Reading Time: 2 minutes

నేటి కాలంలో మహిళలు ఇంటిని, ఆఫీసును రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ ఎంతో కష్టపడుతున్నారు. అయితే బయటికి కనిపించే పనుల కంటే, మనసులో రన్ అయ్యే “కనిపించని పనులు” (Invisible Labor) వారిని తీవ్రమైన ఒత్తిడికి గురిచేస్తున్నాయి. ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకోబోయే వరకు ప్రతి విషయాన్ని ప్లాన్ చేయడం వల్ల తెలియకుండానే మానసిక అలసట వస్తుంది. మహిళల్లో ఈ మానసిక ఒత్తిడి పెరగడానికి గల ప్రధాన 5 కారణాలను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

మెంటల్ లోడ్: కనిపించని పనుల భారం: ఇంట్లో వస్తువులు అయిపోయాయా? పిల్లల హోంవర్క్ పూర్తయిందా? రేపు వంటలోకి కూరగాయలు ఉన్నాయా? ఇలాంటి వందల ప్రశ్నలు మహిళల మెదడులో నిరంతరం తిరుగుతూనే ఉంటాయి. వీటిని ఎవరూ గుర్తించరు, కానీ వీటిని మేనేజ్ చేయడమే పెద్ద పని. దీనినే ‘మెంటల్ లోడ్’ అంటారు. ఈ నిరంతర ఆలోచనలు మహిళలను శారీరకంగా కంటే మానసికగా ఎక్కువగా అలసిపోయేలా చేస్తున్నాయి.

పర్ఫెక్ట్’గా ఉండాలనే తాపత్రయం: సమాజంలో మహిళలు అంటే ఇంటిని చక్కదిద్దాలి, పిల్లలను బాగా పెంచాలి, ఆఫీసులోనూ రాణించాలి అనే ఒక ఒత్తిడి ఉంటుంది. ప్రతి పనిలోనూ ‘పర్ఫెక్ట్’గా ఉండాలని ప్రయత్నించడం వల్ల తమ కోసం తాము సమయం కేటాయించుకోలేకపోతున్నారు. ఈ క్రమంలో చిన్న పొరపాటు జరిగినా “నేను సరిగ్గా చేయడం లేదు” అనే అపరాధ భావం (Guilt) వారిలో ఒత్తిడిని పెంచుతోంది.

Why Small Things Feel Heavy: Top 5 Stress Triggers for Women
Why Small Things Feel Heavy: Top 5 Stress Triggers for Women

మల్టీటాస్కింగ్ అనే మాయ: ఒకే సమయంలో ఫోన్ మాట్లాడుతూ వంట చేయడం, పిల్లలను చూస్తూ ఆఫీస్ మెయిల్స్ చెక్ చేయడం గొప్ప విషయంగా అనిపించవచ్చు. కానీ, నిరంతరం ఇలా మల్టీటాస్కింగ్ చేయడం వల్ల మెదడుపై తీవ్ర ప్రభావం పడుతుంది. దీనివల్ల ఏ పనిపైనా సరిగ్గా ఏకాగ్రత పెట్టలేకపోవడం, త్వరగా చిరాకు రావడం వంటి సమస్యలు ఎదురవుతాయి. ఇక ఇది దీర్ఘకాలంలో మానసిక ఆందోళనకు దారితీస్తుంది.

సొంత అవసరాలను పక్కన పెట్టడం: కుటుంబ సభ్యుల ఆరోగ్యం, వారి ఇష్టాఇష్టాల గురించి ఆలోచించే మహిళలు.. తమ సొంత ఆరోగ్యం గురించి పట్టించుకోవడం చాలా తక్కువ. సరైన నిద్ర లేకపోవడం, పోషకాహారం తీసుకోకపోవడం వల్ల హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుంది. శారీరక శక్తి తగ్గినప్పుడు చిన్న పనులు కూడా పెద్ద భారంగా అనిపిస్తాయి. ఇక తమకు నచ్చిన హాబీలను వదిలేయడం కూడా ఒక కారణం.

భావోద్వేగ మద్దతు లేకపోవడం: చాలా సందర్భాల్లో మహిళలు పడుతున్న కష్టాన్ని గుర్తించేవారు ఉండరు. “ఇంట్లో పనులే కదా, అందరూ చేసేవే కదా” అనే మాటలు వారిని మరింత కుంగదీస్తాయి. కనీసం మనసు విప్పి మాట్లాడటానికి ఎవరూ లేకపోవడం లేదా తమ బాధను చెబితే ఎదుటివారు ఏమనుకుంటారో అనే భయం ఒత్తిడిని పెంచుతాయి. ఇక కుటుంబ సభ్యుల నుండి సరైన ప్రోత్సాహం లేకపోవడం ప్రధాన కారణం.

మహిళల్లో ఒత్తిడి తగ్గాలంటే పనులను అందరూ పంచుకోవడం చాలా ముఖ్యం. మహిళలు కూడా తమపై తాము ఒత్తిడి పెంచుకోకుండా, “నేను రోబోను కాదు మనిషినే” అని గుర్తించాలి. రోజులో కొంత సమయం మీ కోసం మీరు కేటాయించుకోండి. అప్పుడే ఆరోగ్యంగా, సంతోషంగా ఉండగలరు.

గమనిక: పైన పేర్కొన్న సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. మీరు తీవ్రమైన మానసిక ఒత్తిడి లేదా ఆందోళనతో బాధపడుతుంటే, వెంటనే నిపుణులైన సైకాలజిస్టును సంప్రదించడం ఉత్తమం.

The post కనిపించని పనులే భారంగా మారుతున్నాయా?.. మహిళల్లో ఒత్తిడికి 5 కారణాలు appeared first on Manalokam – Latest Telugu News & Updates.