
CSK vs MI : ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఉత్కంఠభరితమైన పోరుగా పిలవబడే ఎల్ క్లాసికో (ముంబై వర్సెస్ చెన్నై) మరోసారి క్రికెట్ అభిమానులకు అదిరిపోయే ఉత్సాహాన్ని అందించింది. ఐదుసార్లు ఛాంపియన్ల మధ్య జరిగిన ఈ బిగ్ ఫైట్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ఘనవిజయం సాధించడమే కాకుండా, ముంబై ఇండియన్స్ (MI) పై ఒక అరుదైన రికార్డును నెలకొల్పింది. ముంబైని వారి సొంత గడ్డపైనే చిత్తు చేసిన ధోనీ సేన (ప్రస్తుతం రుతురాజ్ సేన), ఐపీఎల్ చరిత్రలో ఏ జట్టుకు సాధ్యం కాని రీతిలో ఒక ఘనతను తన ఖాతాలో వేసుకుంది.
శనివారం రాత్రి చెన్నైలోని ఎం.ఏ.చిదంబరం స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ను 8 వికెట్ల తేడాతో ఓడించడం ద్వారా చెన్నై సూపర్ కింగ్స్ ఒక భారీ రికార్డును నెలకొల్పింది. ఐపీఎల్ చరిత్రలో ముంబై ఇండియన్స్‌పై 20 విజయాలు సాధించిన తొలి జట్టుగా సీఎస్‌కే నిలిచింది. ఇప్పటివరకు ఈ రెండు జట్ల మధ్య రికార్డులు పరిశీలిస్తే.. ముంబై 21 సార్లు గెలవగా, చెన్నై ఇప్పుడు 20వ విజయాన్ని అందుకుని వారి దరిదాపుల్లోకి వచ్చేసింది. ఈ సీజన్‌లో ముంబైతో జరిగిన రెండు మ్యాచుల్లోనూ చెన్నై గెలవడం విశేషం.
160 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై జట్టుకు కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చాడు. అజేయంగా 67 పరుగులు చేసి జట్టును ముందుండి నడిపించాడు. అతనికి తోడుగా రూ. 14.20 కోట్లు పెట్టి కొనుగోలు చేసిన స్టార్ ఆటగాడు కార్తీక్ శర్మ (54 పరుగులు) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 98 పరుగుల అజేయ భాగస్వామ్యాన్ని నెలకొల్పి, మరో 11 బంతులు మిగిలి ఉండగానే జట్టును విజయతీరాలకు చేర్చారు. ఈ విజయంతో చెన్నై పాయింట్ల పట్టికలో ఆరో స్థానానికి చేరుకుంది.
అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 159 పరుగులు మాత్రమే చేయగలిగింది. నమన్ ధీర్ (57) ఒంటరి పోరాటం చేసినా, మిగిలిన బ్యాటర్లు పెద్దగా రాణించలేకపోయారు. ముఖ్యంగా చెన్నై బౌలర్ నూర్ అహ్మద్ తన మాయాజాలంతో కీలకమైన వికెట్లు తీసి ముంబైని దెబ్బతీశాడు. యంగ్ బౌలర్ అన్షుల్ కాంబోజ్ 3 వికెట్లతో రాణించగా, జేమీ ఓవర్టన్ ఒక వికెట్ తీశాడు. ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా మ్యాచ్ అనంతరం స్పందిస్తూ, ఈ సీజన్ మాది కాదు, చెన్నై అన్ని విభాగాల్లోనూ మాకంటే మెరుగ్గా ఆడిందని అంగీకరించారు.
ఈ ఓటమితో ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్స్ ఆశలు దాదాపుగా అడుగంటాయి. ఇప్పటివరకు ఆడిన 9 మ్యాచ్‌ల్లో ముంబైకి ఇది 7వ ఓటమి. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఆ జట్టు 9వ స్థానంలో కొట్టుమిట్టాడుతోంది. మరోవైపు ఈ సీజన్‌లో ముంబై టీమ్ టీ20 క్రికెట్‌లో 50 వేల పరుగులు చేసిన తొలి జట్టుగా రికార్డు సృష్టించినప్పటికీ, మైదానంలో వరుస ఓటములు అభిమానులను నిరాశకు గురిచేస్తున్నాయి. చెన్నై మాత్రం ఈ విజయంతో ఆత్మవిశ్వాసాన్ని పుంజుకుని టాప్-4 రేసులో నిలిచింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..