Reading Time: < 1 minute
Jc Prabhakar Reddy Announces Plan To Make Tadipatri Beggar Free Within A Month

JC Prabhakar Reddy: అనంతపురం జిల్లా తాడిపత్రిని భిక్షగాళ్ల రహిత పట్టణంగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపడతామని తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రకటించారు. వచ్చే నెల రోజుల్లో పట్టణంలో రోడ్లపై భిక్షాటన చేస్తున్న వారిని గుర్తించి వారికి అవసరమైన సహాయం అందిస్తామని తెలిపారు. భిక్షాటన చేయడాన్ని నిషేధించే చట్టం ఏదీ లేకపోయినా, తాడిపత్రిలో భిక్షగాళ్లు లేకుండా చేయాలన్నదే తమ లక్ష్యమని జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్పారు. కాళ్లు, చేతులు లేని వారు లేదా శారీరకంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు భిక్షాటన చేయాల్సిన పరిస్థితి అర్థం చేసుకోవచ్చని, కానీ ఆరోగ్యంగా ఉండి చిన్న పిల్లలతో కలిసి భిక్షాటన చేయడం బాధాకరమన్నారు.

తల్లిదండ్రులు లేని చిన్నారులు భిక్షాటన చేస్తుంటే వారిని తాను దత్తత తీసుకుని విద్య అందించే బాధ్యత చేపడతానని ప్రకటించారు జేసీ ప్రభాకర్‌ రెడ్డి… ప్రస్తుతం తాడిపత్రిలో భిక్షాటన చేస్తున్న చిన్నారుల సంక్షేమాన్ని తానే చూసుకుంటానని తెలిపారు. అలాగే వృద్ధులు, వికలాంగులు భిక్షాటన చేస్తున్నట్లయితే స్వచ్ఛంద సేవా సంస్థల సహకారంతో వారికి ఆశ్రయం, అవసరమైన సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు. వారి కష్టసుఖాల్లో తాను అండగా ఉంటానని, వారికి అవసరమైన సహాయాన్ని అందిస్తానని హామీ ఇచ్చారు. తాడిపత్రిలో చిన్నారులు భిక్షాటన చేస్తున్న దృశ్యాలను చూసి తన భార్య కూడా ఎంతో బాధపడిందని జేసీ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. నెల రోజుల్లో భిక్షాటన చేస్తున్న వారిని తీసుకువచ్చి స్నానాలు చేయించి, జుట్టు కత్తిరించి, అనంతరం హోమ్ సెంటర్లకు తరలించి పునరావాసం కల్పించే చర్యలు చేపడతామని వెల్లడించారు తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి..