Reading Time: 2 minutes
T20 World Cup 2026 Final Grand Closing Ceremony With Ricky Martin Sukhbir And Falguni Pathak

T20 World Cup 2026 Final: 2026 ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ ఉత్కంఠభరితమైన చివరి దశకు చేరుకుంది. ఈ మెగా టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ ఆదివారం (మార్చి 8) అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగనుంది. ఫైనల్‌లో భారత్‌ మరియు న్యూజిలాండ్‌ జట్లు తలపడనున్నాయి. ఈ హై వోల్టేజ్ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం సాయంత్రం 7 గంటలకు ప్రారంభమవుతుంది. టాస్ సాయంత్రం 6:30 గంటలకు జరుగుతుంది. అయితే, ఫైనల్ మ్యాచ్‌కు ముందు అభిమానులను అలరించేందుకు నిర్వాహకులు గ్రాండ్ ముగింపు వేడుకను ఏర్పాటు చేశారు. ఈ వేడుక సాయంత్రం 5:30 గంటలకు ప్రారంభమవుతుంది. క్రికెట్ అభిమానులకు ఇది ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.

ఈ వేడుకలో ప్రముఖ అంతర్జాతీయ పాప్ స్టార్ Ricky Martin ప్రత్యేక ప్రదర్శన ఇవ్వనున్నారు. అలాగే బాలీవుడ్ మరియు పంజాబీ గాయకుడు Sukhbir తన హిట్ పాటలతో ప్రేక్షకులను అలరించనున్నారు. గుజరాతీ జానపద సంగీతానికి ప్రతీకగా నిలిచిన Falguni Pathak కూడా తన ప్రత్యేక ప్రదర్శనతో వేదికను సందడిగా మార్చనున్నారు. సంగీతం మరియు క్రికెట్ కలయికతో అభిమానులకు గుర్తుండిపోయే అనుభవాన్ని అందించేందుకు ఈ కార్యక్రమం సిద్ధమైంది. ఇక క్రికెట్ విషయానికి వస్తే, భారత జట్టు అద్భుత ప్రదర్శనతో ఫైనల్‌కు చేరుకుంది. కెప్టెన్ సూర్యకుమార్‌ యాదవ్‌ నాయకత్వంలో భారత జట్టు సెమీఫైనల్లో ఇంగ్లాండ్‌ జట్టును ఏడు పరుగుల తేడాతో ఓడించింది. ఈ మ్యాచ్ ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగింది. చివరి ఓవర్ వరకు సాగిన ఈ మ్యాచ్ అభిమానులను ఉత్కంఠకు గురి చేసింది.

ఇదే సమయంలో న్యూజిలాండ్‌ జట్టు కూడా అద్భుత ప్రదర్శనతో ఫైనల్‌కు చేరుకుంది. సౌతాఫ్రికాపై తొమ్మిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ కోల్‌కతాలోని ఈడెన్ గార్డె్‌లో జరిగిన విషయం విదితమే.. టీ20 ప్రపంచ కప్ చరిత్రలో భారత జట్టు నాలుగోసారి ఫైనల్‌లోకి ప్రవేశించింది. ఈ మ్యాచ్ గెలిస్తే, భారత్ మూడోసారి టీ20 ప్రపంచ కప్ టైటిల్ గెలిచిన తొలి జట్టుగా కొత్త రికార్డు సృష్టించే అవకాశం ఉంది. మరోవైపు న్యూజిలాండ్ జట్టు రెండోసారి ఫైనల్‌కు చేరుకుంది. కివీస్ ఇప్పటివరకు టీ20 ప్రపంచ కప్ టైటిల్ గెలవలేదు. ఈసారి తమ తొలి ట్రోఫీని గెలుచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. స్వదేశంలో మ్యాచ్ జరుగుతుండటం భారత జట్టుకు కొంత ప్రయోజనంగా భావిస్తున్నారు. అయితే ఐసీసీ టోర్నీల్లో న్యూజిలాండ్ తరచుగా భారత్‌కు గట్టి పోటీ ఇచ్చిన విషయం కూడా గమనించాల్సిందే. టీ20 ప్రపంచ కప్ చరిత్రలో న్యూజిలాండ్‌తో జరిగిన మూడు మ్యాచ్‌లలో భారత్ ఓడిపోయిన రికార్డు ఉంది. కాబట్టి ఈసారి జరిగే ఫైనల్ మ్యాచ్ మరింత ఉత్కంఠభరితంగా ఉండబోతుందని క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.