July 15, 2026

RCB Sale Price: ఐపీఎల్ చరిత్రలో మరో సంచలన డీల్.. ఆర్‌సీబీ కొత్త ఓనర్స్ ఎవరంటే?

RCB Sale Price: ఐపీఎల్ చరిత్రలో మరో సంచలన డీల్.. ఆర్‌సీబీ కొత్త ఓనర్స్ ఎవరంటే?
Reading Time: 2 minutes
Rcb New Owners Royal Challengers Bengaluru Sold For Rs 16706 Crore In Record Ipl Deal

RCB Sold for RS 16706 Crore in Record IPL Deal: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చరిత్రలో మరో సంచలన డీల్ నమోదైంది. లీగ్‌లో అత్యంత ఆకర్షణీయ జట్లలో ఒకటైన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) ఫ్రాంచైజీ రికార్డు స్థాయిలో రూ.16,706 కోట్ల (సుమారు $1.78 బిలియన్)కు విక్రయించబడింది. ఈ భారీ డీల్‌తో ఐపీఎల్‌లో జట్ల విలువలు మరో స్థాయికి చేరుకున్నాయి. ఇప్పటివరకు డియాజియో ఆధీనంలో ఉన్న ఆర్‌సీబీ.. ఇప్పుడు కొత్త యజమానుల చేతుల్లోకి వెళ్లడం క్రికెట్ ప్రపంచంలో హాట్ టాపిక్‌గా మారింది.

ఆర్‌సీబీ ఫ్రాంచైజీని ఒక శక్తివంతమైన కన్సార్టియం సొంతం చేసుకుంది. ఇందులో ఆదిత్య బిర్లా గ్రూప్ కీలక పాత్ర పోషిస్తుండగా.. ఆ గ్రూప్‌కు చెందిన ఆర్యమన్ బిర్లా చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టనున్నట్లు సమాచారం. అలాగే టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్‌కు చెందిన సత్యన్ గజ్వాని వైస్ చైర్మన్‌గా ఉండనున్నారు. ప్రపంచ ప్రఖ్యాత ప్రైవేట్ ఈక్విటీ దిగ్గజం బ్లాక్‌స్టోన్, అమెరికన్ ఇన్వెస్టర్ డేవిడ్ బ్లిట్జర్ నేతృత్వంలోని బోల్ట్ వెంచర్స్ కూడా ఈ కన్సార్టియంలో భాగస్వాములుగా ఉన్నారు. ఆర్సీబీ పురుష, మహిళల జట్టును కూడా కలిపే ఈ నాలుగు సంస్థల కన్సార్షియం సొంతం చేసుకుంది.

ఈ భారీ ఒప్పందం ఐపీఎల్‌లో ఫ్రాంచైజీల విలువ ఎంత వేగంగా పెరుగుతోందో మరోసారి నిరూపితమైంది. గత కొన్నేళ్లుగా ఐపీఎల్ గ్లోబల్ స్పోర్ట్స్ లీగ్‌లలో అత్యంత విలువైన టోర్నమెంట్‌గా ఎదిగిన నేపథ్యంలో ఇలాంటి డీల్స్ సహజంగానే మారాయి. ఆర్‌సీబీకి ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారీ ఫ్యాన్‌బేస్, బ్రాండ్ విలువ ఈ డీల్‌ను మరింత ప్రత్యేకంగా నిలిపాయి. కొత్త యాజమాన్యం రాకతో ఆర్‌సీబీ జట్టులో వ్యూహాత్మక మార్పులు, కొత్త పెట్టుబడులు, మెరుగైన మౌలిక వసతులు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే స్టార్ ప్లేయర్లు, భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన ఆర్‌సీబీ.. కొత్త యుగంలో మరింత బలంగా మారే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు.

2008లో ఐపీఎల్‌ ప్రారంభం అయినపుడు ఆర్‌సీబీ ఫ్రాంఛైజీ విలువ రూ.500 కోట్లు. అప్పట్లో అత్యధిక ధర పలికిన రెండో ఫ్రాంఛైజీగా నిలిచింది. లిక్కర్ కింగ్ విజయ్‌ మాల్యా ముందుగా ఆర్‌సీబీని కోలుగోలు చేయగా.. ఆ తర్వాత ఆర్థిక వివాదాల్లో చిక్కుకుని దేశం విడిచి పారిపోయాడు. మాల్యా భాగస్వామిగా ఉన్న యుఎస్‌ఎల్‌ సంస్థ.. ఆర్‌సీబీ ఫ్రాంఛైజీని ఇన్నేళ్లు నడిపించింది. 18 ఏళ్ల ఐపీఎల్‌ టైటిల్ నిరీక్షణకు గతేడాదే ఆర్‌సీబీ తెరదించింది. ఐపీఎల్ 2026 అనంతరం ఆర్‌సీబీ కొత్త యాజమాన్యం చేతుల్లోకి వెళ్లనుంది. ఇప్పటికే ప్రముఖ టెక్‌ వ్యాపారవేత్త కల్‌ సోమని నేతృత్వంలోని కన్సార్షియం రూ.15,300 కోట్లకు రాజస్థాన్‌ రాయల్స్‌ ఫ్రాంఛైజీని కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.