
Match-Fixing in Indian Cricket: భారత క్రికెట్‌లో మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు మరోసారి కలకలం రేపుతున్నాయి. ఇటీవల ఢిల్లీ ప్రీమియర్ లీగ్ (డీపీఎల్)లో యువ క్రికెటర్‌ను ఫిక్సింగ్‌కు సంబంధించిన ఓ వ్యక్తి సంప్రదించినట్లు వెలుగులోకి వచ్చింది. అయితే ఆ ప్లేయర్ వెంటనే ఈ విషయాన్ని లీగ్ యాంటీ కరప్షన్ యూనిట్ (ఏసీయు) దృష్టికి తీసుకెళ్లినట్లు ఢిల్లీ క్రికెట్ సంఘం (డీడీసీఏ) వర్గాలు వెల్లడించాయి.
సెంట్రల్ ఢిల్లీ తరఫున డీపీఎల్ 2026లో ఆడిన 23 ఏళ్ల వికెట్ కీపర్-బ్యాటర్ వంశ్ బేడీకి మ్యాచ్ ఫిక్సింగ్‌కు సంబంధించి ఓ వ్యక్తి ‘కరప్ట్ అప్రోచ్’ అయ్యాడట. ఈ విషయాన్ని ఆయన వెంటనే ఏసీయుకి తెలిపినట్లు డీడీసీఏ సీనియర్ అధికారి ఒకరు పీటీఐకి తెలిపారు. వంశ్ బేడీ ఢిల్లీ తరఫున సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఒక టీ20 మ్యాచ్ ఆడాడు. 2025లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో ఉన్నాడు. అయితే గాయం కారణంగా అతడి స్థానంలో ఉర్విల్ పటేల్‌ను చెన్నై యాజమాన్యం తీసుకుంది.
డీడీసీఏ సీనియర్ అధికారి అశోక్ శర్మ తెలిపిన వివరాల ప్రకారం.. సెంట్రల్ ఢిల్లీ ఆటగాడు వంశ్ బేడీని ఫిక్సింగ్ కోసం ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ ఆటగాడు సంప్రదించాడు. సదరు ఆటగాడు అక్కడే ఓ టీ20 లీగ్లో ఆడుతున్నట్లు ఆయన తెలిపారు. అయితే వంశ్ వెంటనే విషయాన్ని ఏసీయుకి తెలియజేశాడు. ఈ విషయంపై డీడీసీఏ ఇప్పటికే బీసీసీఐకి సమాచారం అందించి.. తదుపరి చర్యలపై సలహా కోరింది. ప్రస్తుతం ఏసీయు వద్ద వంశ్ ఫిర్యాదు మినహా మరే ఇతర అధికారిక ఫిర్యాదులు నమోదు కాలేదని డీడీసీఏ వర్గాలు తెలిపాయి.
ఇటీవల ఓ స్టింగ్ ఆపరేషన్‌లో నాగాలాండ్‌కు చెందిన పేసర్ రాచిత్ భాటియా ఐపీఎల్, దేశవాళీ క్రికెట్‌లో మ్యాచ్ ఫిక్సింగ్, స్పాట్ ఫిక్సింగ్‌కు సంబంధించి పలు సంచలన వ్యాఖ్యలు చేసినట్లు వెలుగులోకి వచ్చాయి. అంతేకాకుండా వయసు విభాగాల జట్లలో పిల్లలకు చోటు కల్పించేందుకు తల్లిదండ్రుల నుంచి డబ్బులు తీసుకోవడం వంటి ఆరోపణలకు సంబంధించిన వ్యాఖ్యలు కూడా వెలుగులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా డీపీఎల్లో కరప్ట్ అప్రోచ్ విషయం బయటకు రావడం క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. డీడీసీఏ అపెక్స్ కౌన్సిల్ సభ్యుడు, ప్రముఖ న్యాయవాది శ్యామ్ శర్మ ఈ వ్యవహారంపై స్పందిస్తూ.. యువ ఆటగాళ్లను అవినీతి కార్యకలాపాల్లోకి లాగేందుకు ప్రయత్నించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఎవరైనా తప్పు చేసినట్లు నిర్ధారణ అయితే.. వారికి కఠిన శిక్ష వేయాలని కోరారు.
ఈ వ్యవహారంపై డీడీసీఏ అధికారికంగా స్పందించింది. అయితే ఏ ఆటగాడి పేరు లేదా ఏ ఫ్రాంచైజీ పేరును డీడీసీఏ ప్రస్తావించలేదు. క్రికెట్ సమగ్రతను దెబ్బతీసే ఎలాంటి చర్యలపైనా ‘జీరో టాలరెన్స్’ విధానాన్ని డీడీసీఏ కొనసాగిస్తుందని స్పష్టం చేసింది. సంబంధిత అధికారులు చేపట్టే విచారణకు పూర్తి సహకారం అందిస్తామని, విచారణలో వెల్లడయ్యే అంశాలు, నిబంధనల ఆధారంగానే తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపింది. అలాగే ఆరోపణలు, వాస్తవాల మధ్య తేడాను గుర్తించడం చాలా ముఖ్యమని డీడీసీఏ పేర్కొంది. సరైన విచారణ, ఆధారాలు, నిర్ణయాలు వెలువడే వరకు చట్టపరమైన ప్రక్రియను గౌరవించాలని స్పష్టం చేసింది. ఢిల్లీలో క్రికెట్ సమగ్రత, విశ్వసనీయత, ప్రతిష్ఠను కాపాడేందుకు డీడీసీఏ కట్టుబడి ఉందని వెల్లడించింది.
ఫిక్సింగ్ ఆరోపణలపై వంశ్ బేడీ ఇన్‌స్టాగ్రామ్‌లో ఖండించాడు. తాను స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు సోషల్ మీడియాతో పాటు పలు వెబ్‌సైట్లు వార్తలు ప్రచురించాయని.. ఆ తప్పుడు కథనాల వల్ల తన పరువుకు భంగం కలిగిందన్నాడు. సీఎస్‌కే ఆటగాడికి సంబంధించిన మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలపై తెహెల్కా స్టింగ్ ఆపరేషన్‌లో మాజీ రంజీ క్రికెటర్ రచిత్ భాటియా ప్రస్తావించిన వ్యక్తి తాను కాదని, ఆ ఫిక్సింగ్ కుంభకోణంతో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశాడు. తనపై ఫిక్సింగ్ ఆరోపణలు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలనుకుంటున్నా అని.. దీనికి బాధ్యులైన వారిపై న్యాయ బృందం సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకోనుందని చెప్పాడు. ఇలాంటి కంటెంట్‌ను సృష్టించడం లేదా ప్రచురించడం మానుకోవాలని ఒక్కరికీ వంశ్ బేడీ విజ్ఞప్తి చేశాడు.