Reading Time: 2 minutes
Vaibhav Sooryavanshi Ipl 2026 Earnings How The 15 Year Old Star Made Over Rs 2 5 Crore

Vaibhav Sooryavanshi IPL 2026 Salary: ఐపీఎల్ 2026 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ తన అద్భుత ప్రదర్శనతో క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు. కేవలం 15 ఏళ్ల వయసులోనే టోర్నీలో అత్యధిక పరుగులు సాధించి ‘ఆరెంజ్ క్యాప్’ గెలుచుకున్న ఈ యువ బ్యాటర్.. తన ఆటతోనే కాకుండా భారీ ఆదాయంతో కూడా వార్తల్లో నిలిచాడు. ఈ సీజన్‌లో వైభవ్ మొత్తం ఆదాయం రూ.2.5 కోట్లకు పైగా ఉంది. ఐపీఎల్ 2026 ద్వారా వైభవ్ ఎంత సంపాదించాడో ఓసారి చూద్దాం.

ఐపీఎల్ మెగా వేలంలో రాజస్థాన్ రాయల్స్ ప్రాంచైజీ వైభవ్ సూర్యవంశీని రూ.1.10 కోట్లకు కొనుగోలు చేసింది. 2026 సీజన్‌లో కూడా అతడిని అదే ఫీజుకు రిటైన్ చేసుకుంది. కేవలం మ్యాచ్ ఫీజుతోనే కాకుండా అద్భుత ప్రదర్శనల ద్వారా కూడా వైభవ్ భారీగా సంపాదించాడు. ఈ సీజన్‌లో 16 మ్యాచ్‌లు ఆడిన వైభవ్.. 776 పరుగులు చేసి టోర్నీ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అతని బ్యాటింగ్ కారణంగా రాజస్థాన్ రాయల్స్ ప్లేఆఫ్స్ వరకు చేరుకుంది. ఐపీఎల్ 2026 ముగింపు వేడుకల్లో వైభవ్ సూర్యవంశీకి అనేక ప్రతిష్టాత్మక అవార్డులు దక్కాయి. వాటితో పాటు భారీ నగదు బహుమతులు కూడా అందుకున్నాడు.

మోస్ట్ వాల్యూబుల్ ప్లేయర్ అవార్డుకు రూ.15 లక్షలు, ఆరెంజ్ క్యాప్ (అత్యధిక పరుగులు) అవార్డుకు రూ.10 లక్షలు, సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ది సీజన్ అవార్డుకు రూ.10 లక్షలు + టాటా సియెర్రా కారు, సూపర్ సిక్సెస్ ఆఫ్ ది సీజన్ అవార్డుకు రూ.10 లక్షలు (72 సిక్సర్లు), ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్ అవార్డుకు రూ.10 లక్షలు వైభవ్ సూర్యవంశీకి దక్కాయి. అవార్డుల ద్వారానే వైభవ్ మొత్తం రూ.55 లక్షలు సంపాదించాడు. మ్యాచ్ ఫీజుతో మరో రూ.1.20 కోట్లు దక్కాయి.

ఐపీఎల్‌లో ప్రతి మ్యాచ్‌కు ఆటగాళ్లకు ప్రత్యేక మ్యాచ్ ఫీజు కూడా లభిస్తుంది. ఒక్కో మ్యాచ్‌కు వైభవ్‌కు రూ.7.5 లక్షలు చెల్లించారు. అతను మొత్తం 16 మ్యాచ్‌లు ఆడటంతో మ్యాచ్ ఫీజు రూపంలోనే రూ.1.20 కోట్లు సంపాదించాడు. సీజన్ మొత్తం అద్భుత ప్రదర్శనలు చేసిన వైభవ్ అనేక మ్యాచ్‌ల్లో ప్రత్యేక అవార్డులు అందుకున్నాడు. ఎలక్ట్రిక్ స్ట్రైకర్ ఆఫ్ ది మ్యాచ్, మోస్ట్ సిక్సెస్ ఆఫ్ ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ వంటి అవార్డులకు ఒక్కోసారి రూ.1 లక్ష చొప్పున నగదు బహుమతి దక్కింది. వీటి ద్వారా కూడా అతనికి అదనపు ఆదాయం లభించింది.

రెటైనర్ ఫీజు రూ.1.10 కోట్లు, మ్యాచ్ ఫీజు రూ.1.20 కోట్లు, అవార్డుల ద్వారా వచ్చిన రూ.55 లక్షలు, ఇతర మ్యాచ్ డే బోనస్‌లను కలిపితే వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ 2026 సీజన్‌లో రూ.2.5 కోట్లకు పైగా సంపాదించాడు. కేవలం 15 ఏళ్ల వయసులోనే ఐపీఎల్‌ను శాసిస్తూ రికార్డులు బద్దలు కొట్టిన వైభవ్.. భవిష్యత్ భారత క్రికెట్‌కు పెద్ద ఆశాకిరణంగా నిలుస్తున్నాడు. మైదానంలో పరుగులు, అవార్డులు, ఆదాయం.. అన్ని రంగాల్లోనూ ఈ యువ సంచలనం ఇప్పుడు పెద్ద సెన్సేషన్.