Reading Time: < 1 minute
K Kavitha New Political Party Launch March 27

తెలంగాణ రాజకీయ యవనికపై మరో కీలక అంకం మొదలుకాబోతోంది. కల్వకుంట్ల కవిత మార్చి 27న కొత్త రాజకీయ పార్టీని స్థాపించబోతున్నట్లు సమాచారం. శ్రీరామనవమి పర్వదినాన ఉదయం 8 గంటలకు ఆమె తన రాజకీయ భవిష్యత్తుపై కీలక ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో, కవిత తనకంటూ ఒక ప్రత్యేక రాజకీయ ముద్ర వేసుకోవాలని భావిస్తున్నారు. తెలంగాణ జాగృతి ద్వారా సాంస్కృతిక ఉద్యమాన్ని నడిపిన ఆమె, ఇప్పుడు నేరుగా కొత్త పార్టీ ద్వారా ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించుకోవడం వెనుక లోతైన రాజకీయ వ్యూహం ఉందనే చెప్పాలి.

Also Read:Sreemukhi: హైదరాబాద్‌లో సొంత రెస్టారెంట్ ఓపెన్ చేసిన శ్రీముఖి

తన మెట్టినిల్లు నుంచే పార్టీ పేరు, జెండా, గుర్తు , విధివిధానాలను ప్రకటించనున్నట్లు సమాచారం. ఇది మహిళా ఓటర్లను.. స్థానిక సెంటిమెంటును ఆకట్టుకునే ప్రయత్నంగా భావించవచ్చు. మార్చి 27న ఆమె తాను పోటీ చేసే నియోజకవర్గాన్ని కూడా ప్రకటించనుండటంతో, ప్రధాన రాజకీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్‌లల్లో అలజడి మొదలైంది. తెలంగాణ సమాజంలో తనదైన శైలిలో గుర్తింపు తెచ్చుకున్న కవిత, ఈ కొత్త రాజకీయ ప్రయాణంలో ఎలాంటి సవాళ్లను ఎదుర్కోబోతున్నారో చూడాలి. ముఖ్యంగా తెలంగాణ సెంటిమెంట్ , అభివృద్ధి అంశాలను ఆమె కొత్త పార్టీ ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్తుందనేది ఆసక్తికరంగా మారింది.