July 9, 2026

16 ఏళ్లలోపు పిల్లలకు నో ఫేస్‌బుక్, నో ఇన్‌స్టా.. కర్ణాటక సీఎం సంచలన నిర్ణయం

16 ఏళ్లలోపు పిల్లలకు నో ఫేస్‌బుక్, నో ఇన్‌స్టా.. కర్ణాటక సీఎం సంచలన నిర్ణయం
Reading Time: < 1 minute

16 ఏళ్లలోపు పిల్లలకు నో ఫేస్‌బుక్, నో ఇన్‌స్టా.. కర్ణాటక సీఎం సంచలన నిర్ణయం

Caption of Image.

కర్ణాటక సీఎం సిద్ధరామయ్య సంచలన నిర్ణయం తీసుకున్నారు. 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా వాడకుండా నిషేధిస్తున్నట్లు శుక్రవారం రాష్ట్ర బడ్జెట్ 2026ను ప్రవేశపెడుతూ ప్రకటించారు. మొబైల్ ఫోన్లు, సోషల్ మీడియా వల్ల చిన్నారులపై పడుతున్న ప్రతికూల ప్రభావాలను అరికట్టడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు.

పిల్లల్లో మొబైల్ వ్యసనం రోజురోజుకూ పెరగటంతో పాటు.. ఆన్‌లైన్ గేమింగ్‌కు బానిసవ్వడం, చదువుపై శ్రద్ధ తగ్గడం, శారీరక ఫిట్‌నెస్ దెబ్బతినడం వంటి అంశాలపై ముఖ్యమంత్రి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. గత నెలలో బెంగళూరులో జరిగిన వైస్-ఛాన్సలర్ల సదస్సులో ఈ అంశంపై చర్చించిన తర్వాత ప్రస్తుత ప్రకటన వెలువడింది. విద్యావేత్తలు, నిపుణుల అభిప్రాయాలను సేకరించిన తర్వాతే ఈ నిషేధం ఫైనల్ అయ్యింది.

దీనికోసం సోషల్ మీడియాపై వయోపరిమితి విధించిన ఇతర దేశాల విధానాలను కర్ణాటక ప్రభుత్వం క్షుణ్ణంగా అధ్యయనం చేసింది. అంతర్జాతీయ స్థాయిలో విజయవంతమైన మోడల్స్‌ను పరిగణనలోకి తీసుకుని, ఒక ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. పిల్లల మానసిక ఆరోగ్యం, ప్రవర్తన.. వారి ఎదుగుదలపై డిజిటల్ వ్యసనం చూపే ప్రభావాన్ని తగ్గించడమే కర్ణాటక ప్రభుత్వ ప్రధాన ఉద్దేశంగా తెలుస్తోంది. 

మొబైల్ ఫోన్లను వదిలి పుస్తకాల వైపు పిల్లలను మళ్లించేందుకు కర్ణాటక ప్రభుత్వం ఇప్పటికే “మొబైల్ బిడి – పుస్తక హిడి” అనే ప్రచారాన్ని ప్రారంభించింది. గ్రంథాలయాలకు పిల్లలు వెళ్లేలా చేయటం, పుస్తకాలు చదవటం అలవాటు చేసుకునేలా పిల్లలను ప్రోత్సహించడం ద్వారా వారిలో సృజనాత్మకతను పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

ఎకనామిక్ సర్వే 2025-2026 కూడా డిజిటల్ వ్యసనంపై హెచ్చరికలు జారీ చేసింది. గోవా, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాలు కూడా ఇలాంటి నిబంధనలను పరిశీలిస్తున్నాయి. అయితే మెటా లాంటి సోషల్ మీడియా సంస్థలు మాత్రం తల్లిదండ్రులకే యాప్స్ వాడకంపై నిర్ణయాధికారం ఉండాలని అభిప్రాయపడుతున్నాయి. యాప్ స్టోర్లలో టీనేజర్లు యాప్స్ డౌన్లోడ్ చేసుకునేటప్పుడు తల్లిదండ్రుల అనుమతి తీసుకునేలా చట్టాలు ఉండాలని సదరు సంస్థలు సూచిస్తున్నాయి.

©️ VIL Media Pvt Ltd.