Reading Time: 2 minutes
Cm Chandrababu Says Tdp Workers Are Real Leaders At Party Cluster Training Meet

CM Chandrababu: టీడీపీలో కార్యకర్తలే అసలైన అధినేతలని, వారు రైట్ రాయల్‌గా బతకాలని అన్నారు టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రాబాబు నాయుడు.. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన క్లస్టర్ ఇన్‌చార్జ్‌ల శిక్షణా తరగతులకు చంద్రబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా క్లస్టర్ ఇన్‌చార్జ్‌లతో ప్రత్యేకంగా ‘కాఫీ కబుర్లు’ కార్యక్రమం నిర్వహించి పార్టీ సిద్ధాంతాలు, సంస్థాగత బలోపేతం, ప్రభుత్వ పథకాల అమలు వంటి అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా మాట్లాడిన చంద్రబాబు, ప్రతి కార్యకర్తను నాయకుడిగా తీర్చిదిద్దుతామని అన్నారు. ఆ అవకాశాన్ని పార్టీ కేడర్ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రజలకు మంచి చేస్తే వారు ఎప్పటికీ గుర్తుంచుకుంటారని పేర్కొన్నారు. టీడీపీలో కార్యకర్తలే అసలైన అధినేతలని, వారు రైట్ రాయల్‌గా బతకాలని అన్నారు. పార్టీ కూడా కార్యకర్తలకు అదే స్థాయిలో గౌరవం ఇస్తుందని స్పష్టం చేశారు.

Read Also: PSL 2026: పాకిస్థాన్‌కు బంగ్లాదేశ్ గట్టి దెబ్బ.. లీగ్ మధ్యలోనే ముస్తఫిజుర్ రెహమాన్‌ తొలగింపు

రాష్ట్ర అభివృద్ధి సుదీర్ఘ కాలం స్థిరమైన పాలనతోనే సాధ్యమవుతుందని చంద్రబాబు అన్నారు. 2019లో వైసీపీ గెలిచిన తర్వాత రాష్ట్రం అభివృద్ధిలో వెనుకబడిందని విమర్శించారు. తనను అరెస్టు చేసినా, పార్టీని ఇబ్బందులకు గురి చేసినా కార్యకర్తలను మాత్రం కాపాడుకున్నానని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురి చేశారని ఆరోపించారు. 2019 నుంచి 2024 మధ్య జరిగిన విధ్వంసాన్ని ప్రజలకు ఎప్పటికప్పుడు గుర్తు చేయాలని చంద్రబాబు పార్టీ నేతలకు సూచించారు. ప్రస్తుతం తాము చేస్తున్న మంచిని ప్రజలకు వివరించాలని, ప్రభుత్వ పథకాల అమలుకు పడుతున్న కష్టాన్ని తెలియజేయాలని అన్నారు చంద్రబాబు..

వైసీపీని ఉద్దేశిస్తూ ‘కిల్లర్ పార్టీ’, ‘గొడ్డలి పార్టీ’ అంటూ విమర్శించారు టీడీపీ అధినేత.. ఆ పార్టీ ఆలోచనా విధానాన్ని అధ్యయనం చేసి తగిన కౌంటర్ ఇవ్వాలని పార్టీ శ్రేణులకు సూచించారు. ఇటీవల జరిగిన దస్తగిరి హత్య, ఎమ్మెల్సీ అనంతబాబు వ్యవహారాన్ని చంద్రబాబు ప్రస్తావించారు. కడపలో సొంత పార్టీ కార్యకర్తనే హత్య చేశారని ఆరోపించారు. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసును ఎన్నికల వరకు వాడుకున్నారని, అధికారంలోకి వచ్చాక న్యాయం కోరిన సునీతారెడ్డిని బెదిరించారని విమర్శించారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేయిస్తున్నారని, ఇలాంటి రాజకీయ శైలి తన జీవితంలో చూడలేదని చంద్రబాబు అన్నారు. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసును కూడా ప్రస్తావిస్తూ, నేరాలకు పాల్పడి తరువాత ఆరోపణలు ఇతరులపై నెడుతున్నారని విమర్శించారు. వైసీపీ పాలనలో జరిగిన అరాచకాలను ప్రజలకు నిరంతరం వివరించాలని, పార్టీ కార్యకర్తలు ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వ కార్యక్రమాలను చాటాలని పిలుపునిచ్చారు టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..