడిపోయింది. జస్ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్, హార్దిక్ పాండ్య లాంటి టాప్ బౌలర్లు ఉన్నా.. 244 పరుగుల భారీ స్కోరును కూడా కాపాడుకోలేకపోయింది. ముందుగా ముంబై 5 వికెట్ల నష్టానికి 243 పరుగులు చేయగా.. సన్‌రైజర్స్‌ 18.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి భారీ లక్ష్యాన్ని ఛేదించింది. ముంబై మరో నిరాశాజనక ఫలితాన్ని ఎదుర్కొన్న తర్వాత కెప్టెన్ హార్దిక్ పాండ్యా జట్టు ప్రదర్శనపై నిరాశ వ్యక్తం చేశాడు. తాము చాలా చెత్తగా బౌలింగ్ చేశాం అని నిజాయితీగా ఒప్పుకున్నాడు. బ్యాటర్లు 243 పరుగుల భారీ స్కోర్ చేసినప్పటికీ.. బౌలర్లు దాన్ని కాపాడలేకపోయారని అంగీకరించాడు.

మ్యాచ్ అనంతరం అభిమానుల మద్దతుపై హార్దిక్ పాండ్య స్పందించాడు. ‘మేము ఐపీఎల్ 2026లో ముంబై అభిమానులను ఎంటర్‌టైన్ చేయలేకపోయాము. అయినప్పటికీ వారు ఎంతో నమ్మకంతో మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు. కొన్ని సార్లు ప్రత్యర్థి జట్టు పేరు సొంత స్టేడియంలో వినిపిస్తే చాలా బాధగా ఉంటుంది. ఆ సమయంలో ఏడుపొచ్చినంత పనవుతుంది. ముంబై అభిమానులకు మరింత వినోదం అందించి వారి ప్రేమను తిరిగి పొందాలి’ అని హార్దిక్ భావోద్వేగంగా చెప్పాడు. ఎస్‌ఆర్‌హెచ్‌ బ్యాటర్లు బ్యాటింగ్ చేస్తుంటే.. కొందరు ఫ్యాన్స్ సన్‌రైజర్స్‌.. సన్‌రైజర్స్‌ అంటూ అరిచారు. దీనిని ఉద్దేశించే హార్దిక్ స్పందించాడు.

‘ఈ మ్యాచ్‌లో మేము భారీ స్కోర్ చేసినప్పటికీ బౌలర్లు దాన్ని కాపాడలేకపోయారు. ప్రత్యర్థి ఓపెనర్లు బాగా ఆడారు. వారి ఇచ్చిన మెరుపు ఆరంభమే మ్యాచ్‌ను మా చేతుల నుంచి దూరం చేసింది. డ్యూ పెద్దగా ప్రభావం చూపలేదు. సన్‌రైజర్స్‌ బ్యాటర్లు మంచి షాట్లు ఆడారు. మేము కొన్ని చెత్త బంతులు వేసాం. దాంతో వాళ్లు మంచి ఆరంభం సాధించారు. మధ్యలో కొంతవరకు మ్యాచ్‌ను తిరిగి మా వైపు తిప్పుకున్నాం.. కానీ అది సరిపోలేదు. ఈ రోజు బ్యాటింగ్ చేయడం చాలా ఎంజాయ్ చేశాను. 244 పరుగులు చేస్తే సాధారణంగా బౌలర్లు కాపాడతారని నమ్మకం ఉంటుంది. కానీ ఈరోజు అలా జరగలేదు.నా బౌలింగ్ కూడా ఆస్వాదించా. చివరి మూడు బంతులు మినహా నా స్పెల్‌పై సంతోషంగా ఉన్నా’ అని హార్దిక్ చెప్పుకొచ్చాడు.

ఫీల్డింగ్‌లో చేజారిన అవకాశాలు కూడా ముంబై పరాజయాలకు కారణం అని హార్దిక్ పాండ్య అంగీకరించాడు. ‘ఈ సీజన్ అంతా ఇలానే సాగుతోంది. వచ్చిన అవకాశాలను వినియోగించుకుంటేనే మ్యాచ్ మోమెంటమ్ మారుతుంది. లేకపోతే దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. అయినప్పటికీ మా ఆటగాళ్లు శక్తివంచన లేకుండా ప్రయత్నించారు. ఈ సీజన్‌లో బౌలింగ్లో పెద్దగా ఆప్షన్లు లేవు. కానీ ఏం మార్చుకోవాలో చూడాలి. నెను బౌలర్లపై నిందలు వేయను. మొత్తం జట్టుగా ముంబై ఇండియన్స్ స్థాయికి తగ్గట్టు ఆడలేకపోయాం. ఎక్కడ మెరుగుపరుచుకోవాలో విశ్లేషించాలి’ అని స్పష్టం చేశాడు.