Reading Time: < 1 minute

తమిళనాడులో పల్లెలకు నాగదోషం పట్టిందన్న పన్నీర్ సెల్వం…అసెంబ్లీలో ఆసక్తికర చర్చ..!

Caption of Image.

తమిళనాడులో పాము కాటు ఘటనలు పెరగడానికి నాగదోషం కారణమంటూ పన్నీర్ సెల్వం చేసిన వ్యాఖ్యలు అసెంబ్లీలో సరదా చర్చకు దారి తీశాయి. బుధవారం ( సెప్టెంబర్ 2 ) తమిళనాడు అసెంబ్లీలో నాగదోషం, జలదోషం అంశాలపై సరదా చర్చ జరిగింది. పన్నెర్ట్ సెల్వం వ్యాఖ్యలను ఖండించిన ఆరోగ్య శాఖ మంత్రి కేజీ అరుణ్‌రాజ్ ప్రభుత్వం సైన్స్ మీద ఆధారపడి ఉందని, ప్రస్తుతం పాముశాపాలతో కాకుండా సాధారణ జలుబులతోనే పోరాడుతోందని స్పష్టం చేశారు.

మాజీ సీఎం అయిన పన్నీర్ సెల్వం ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అసెంబ్లీలో కాసేపు నవ్వులు పూయించింది. రాష్ట్రంలో చాలా ప్రాంతాలు నాగదోషంతో బాధపడుతున్నాయని..ఆ దైవ శాపం నుండి విముక్తి పొండటానికి రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆలయాల్లో పూజలు నిర్వహించాలని అన్నారు.

బడ్జెట్ లో పాములను శాంతింపజేసే పూజలకు నిధులు కేటాయించలేమని సెటైర్ వేశారు మంత్రి అరుణ్ రాజ్. అంతేకాకుండా, పరిపాలన యంత్రాంగం గ్రహాల అమరికలపై కాకుండా, వైద్య శాస్త్రంపై ఆధారపడి ఉంటుందని ఆయన అన్నారు. ప్రస్తుతం ఆరోగ్యం జలుబు అనే జలదోషం మీదనే దృష్టి పెట్టిందని.. నాగదోషం మీద కాదని అన్నారు అరుణ్ రాజ్. పన్నీర్ సెల్వం అక్కడితో ఆగకుండా అవసరమైతే ప్రభుత్వానికి సహాయపడేందుకు తాంత్రిక బృందాన్ని అందిస్తానని సరదాగా వ్యాఖ్యానించారు.

ఈ సరదా చర్చలో జోక్యం చేసుకున్న క్రీడాశాఖ మంత్రి మాట్లాడుతూ హేతువాద నాయకుడు పెరియార్ ఆదర్శాలలో రాష్ట్రానికి లోతైన మూలాలు ఉన్నాయని అన్నారు. ప్రభుత్వం మంత్రాలతో కాకుండా హేతుబద్ధతతో సమస్యలను పరిష్కరిస్తుందని అన్నారు.

©️ VIL Media Pvt Ltd.