Reading Time: 2 minutes

హైదరాబాద్లో ఇంత మంది ఫేక్ డాక్టర్లా..? 10 మంది అరెస్ట్.. పేర్లు, అడ్రసులు ఇవే..!

Caption of Image.

కుత్బుల్లాపూర్: సైబరాబాద్లో ఫేక్ డాక్టర్ల గుట్టు రట్టు అయింది. మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల్లో అక్రమంగా క్లినిక్లు నడుపుతున్న 10 మంది ఫేక్ డాక్టర్లను సైబరాబాద్ SOT పోలీసులు అరెస్ట్ చేశారు. పక్కా సమాచారంతో కుత్బుల్లాపూర్, RC పురం SOT టీమ్స్, మేడ్చల్, సంగారెడ్డి DM & HO అధికారులు కలిసి ఈ జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. మొత్తం 10 ఫేక్ క్లినిక్లపై దాడులు చేసి 10 మందిని అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ అయిన వారిలో ఎవరికీ MBBS అర్హత లేదు.

ఇంటర్, పదో తరగతి,B.Com, B.Sc, B.Pharmacy చదివిన వారే డాక్టర్లుగా చెలామణి అవుతున్నారు. జగద్గిరిగుట్టకు చెందిన V. బుచయ్య, మేడ్చల్కు చెందిన M. సుధాకర్ చారి, D. అంజా గౌడ్, దేవరాయంజాల్ కు చెందిన రామావత్ ప్రకాష్, సూరారంకు చెందిన మేకల అక్షయ్ కుమార్, బాచుపల్లికి చెందిన K. నారాయణ, కొనపాల బుచ్చిబాబు, RC పురం బండ్లగూడకు చెందిన G. ప్రహ్లాద్, పటాన్ చెరుకు చెందిన S. శ్రీనివాసరావు, P. గంగారాంలను పోలీసులు అరెస్ట్ చేశారు.

వీరిపై మేడ్చల్లో 2, పటాన్ చెరులో 2, జగద్గిరిగుట్ట, పెట్ బషీరాబాద్, సూరారం, బాచుపల్లి, RC పురం, IDA బొల్లారంలో ఒక్కొక్క కేసు చొప్పున కేసులు నమోదు చేశారు. దాడుల్లో 9 స్టెతస్కోపులు, 9 BP మెషీన్లు, 6 థర్మామీటర్లు, పల్స్ ఆక్సీమీటర్, వెయింగ్ మెషీన్, షుగర్ మెషీన్, ప్రిస్క్రిప్షన్ ప్యాడ్స్, సిరంజీలు, ఎక్స్ పైర్డ్ మందులు, సెలైన్ బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఫేక్ డాక్టర్లు చిన్న పిల్లలకు కూడా వైద్యం చేస్తున్నారు. క్లినిక్ లలో బెడ్లు వేసి పేషెంట్లను అడ్మిట్ చేసుకుని, అర్హత లేకుండానే IV ఫ్లూయిడ్స్, సెలైన్ ఎక్కిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇలాంటి నకిలీ వైద్యం వల్ల తప్పుడు నిర్ధారణ, తప్పుడు చికిత్సతో ప్రాణాలు పోయే ప్రమాదం ఉందని పోలీసులు హెచ్చరించారు.

ఈ ఆపరేషన్ సైబరాబాద్ CP ఆదేశాలతో, DCP SOT P. శోభన్ కుమార్ పర్యవేక్షణలో జరిగింది. ఈ ఘటనపై కుత్బుల్లాపూర్ డీసీపీ కోటి రెడ్డి ప్రెస్ మీట్లో మాట్లాడుతూ..ఫేక్ డాక్టర్ల వల్ల ప్రజల ప్రాణాలకే ముప్పు ఉందని, ఇలాంటి నకిలీ క్లినిక్లపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని, నకిలీ డాక్టర్ల దగ్గర వైద్యం తీసుకోవద్దని, డాక్టర్ అర్హత, రిజిస్ట్రేషన్ చెక్ చేసుకున్న తర్వాతే వైద్యం తీసుకోవాలని, మీ పరిసరాల్లో ఇలాంటి క్లినిక్లు ఉంటే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని DCP కోటి రెడ్డి తెలిపారు.

©️ VIL Media Pvt Ltd.