Reading Time: < 1 minute

బీసీ కులగణనపై అక్టోబర్ 8న ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం : జాజుల శ్రీనివాస్ గౌడ్

Caption of Image.
  • ఓబీసీ కాలం చేర్చే వరకు తక్షణమే జనగణన ప్రక్రియను ఆపివేయాలి 
  • బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ 

హైదరాబాద్, వెలుగు: దేశవ్యాప్తంగా జరిగే జాతి జనగణనలో ఎస్సీ, ఎస్టీ కాలమ్‌‌‌‌లతో పాటు ఓబీసీ కాలమ్‌‌‌‌ను కూడా చేర్చాలని డిమాండ్ చేస్తూ వచ్చే నెల 8న ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్నట్టు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. బీసీ కులాల లెక్కలు తేలుస్తామని స్పష్టమైన హామీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం.. ఆ మాట నిలబెట్టుకోకుండా బీసీలను మోసం చేస్తుందని జాజుల మండిపడ్డారు.

ఈ మోసాన్ని ఎండగట్టి, కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిన ప్రధాన రాజకీయ పార్టీలు సైతం ఓబీసీ కాలమ్ అంశంపై మాట్లాడకుండా మౌనం వహిస్తున్నాయని ఆరోపించారు. జనగణనపై జాతీయ స్థాయిలో అఖిలపక్షం, సామాజిక నిపుణులు, మేధావులతో సమావేశం ఏర్పాటు చేయాలని గతంలో డిమాండ్ చేసినప్పటికీ కేంద్రం నుంచి ఎటువంటి స్పందన రాలేదని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే బీసీ సంఘాల ఆధ్వర్యంలో నేషనల్ లెవెల్‌‌‌‌లో అఖిలపక్ష పార్టీలు, నిపుణులు, మేధావులతో సమావేశం నిర్వహించాలని నిర్ణయించినట్టు ఆయన తెలిపారు.

బీసీలపై ప్రధాని నరేంద్ర మోదీకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే వెంటనే జనగణన ప్రక్రియను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. గత ఏడాది ఆగస్టు14న 40 ప్రశ్నలతో కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్‌‌‌‌ను తక్షణమే రద్దు చేయాలని కోరారు. లేనిపక్షంలో కేంద్రం దిగివచ్చే వరకు జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు.
 

©️ VIL Media Pvt Ltd.