
వరంగల్/వరంగల్ సిటీ/కాశీబుగ్గ, వెలుగు: వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి ఆర్ఐసీయూ వార్డులో మంగళవారం మరోసారి బిల్డింగ్ పైకప్పు పెచ్చులూడి పడ్డాయి. ఆ సమయంలో అక్కడ రోగులు ఎవరూ లేకపోవడంతో ఎవరికీ గాయాలు కాలేదు. రెండు రోజుల కింద ఆరోగ్యశ్రీ వార్డులో పెచ్చులూడి పడిన ఘటనలో ముగ్గురికి గాయాలవగా, ఈ ఘటన మరవక ముందే మరో ఘటన జరగడంతో రోగులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు ఆసుపత్రిలో పర్యటించి వివరాలు తెలుసుకున్నారు.
తోపులాటలో సొమ్మసిల్లిన మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్
వరంగల్ ఎంజీఎం హాస్పిటల్ వద్ద మంగళవారం బీఆర్‍ఎస్ నేతలు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారి తీసింది. ఘటనలో వరంగల్ పశ్చిమ మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ సొమ్మసిల్లి పడిపోయారు. ఎంజీఎంలో స్లాబ్ పెచ్చులూడి పడిన నేపథ్యంలో వినయ్ భాస్కర్ పార్టీ నేతలతో కలిసి హాస్పిటల్ సందర్శనకు వెళ్లారు. కాగా, పేషెంట్లు వారికి చికిత్స అందించే డాక్టర్లు, సిబ్బందికి ఆటంకం కలుగుతుందనే కారణంతో పోలీసులు అడ్డగించారు.
పోలీసులను నెట్టుకుంటూ హస్పిటల్ లోపలకు వెళ్లే ప్రయత్నం చేయడంతో తోపులాట జరిగింది. దీంతో వినయ్ భాస్కర్ సొమ్మసిల్లి పడిపోయారు. కాగా, తనపై పోలీసులు దాడి చేసి కాళ్లు, చేతులను విరిచారని, కడుపులో తన్నారని ఆయన ఆరోపించారు. అనంతరం వినయ్ భాస్కర్‍ను నగరంలోని ఓ ప్రైవేట్ హస్పిటల్ తీసుకెళ్లి చికిత్స అందించారు.
ఈ విషయంపై మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‍కుమార్, కుడా మాజీ చైర్మన్ మర్రి యాదవరెడ్డి, వికలాంగుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ వాసుదేవరెడ్డి పార్టీ ఆఫీస్లో మీడియాతో మాట్లాడారు. ఎంజీఎం హాస్పిటల్ సమస్యలను పట్టించుకోని ప్రభుత్వం.. ప్రశ్నించేందుకు వెళ్లిన వినయ్ భాస్కర్‍ను గాయపరిచిందని విమర్శించారు. ఎంజీఎం ఆసుపత్రిలో పోలీసులు మంగళవారం నాకాబందీ నిర్వహించారు. మూడు గేట్లు మూసివేసి రోగులను తప్ప మిగతా ఎవరినీ అనుమతించలేదు.