Reading Time: < 1 minute
Ponnam Prabhakar Demands Apology From Pawan Kalyan To Telangana People Over Past Remarks

Ponnam Prabhakar – Pawan Kalyan: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా గతంలో వ్యాఖ్యలు చేసిన పవన్ కళ్యాణ్ ముందుగా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని, ఆ తర్వాతే హైదరాబాద్‌లో నవనిర్మాణ సభ నిర్వహించాలని డిమాండ్ చేశారు.

పవన్ కళ్యాణ్ తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకిస్తూ గతంలో మాట్లాడారని.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు తాను 11 రోజుల పాటు అన్నం తినలేదని బహిరంగంగా చెప్పారని మంత్రి గుర్తు చేశారు. తెలంగాణపై విషం కక్కుతూ, తెలంగాణ ప్రజల భావోద్వేగాలను దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేసిన వ్యక్తికి ఇక్కడ సభ నిర్వహించే నైతిక హక్కు లేదన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొంటే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, అయితే అదే రోజున హైదరాబాద్‌లో నవనిర్మాణ సభ నిర్వహించడం వెనుక రాజకీయ ఉద్దేశాలు ఉన్నాయని ఆరోపించారు. తెలంగాణలో విద్వేషాలను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలనే ప్రయత్నం జరుగుతోందని, ఇందులో బీజేపీతో పవన్ కళ్యాణ్‌కు లోపాయికారీ ఒప్పందం ఉందని విమర్శించారు.

తెలంగాణ ప్రజలపై గతంలో చేసిన వ్యాఖ్యలకు పవన్ కళ్యాణ్ బహిరంగంగా క్షమాపణ చెప్పాలని మంత్రి డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన వ్యక్తి ఇక్కడికి వచ్చి సభలు నిర్వహించడం సమంజసం కాదన్నారు. “తెలంగాణ కళ్ల దృష్టి పడితే కోనసీమ కొబ్బరి చెట్లు ఎండిపోతాయని చెప్పిన పవన్ కళ్యాణ్, తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలి” అని వ్యాఖ్యానించారు. అలాగే నవనిర్మాణ సభను గుజరాత్, ఉత్తరప్రదేశ్, తమిళనాడు లేదా కేరళలో కాకుండా హైదరాబాద్‌లోనే ఎందుకు నిర్వహిస్తున్నారో ప్రజలకు చెప్పాలని ప్రశ్నించారు. బీజేపీ నాయకత్వాన్ని మెప్పించడానికే తెలంగాణలో సభలు పెడుతున్నారా అని నిలదీశారు.

ఆంధ్రప్రదేశ్ ప్రజలు పవన్ కళ్యాణ్‌కు అధికార బాధ్యతలు అప్పగించారని, అక్కడి సమస్యలపై దృష్టి సారించాలని మంత్రి సూచించారు. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ వంటి కీలక అంశాలపై పోరాడకుండా తెలంగాణలో రాజకీయాలు చేయడం సరైన విధానం కాదన్నారు. తెలంగాణపై వ్యతిరేక భావజాలంతో వ్యవహరించిన పవన్ కళ్యాణ్ తక్షణమే తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని, లేకపోతే ప్రజలు దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తారని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.